US Attacked Venezuela: వెనిజులాపై అమెరికా దాడి చేసింది. అధ్యక్షుడు నికోలస్ మదురో ను అరెస్టు చేసింది. అంతేకాదు, వెనిజులా ప్రాంతంలో తన పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. సహజంగా అమెరికా ఒక దేశం మీద దాడి చేసింది అంటే కచ్చితంగా ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటుంది. దీనికి వెనిజుల ప్రాంతం మినహాయింపు కాదు.
పక్కనే ఉన్న దేశం మీద పడి.. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఈ పని చేశామని చెప్పుకుంటున్న అమెరికా.. లాడెన్ దొరికినప్పటికీ.. ఉగ్రవాదుల శిబిరాలు ఆపరేషన్ సిందూర్ ద్వారా బయటికి ప్రపంచానికి తెలిసినప్పటికీ.. పాకిస్తాన్ విషయంలో అమెరికా ఎందుకు సైలెంట్ గా ఉంటుందో అర్థం కావడం లేదని జాతీయవాదులు చెబుతున్నారు. అమెరికా ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శమని ఆరోపిస్తున్నారు.
పాకిస్తాన్ దేశంలో ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన ఇమ్రాన్ ఖాన్ కొన్ని సంవత్సరాలుగా జైల్లో ఉంటున్నాడు. దొడ్డి దారిన అధ్యక్షుడైన అలీ జార్దారి, ప్రధానమంత్రి షరీఫ్, సైనికాధిపతి మునిర్ పాకిస్తాన్ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నప్పటికీ అమెరికా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయితే వీరి వెనుక అమెరికా ఉందని చాలా రోజులుగా ఆరోపణలు ఉన్నాయి. పైగా ఇటీవల మునీర్ అమెరికా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. అధ్యక్షుడిని కాదని, ప్రధానమంత్రిని కూడా కాదని సైనికాధిపతితో అమెరికా అధ్యక్షుడు భేటీ అయ్యారంటే ట్రంప్ విధానాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదులు శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారని అమెరికా అనేక సందర్భాల్లో ఆరోపించింది. లాడెన్ కు పాకిస్తాన్ ఆవాసం కల్పించిందని.. అందువల్లే అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాన్ని కోల్పోవాల్సి వచ్చిందని అనేక సందర్భాలలో చెప్పింది. కానీ అదే అమెరికా తన ప్రయోజనాల కోసం పాకిస్తాన్ దేశానికి వంత పాడటం మొదలు పెట్టింది. ఒకవేళ లాటిన్ అమెరికా దేశాలు ఏకమై.. అమెరికా పెత్తనం మీద ఉక్కు పాదం మోపితే.. ఆ తర్వాత ఆ దేశం ప్రపంచం మీద కాదు కదా.. కనీసం తన మీద తాను కూడా పెత్తనం సాగించలేదని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ విషయంలో ఒక రాగం.. భారత్ విషయంలో మరొక రాగం అమెరికా ఆలపిస్తూ ఉంటుందని.. అంతిమంగా తన ప్రయోజనాల కోసం మాత్రమే అమెరికా పనిచేస్తుందని.. విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.