World war 2: రెండో ప్రపంచ యుద్ధం సృష్టించిన ఉత్పాతం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ నాటి రోజులను చరిత్ర తాలూకు పుస్తకాలలో చదువుతుంటే వెన్నులో వణుకు పుడుతుంది. అయితే నార్తర్న్ ఐర్లాండ్ లో రెండవ ప్రపంచ యుద్ధం నాటి బాంబును గుర్తించారు. అయితే అది పేలకుండా అలానే ఉంది. దీంతో ఏదైనా జరగొచ్చనే ఆందోళనతో 400 మంది నివాసం ఉంటున్న ఇళ్లను అప్పటికప్పుడు ఖాళీ చేయించారు.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నార్తర్న్ ఐర్లాండ్ లోని కాంటి డౌన్ ప్రాంతంలో న్యూ టౌనార్డ్స్ లో భీకరమైన పోరు జరిగింది. ఆ సమయంలో పలు దేశాలకు చెందిన సైనికులు పోటాపోటీగా దాడులు చేసుకున్నారు. ఆ ప్రాంతంలో వందలాదిమంది చనిపోయారు. కాలక్రమంలో ఆ ప్రాంతం అభివృద్ధి చెందడం మొదలైంది. ప్రస్తుతం అక్కడ విస్తృతంగా గృహాల నిర్మాణాలు చేపడుతున్నారు.
బాంబు ఎలా దొరికిందంటే..
ఇటీవల ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి భవనం నిర్మించేందుకు ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా కొంతమంది పని వాళ్ళతో ఆ స్థలాన్ని చదును చేయిస్తున్నాడు. అయితే అతడికి ఒక విచిత్రమైన వస్తువు కనిపించింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు సంఘటనా స్థలానికి వచ్చి.. దానిని బాంబుగా తేల్చారు. అనంతరం ప్రత్యేక బృందం అక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఆ బాంబు రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన సమయం నాటిదని గుర్తించారు. అది ఇంకా పేలకపోవడంతో.. అందులో ఉన్న రసాయనాలను నిర్వీర్యం చేసేందుకు నడుం బిగించారు. మరో ఐదు రోజుల్లో ఆ పని మొత్తం పూర్తవుతుందని పోలీసులు చెబుతున్నారు.
పోలీసులు ఏమంటున్నారంటే..
ఆ పని పూర్తయ్యే వరకు సమీప ప్రాంతానికి చెందినవారు ఇతర ప్రాంతాల్లో ఉండాలని చెబుతున్నారు. “మేము చెబుతున్నది పూర్తిగా నిజం.. ఎందుకంటే ఆ బాంబు ఇంకా పేలలేదు. ఒకవేళ పేలితే నష్టం తీవ్రంగా ఉంటుంది. ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నాం. ప్రజలు మాకు సహకరించాలి. ఇంకా కొన్ని రోజులు ఓపిక చేసుకుని పడితే ఈ పని పూర్తవుతుంది. ఆ తర్వాత వారు నిశ్చింతగా అక్కడ ఉండొచ్చు. బాంబును గుర్తించిన ఆ ప్రాంతంలో రోడ్డులను మొత్తం మూసివేశాం. ఇతర వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదని” పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బాంబులో ప్రమాదకర విస్ఫోటన పదార్థాలు
ఆ బాంబులో ప్రమాదకర విస్పోటన పదార్థాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఆ బాంబు కనక పేలితే జరిగే అనర్ధాలు తీవ్రంగా ఉంటాయని బాంబ్ స్క్వాడ్ నిపుణులు చెబుతున్నారు. అందువల్లే ప్రజలను దూరంగా తరలించామని చెబుతున్నారు. బాంబ్ లభ్యమైన ప్రాంతంలో చుట్టూ తాత్కాలిక ఫెన్సింగ్ ఏర్పాటు చేశామని వివరిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని, సోషల్ మీడియాలోనూ ప్రచారం చేశామని వివరిస్తున్నారు. అయితే ఆ బాంబు ఎందుకు పేలలేదో, అందుకు దారి తీసిన పరిస్థితి ఏమిటో కొద్ది రోజుల తర్వాత తెలుస్తుందని చెబుతున్నారు.