Mohamed Muizzu: మాల్దీవుల అధ్యక్షుడి పదవి మూడినట్టేనా?

సోమవారం ప్రారంభమైన సభలో మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ కలగజేసుకోవడంతో సభ్యులు శాంతించారు. ఈ క్రమంలో జరిగిన చర్చ సందర్భంగా అక్కడి పార్లమెంటు సభ్యులు మాల్దీవుల అధ్యక్షుడు నియమించిన నూతన మంత్రులకు వ్యతిరేకంగా ఓటు వేశారు.

Written By: Anabothula Bhaskar, Updated On : January 30, 2024 12:44 pm
Follow us on

Mohamed Muizzu: “మా పర్యాటకంతో పోలిస్తే భారత్ చాలా వెనుకబడి ఉంది. పైగా అక్కడ మురికి ఉంటుంది. అలాంటివారు మాతో ఎలాంటి పోటీ పడగలుగుతారు.. అక్కడ పేడ కంపు వాసన వస్తుంది.” ఇలా నెత్తి మాసిన ట్విట్లు చేసి భారత ప్రజల ఆగ్రహానికి గురయ్యారు మాల్దీవుల మంత్రులు. బయట నుంచి ఒత్తిడి రావడంతో, భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో ఆ మంత్రులను మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు తొలగించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అంతేకాదు ఆ చైనా అనుకూల మహమ్మద్ ముయిజ్జు పదవికి ఇప్పుడు ఎసరు వచ్చింది. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ముయిజ్జుకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు అక్కడి ప్రతిపక్షాలు దాదాపుగా ఏకమయ్యాయి. దీనికోసం అవసరమైన సంతకాలను ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) సేకరించింది. ముయిజ్జు ఎంపిక చేసిన మంత్రి మండలి ఆమోదించేందుకు ఆ దేశ పార్లమెంట్ సభ్యులు ఆదివారం సమావేశమయ్యారు. ముయిజ్జు వ్యవహార శైలి నచ్చకపోవడం, చైనా అనుకూల నిర్ణయాలు తీసుకోవడం, భారత్ వ్యతిరేక విధానాల వల్ల పర్యాటక ఆదాయం పడిపోతుండటం, ఈ పరిణామాలతో ఆదివారం సమావేశమైన అక్కడి పార్లమెంట్ అట్టుడికి పోయింది. అధికార, ప్రతిపక్ష ఎంపీలు తోపులాటకు దిగారు. ముష్టి ఘాతాలకు పాల్పడ్డారు. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒకరిద్దరు ఎంపీలకు గాయాలు కూడా అయ్యాయి. గొడవ ఎంతసేపటికి సర్దుమణగకపోవడంతో సోమవారానికి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు అక్కడి పార్లమెంటు స్పీకర్ ప్రకటించారు.

సోమవారం ప్రారంభమైన సభలో మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ కలగజేసుకోవడంతో సభ్యులు శాంతించారు. ఈ క్రమంలో జరిగిన చర్చ సందర్భంగా అక్కడి పార్లమెంటు సభ్యులు మాల్దీవుల అధ్యక్షుడు నియమించిన నూతన మంత్రులకు వ్యతిరేకంగా ఓటు వేశారు.. మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు సభ్యులు అందులోను మెజారిటీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆ మంత్రులు తమ పదవులు కోల్పోయినట్టే.. ఈ క్రమంలో ముయిజ్జు కు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అక్కడి ప్రతిపక్షాలు నడుం బిగించాయి. నేపథ్యంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాల్దీవులు పార్లమెంటరీ గ్రూప్ నాయకుడు, ఈదాఫుషి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు అహ్మద్ సలీం అలియాస్ రెడ్ వేవ్ సలీం మాట్లాడారు. ముయిజ్జు ను తొలగించేందుకు మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ( ఎండీపీ) ప్రయత్నాలను నిలువరిస్తామని ప్రకటించారు.” అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించే ముందు వారు ఒక ఆలోచన చేయాల్సి ఉంటుంది. వారు మొదట మనందరినీ చంపాల్సి ఉంటుంది” అని అహ్మద్ సలీం ఉటంకించారు. “మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ( ఎండీపీ), డెమొక్రాట్ భాగస్వామ్యంతో అభిశంసన తీర్మానం కోసం తగినంత సంతకాలు సేకరించింది. అయినప్పటికీ వారు దానిని ఇంకా సమర్పించాల్సి ఉంటుందని” సన్. కామ్ అనే వార్తా సంస్థ ప్రకటించింది. ఇక సోమవారం జరిగిన మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ పార్లమెంటరీ గ్రూపు సమావేశంలో అభిశంసన తీర్మానాన్ని సమర్పించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని “ది ఎడిషన్. ఎం వీ” నివేదించింది.

గత ఏడాది సెప్టెంబర్ లో మాల్దీవుల అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. భారత్ కి అత్యంత అనుకూలమైన అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ ను ముయిజ్జు ఓడించాడు.. ఆ తర్వాత ముయిజ్జు క్రమక్రమంగా భారత్ వ్యతిరేక ధోరణి అవలంబించడం ప్రారంభించాడు. ముందుగా ఆయన క్యాబినెట్లో మంత్రులు గిచ్చి కయ్యం పెట్టుకునే విధంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనకు వెళితే.. దానిని ఉద్దేశించి చవక బారు వ్యాఖ్యలు చేశారు. దానిపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ముయిజ్జు అంతగా నష్ట నివారణ చర్యలు చేపట్టలేదు. పైగా ఈ వివాదం జరుగుతుండగానే చైనా పర్యటనకు వెళ్లారు. భారత్ తో కుదుర్చుకున్న ఒప్పందాలపై సమీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం నేపథ్యంలో భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. అక్కడి హోటళ్ళు జన సంచారం లేక బోసిపోతున్నాయి. విమాన సంస్థలు సర్వీస్లను రద్దు చేస్తున్నాయి. ఈ పరిణామం దేశ ఆర్థికానికి మంచిది కాదని భావిస్తూ అక్కడి ప్రతిపక్ష పార్టీలు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.. అతడు పదవిలో ఉండేందుకు అర్హుడు కాదని పేర్కొంటూ అభిశంసన తీర్మానానికి తెర లేపారు.. ఇప్పటికే సంతకాల సేకరణ కూడా పూర్తి చేశారు. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు గానీ ప్రస్తుతానికి అయితే అక్కడ పరిస్థితి ఏమంత బాగోలేదు. మరోవైపు అక్కడి అధికార పార్టీ ఎంపీ అహ్మద్ తోరిక్ మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న సంఘటనలు సరిగా లేవని.. మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ తన ఆశయాలకు విభిన్నంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రస్తుత అధ్యక్షుడిని తొలగించేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని వివరించారు. కేబినెట్ ఆమోదంపై సోమవారం జరిగిన ఓటింగ్ సమయంలో కూడా తమ పార్టీ సభ్యులు కొందరు విప్ లైన్ కు వ్యతిరేకంగా ఓటు వేశారని ప్రకటించారు. అందుకే మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ కోరుకున్న మెజారిటీ రాలేదని ఆయన గుర్తు చేశారు. “ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడిని తొలగించాలి అంటే మాల్దీవ్ రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో కనీసం 53 ఓట్లు అవసరం. అక్కడ పార్లమెంట్లో 87 మంది సభ్యులు ఉంటారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మాల్దీవ్ డెమొక్రటిక్ పార్టీ, డెమొక్రటిక్ పార్టీ 56 ఎంపీలను గెలుచుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాల్దీవ్ డెమొక్రటిక్ పార్టీ, డెమొక్రటిక్ సభ్యులు కలిసినప్పటికీ ముయిజ్జు ను ఓడించేంత సంఖ్యా బలం ఏర్పడదని” తోరిక్ అభిప్రాయపడ్డారు..”ముయిజ్జు కు వ్యతిరేకంగా ఓటు వేయకుండా నిరాకరించే సభ్యులు రెండు పార్టీలలోనూ ఉన్నారని” పేర్కొన్నారు. ఇక నవంబర్ 17న మాల్దీవుల అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముయిజ్జు భారత వ్యతిరేక విధానాలు అవలంబించడం మొదలుపెట్టాడు. మార్చి 15లోగా తమ దేశం నుంచి భారత్ 88 మంది సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని కోరాడు.