KTR: ఒక్కసారి గెలిచి చూడు సమాజం నీకు పరిచయం అవుతుంది.. ఒక్కసారి ఓడి చూడు సమాజానికి నువ్వ పరిచయం అవుతావు అన్నది మంచి స్ఫూర్తినిచ్చే నానుడి. కానీ తెలంగాణలో ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఒక్కసారి గెలిస్తే సమాజం నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది. ఒక్కసారి ఓడితే సమాజం అసలు స్వరూం ఏంటో.. నీకు ఇచ్చే విలువ ఏంటో తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే బెల్లం ఉన్న చోటే ఈగలు, చీమలు ఉంటాయి అన్నట్లుగా ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు మారిపోయాయి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను నెత్తిన పెట్టుకున్న నేతలంతా అధికారం పోగానే ఇప్పుడు అధికార పార్టీవైపు చూస్తున్నారు.
ఐదు మున్సిపాలిటీలు ‘హస్త’గతం
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను నాయకులు వీడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, రాజేందద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఇటీవల సీఎం రేవంత్‌ను కలిశారు. ఎందుకు కలిశారు అంటే.. నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటున్నారు. గతంలో ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని కేసీఆర్, ప్రస్తుతం అడగ్గానే అపాయింట్‌మెంట్ ఇస్తున్న రేవంత్‌రెడ్డిని గులాబీ నేతలు పోల్చుకుంటున్నారు. ఏదైనా సమస్య చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిని కలవాలంటే నాడు ప్రగతి భవన్ గేటు దాటలేని పరిస్థితి. కానీ, నేడు అపాయింట్‌మెంట్ అడిగిన వారంలోపే సీఎంవో నుంచి పిలుపు వస్తుంది. దీంతో గులాబీ నేతలు కూడా తెలంగాణ ప్రజల్లా మార్పు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో ఐదు మున్సిపాలిటీలు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ వశమయ్యాయి. మరో ఐదు వరకు అయ్యే అవకాశం ఉంది.
నియంత పాలన..
ఇన్నాళ్లూ కేసీఆర్ సాగించిన నియంత పాలన నుంచి బీఆర్‌ఎస్ నేతలు రియలైజ్ అవుతున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్, బీఆర్‌ఎస్ తప్ప మరేపార్టీ తనకు ఎదురు నిలవకూడాదన్న భావనతో పనిచేశారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ ఇలా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను లాక్కున్నారు. డబ్బులు ఇష్టానుసారం వెదజల్లారు. తనను ప్రశ్నించేవాడు ఉండకూడదని, 2019లో కాంగ్రెస్‌కుప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. నిరంకుశ, అహంకార పూరిత పాలన అంటే ఎలా ఉంటుందో గతంలో పుస్తకాల్లో చదివేవాళ్లం. కానీ గడిచిన పదేళ్లు బీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు ప్రత్యక్షంగా చూశారు. ప్రజలు కూడా కొంత ఎదుర్కొన్నారు. దాని ప్రభావమే 2023 ఎన్నికల ఫలితాలు.
కాంగ్రెస్‌లోకి వలసలు..
పరిస్థితి చూస్తుంటే త్వరలో కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు ఉండే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల వరకు వేచి ఉండి.. ఆ తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు హస్తం గూటికి చేరడం ఖాయమనిపిస్తోంది. ఇదేంటని అడిగితే.. చాలా మంది అది తమ మాతృ సంస్థ అని చెప్పుకుంటున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లో ఎదిగిన నాయకులు బీఆర్‌ఎస్‌లో చాలా మంది ఉన్నారు. వారికి రేవంత్‌తో పరిచయం, సాన్నిహిత్యం ఉంది. దీంతో కాంగ్రెస్‌లో చేరడానికి ఈ పరిచయాన్ని బాటగా మార్చుకుంటున్నారు.
సిరిసిల్లలోనూ..
ఇక కేసీఆర్ కొడుకు తెలంగాణ మాజీ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ఇలాఖాలోనూ గులాబీ నేతలు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెబుతున్నారు. ముస్తాబాద్ మండలానికి చెందిన 50 మంది నాయకులు, సర్పంచులు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. సిరిసిల్ల మున్సిపాలిటీలోనూ బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా ఏకమయ్యారు. సిరిసిల్లలో తనకు పోటీదారు లేకుండా చేసుకున్న కేటీఆర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయనతో కలిసి నవవడానికి బీఆర్‌ఎస్ నాయకులు ఆసక్తి చూపడం లేదు. అధికార పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారు.
కేసీఆర్ పదేళ్లు చేసిన అతిపెద్ద రాజకీయ పొరపాటు అణచివేత. విభజన. ఇప్పుడు వీటినే కాంగ్రెస్ చేస్తోంది. దీంతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు దిమ్మతిరిగి బొమ్మ కనబడుతోంది. బీఆర్‌ఎస్‌ను వీడుతున్నా ప్రజల్లో బీఆర్‌ఎస్‌ను పాపం అనే పరిస్థితి లేకపోవడం కేసీఆర్, కేటీఆర్ అహంకార పూరిత, నియంత పాలనకు నిదర్శనం అన్న చర్చ జరుగుతోంది.