Gaza: మంచి యుద్ధం ఉండదు. చెడ్డ శాంతి ఉండదు. ఓ మహాశయుడు చెప్పిన మాటలు ఇవి. శతాబ్దాల క్రితమే ప్రపంచ పోకడలను ఉద్దేశించి బెర్నార్డ్ షా పై వ్యాఖ్యలను చేశారు. వాస్తవానికి యుద్ధం వల్ల సాధించేది ఉండదు. శాంతి వల్ల కోల్పోయేది కూడా ఉండదు. కానీ ప్రపంచ దేశాల అధినేతలకు ఈ విషయం అర్థం కాదు. ఎందుకంటే ప్రపంచాన్ని జయించాలనే వారి కోరిక యుద్ధానికి దారితీస్తుంది. ఆ యుద్ధాల వల్ల ప్రపంచం మొత్తం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇప్పటికే తొలి రెండు ప్రపంచ యుద్ధాల వల్ల ఈ భూగోళం చాలా వరకు ప్రభావితమైంది. దాదాపు అన్ని దేశాలు తీవ్రంగా నష్టపోయాయి.
ఆధునిక కాలంలో యుద్ధాలు తగ్గడం లేదు.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంతవరకు ముగిసిపోవడం లేదు. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య పోరు తగ్గడం లేదు. ఈ పోరు మధ్యలో కొన్ని దేశాలు రావడంతో మరింత రావణ కాష్టం రగులుతోంది. ఇజ్రాయిల్ సాంకేతిక పరంగా.. సైన్యం పరంగా బలమైన దేశం కావడంతో ఏమాత్రం తగ్గడం లేదు. పైగా పశ్చిమ ఆసియా ప్రాంతంలో తమను ఇబ్బంది పెడుతున్న దేశాలకు చుక్కలు చూపిస్తోంది. ఎంతటి దేశమైనా సరే ఇజ్రాయిల్ తగ్గడం లేదు. పాలస్తీనా పై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఆ దేశం మొత్తం సర్వనాశనమైంది. పాలస్తీనాలో అతిపెద్ద నగరమైన గాజా పూర్తిగా కుప్పకూలిపోయింది.
యుద్ధం వల్ల గాజా ప్రాంతంలో ఆకలి కేకలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా మహిళల కష్టాలు దారుణంగా ఉన్నాయి. పిల్లల కడుపు నింపడానికి తల్లులు రాయడానికి వీల్లేని బాధను అనుభవిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు తల్లుల అవసరాలను ఆసరాగా తీసుకొని వారి శరీరాన్ని ఇష్టపడుతున్నారు. తమ కోరికలు తీరిస్తేనే ఆహారం అందిస్తామని మహిళలను వేధిస్తున్నారని.. లోబరుచుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మానవతా సహాయం ముసుగులో దారుణాలకు పాల్పడుతున్నారని ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.
” గాజా లో పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇక్కడి ప్రజలు నరకం చూస్తున్నారు. ఆకలి బాధలు తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళల అవసరాలను ఆసరాగా చేసుకొని కొంతమంది వారి వాంఛలు తీర్చుకుంటున్నారు. అడ్డగోలుగా ప్రవర్తిస్తూ నరకం చూపిస్తున్నారు. ఇటువంటి దారుణాలు ఇంకా ఎన్ని చూడాలోనని” ఆ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. తమ సర్వేలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని ఆ సంస్థ చెబుతోంది.