Homeఅంతర్జాతీయంUS Iran tensions latest news: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా–ఇరాన్‌ దాడులు తీవ్రం!

US Iran tensions latest news: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా–ఇరాన్‌ దాడులు తీవ్రం!

US Iran tensions latest news: తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలిపేందుకు, సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పశ్చిమాసియాలో అగ్గి రాజేశాడు. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధం మొదలు పెట్టాడు. దాదాపు 50 రోజులపాటు తీవ్ర దాడులు జరిగాయి. అయితే ఇరాన్‌ ఎక్కడా లొంగలేదు. మరోవైపు అమెరికాకు తీవ్ర నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ శాంతి చర్చలు అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పాకిస్తాన్‌ను మధ్యవర్తిగా నిలబెట్టాడు. తాత్కాలిక సీజ్‌ఫైర్‌ అంటూ ప్రకటనలు చేశారు. కానీ ఒప్పందం కుదరలేదు. తాజాగా సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించిన అమెరికా ఇరాన్‌పై వరుస దాడులతో విరుచుకుపడుతోంది. మరోవైపు ఇరాన్‌ మాత్రం శాంతి ఒప్పందానికి మొగ్గు చూపుతోంది. అమెరికా మాత్రం దాడులతో ఇరాన్‌ను దారిలోకి తెచ్చుకోవాలనుకుంటోంది. మళ్లీ భీకర దాడులు చేస్తోంది. తాజాగా అమెరికా దళాలు ఇరాన్‌లోని కీలక సైనిక లక్ష్యాలపై దాడులు చేయడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు కొత్త మరింత పెరిగాయి. ఇరు వైపులా ప్రతిదాడులు, రక్షణ వ్యవస్థల సక్రియతతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

ఆత్మరక్షణ చర్యలా?
అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించిన ప్రకారం, ఇరాన్‌లోని గురుక్‌ నగరం, ఖేష్‌ ద్వీపంలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అంతర్జాతీయ జలాల్లో తమ ఎంక్యూ–1 డ్రోన్‌ను కూల్చివేయడం, ఇతర దాడి చర్యలకు స్పందనగా ఇవి జరిగినట్లు వివరించింది. దాడుల్లో ఇరాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ, గ్రౌండ్‌ స్టేషన్లు, రెండు అటాక్‌ డ్రోన్లు నాశనమైనట్లు అమెరికా తెలిపింది. ఈ వ్యవస్థలు తమ యుద్ధ నౌకలకు ప్రమాదం కలిగించే స్థాయిలో ఉన్నాయని ఆరోపించింది. ఇది స్వచ్ఛమైన ఆత్మరక్షణ చర్య అని వాదిస్తున్నప్పటికీ, ప్రాంతీయ సమీకరణాలపై దీని ప్రభావం భారీగా ఉంటుంది.

ఇరాన్‌ ప్రతిస్పందన…
అమెరికాడులకు ప్రతిగా ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్‌స్‌(ఐఆర్‌జీసీ) ప్రతిదాడులు మొదలు పెట్టింది. సిరిక్‌ ద్వీపంలోని టెలికామ్‌ టవర్లపై అమెరికా దాడి చేసినందుకు ప్రతీకారంగా ఒక అమెరికన్‌ ఎయిర్‌బేస్‌ను లక్ష్యం చేసుకున్నట్లు ప్రకటించింది. ఏ బేస్‌ అనేది స్పష్టం చేయకపోయినా, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ముందు కువైట్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు సక్రియమైనట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్‌ ఏరోస్పేస్‌ ఫోర్సెస్‌ ప్రతిదాడి చేశాయని ఐఆర్‌జీసీ వెల్లడించింది. ఈ పరస్పర దాడులు ఘర్షణను మరింత విస్తృతం చేసే అవకాశం ఉంది.

ఖేష్‌ ద్వీపం ఎందుకు కీలకం?
హార్ముజ్‌ జలసంధిని నియంత్రించడంలో ఖేష్‌ ద్వీపం ఇరాన్‌కు వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇక్కడ అండర్‌గ్రౌండ్‌ సౌకర్యాల్లో యాంటీ–షిప్‌ క్రూజ్‌ క్షిపణులు, బాలిస్టిక్‌ మిసైల్స్‌ సిద్ధంగా ఉన్నాయి. గడా–380, హై–2 సిల్క్‌వార్డ్‌ వంటి క్షిపణులతోపాటు, 800 కి.మీ. పరిధి గల ఖియామ్‌–1, ఖైబర్‌ షెకన్, ఘద్ర్, ఎమాద్‌ వంటి బాలిస్టిక్‌ క్షిపణులు ఇక్కడ మోహరించబడి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వేగవంతమైన స్పీడ్‌ బోట్లు, తీరప్రాంత క్షిపణి బ్యాటరీలు కూడా ఈ ప్రాంతంలో ఇరాన్‌ సిద్ధతలో ఉన్నాయి. జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. అందువల్ల ఈ ద్వీపాన్ని నిష్క్రమించడం అమెరికాకు కూడా వ్యూహాత్మక అవసరంగా మారింది.

ఈ ఘర్షణలు ఇప్పటికే సున్నితమైన పశ్చిమాసియా పరిస్థితిని మరింత అస్థిరం చేశాయి. హార్ముజ్‌ జలసంధి ప్రపంచ తైల సరఫరాకు కీలకమైనది కావడంతో, ఏదైనా విస్తృత యుద్ధం గ్లోబల్‌ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇరాన్‌ తన భూభాగంపై దాడులను సహించదని స్పష్టం చేస్తుండగా, అమెరికా తన మిత్రదేశాల భద్రతను కాపాడుతుందని నొక్కి చెప్పుతోంది. ప్రస్తుతం రెండు వైపులా దాడులు జరుగుతున్న నేపథ్యంలో దౌత్య ప్రయత్నాలు ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ప్రపంచం ఈ పరిణామాలను ఆందోళనతో పర్యవేక్షిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version