Homeఅంతర్జాతీయంTelangana RTC Strike 2026: నాడు శ్రీనివాస్ రెడ్డి.. నేడు శంకర్ గౌడ్.. రేవంత్, కెసిఆర్...

Telangana RTC Strike 2026: నాడు శ్రీనివాస్ రెడ్డి.. నేడు శంకర్ గౌడ్.. రేవంత్, కెసిఆర్ కుట్రలలో సమిధలైన ఆర్టీసీ కార్మికులు

Telangana RTC Strike 2026: ఈ శీర్షికను ఇలా పెట్టడానికి.. ఏ మాత్రం చింతించడం లేదు. ఎందుకంటే పాలకులు మాట తప్పినప్పుడు.. తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దారి తప్పినప్పుడు.. అంతిమంగా సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఎంచుకునే దారి సమ్మె. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడవచ్చు. పాలకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండి ఉండవచ్చు. కానీ దిన దిన గండంగా బతుకును ఈడ్చేవారికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే ఆర్టీసీని విలీనం చేసుకోవచ్చు. కార్మికుల కోరినట్టుగా చాలావరకు సమస్యలను పరిష్కరించవచ్చు. కానీ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా వ్యవహరించిన పాలకులు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరో విధంగా వ్యవహరించడమే ఇక్కడ అసలైన సమస్య.

తెలంగాణలో ప్రస్తుతం ఆర్టిసి కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు , ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో పనిచేసే శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. శరీరం మీద పెట్రోల్ చల్లుకొని నిప్పు అంటించుకున్నాడు. ప్రస్తుతం అతడు ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శంకర్ గౌడ్ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత గులాబీ పార్టీ రంగంలోకి దిగింది. ఈ ఆందోళనను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఇదే సమయంలో గులాబీ పార్టీ గతంలో తాను చేసిన ఘోరమైన దారుణాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది..

గతంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులు ఇదే స్థాయిలో నిరసనలు చేపట్టారు. నాడు కార్మికులను ఒళ్ళు బలిసి సమ్మె చేస్తున్నారని గులాబీ పార్టీ నాయకులు ఆరోపించారు. ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డి అనే ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పరిస్థితి విషమించి చనిపోయాడు. నాడు శ్రీనివాస్ రెడ్డి ఘటనను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. కనీసం అతని అంత్యక్రియలు కూడా సజావుగా జరగకుండా చేసింది. అడుగడుగునా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసి.. అర్ధరాత్రి పూట అంత్యక్రియలు జరిపేలా చేసింది. కనీసం ఆ ఫోటోలను కూడా మీడియాలో రాకుండా జాగ్రత్త పడింది. నాడు ఆర్టీసీ కార్మికుల సమ్మెను చులకనగా చేసి గులాబీ పార్టీ నేతలు మాట్లాడారు. సొంత మీడియాలో ఆర్టీసీ కార్మికులను ఆందోళనకారులుగా చిత్రీకరించారు. అంతేకాదు, ఆర్టీసీ కార్మికుల సమ్మె వార్తలు కనీసం కవర్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. ఇదే కెసిఆర్ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను పూర్తిగా మర్చిపోయారు.. పైగా ఆర్టీసీ కార్మికుల సమ్మెను అర్థం లేని వ్యవహారం లాగా కొట్టి పారేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని రకాలుగా నిరసనలు జరిగినప్పటికీ.. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళనలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఫలితంగా తెలంగాణ ఉద్యమం మరోవైపు మళ్ళింది. అందువల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైంది. ఇప్పటికీ ఆర్టీసీ కార్మికులు చేసిన తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యమకారులు గొప్పగా చెప్పుకుంటారు. అటువంటి ఆర్టీసీ కార్మికులను కెసిఆర్ హయాంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అడుగు అడుగున వంచించింది. ఇదే విషయాన్ని కార్మికులు అనేక సందర్భాల్లో చెప్పారు.

ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విషయానికి వస్తే.. కెసిఆర్ ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తోంది. కార్మికుల సమస్యలను ఇంతవరకు పట్టించుకోలేదు. ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రతిపాదనను కూడా నిజం చేసి చూపించలేదు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దీనికి తోడు కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను కూడా ఇవ్వలేదు. అనేక దఫాలుగా కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో మరో మాటకు తావు లేకుండా కార్మికులు సమ్మె మార్గాన్ని ఎంచుకున్నారు. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. కానీ, కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే.. వారి కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. అంతంత మాత్రం వేతనాలు.. బండెడు చాకిరి.. పేరుకుపోయిన మహాలక్ష్మి బకాయిలు.. ఇవన్నీ ఆర్టీసీని నష్టాలపాలు చేస్తున్నాయి. అందువల్లే కార్మికులు ఈ సమ్మెబాట ఎంచుకున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రేవంత్ ప్రభుత్వం పట్టింపులకు పోవద్దు. పంతాలకు దిగొద్దు. కార్మికుల సమస్యలను మానవత దృక్పథంతో ఆలోచించి.. పరిష్కారానికి కృషి చేయాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ముందుండి నడిచారు. బస్సులను నిలిపివేసి.. తెలంగాణ ఉద్యమానికి సరికొత్త రూపును తీసుకొచ్చారు. వారి సేవలను గుర్తించి అయినా సరే.. ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. అన్ని డిమాండ్లు కాకపోయినప్పటికీ.. మెజారిటీ డిమాండ్లైనా సరే నెరవేర్చే ప్రయత్నం చేయాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version