
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచంలోని విజ్ఞానం మొత్తం మన చేతిలో ఉన్నట్టే. కావాల్సిన సమాచారం మొత్తం ఒక్క క్లిక్ దూరంలోనే ఉంటుంది. తెలియని ప్రతీ విషయం తెలుసుకోవచ్చు. కానీ.. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు చూస్తే మాత్రం అదొక అక్రమాల పుట్ట. అశ్లీల సామ్రాజ్యానికి అడ్డా. తాము చేసేదాన్ని, చూసేదాన్ని.. ఎవరో చూస్తారన్న భయం లేదు. అడ్డుకునే అవకాశమే లేదు. అందుకే.. విచ్చలవిడి వ్యవహారం పెరిగిపోయింది. తాజాగా వెల్లడైన ఓ సర్వే నివేదికను పరిశీలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే.
ఈ రిపోర్టు ప్రకారం.. 18 నుంచి 25 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారిలో దాదాపు 44 శాతం మంది అశ్లీల వీడియోలు చూస్తున్నారట. 26 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉన్నవారిలో 41 శాతం ఆ వీడియోలను వీక్షిస్తున్నారు. 36 నుంచి 44 మధ్య ఉన్నవారు 6 శాతం, 45 నుంచి 55 ఏళ్ల వయసులో ఉన్నవారు నాలుగు శాతం ఈ అశ్లీల సామ్రాజ్యంలో గడుపుతున్నట్టు అంచనా. మొత్తంగా.. స్మార్ట్ ఫోన్లు ఉన్నవారిలో దాదాపు 90 శాతం మంది నిత్యం ఒక సమయంలో అశ్లీల వీడియోలు చూస్తున్నట్టు చెప్పింది ఆ సర్వే.
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారం సంచలనం రేకెత్తించడంతో.. ఈ అశ్లీల వీడియోల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. నిజానికి పాతికేళ్ల క్రితం పరిస్థితి వేరు. ఎవరైనా అశ్లీల వీడియోలు చూడాలంటే.. అదో పెద్ద ప్రహసనం. వీడియో పార్లర్ల వద్దకు వెళ్లి, అత్యంత రహస్యంగా వీడియో క్యాసెట్లు తెచ్చుకునేవారు. అది కూడా అందరికీ లభించేవి కావు. పరిచయం ఉన్నవారికి మాత్రమే గుట్టుచప్పుడు కాకుండా చేతిలో పెట్టేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. కేవలం ఒకే ఒక్క క్లిక్ చాలు. అశ్లీల సామ్రాజ్యపు కీకారణ్యంలోకి ఘనమైన స్వాగతం లభిస్తుంది.
అయితే.. ఒక్కసారి ఇందులోకి వెళ్తే దాదాపుగా వెనక్కి తిరిగివచ్చే పరిస్థితి ఉండదని నిపుణులు చెబుతున్నారు. కొద్ది మంది మినహా.. మిగిలిన వారంతా బానిసలుగా మారిపోతున్నారని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి ముదిరితే.. మానసిక సమస్యలు కూడా చుట్టు ముడతాయని అంటున్నారు. ఇవి చూసిన వారు.. ఆ ఉద్రేకంలో తాము కూడా అలా చేయాలని భావిస్తూ.. నేరాలకు సైతం పాల్పడుతున్నారు. ఎన్నో అత్యాచారాలకు ఈ అశ్లీల వీడియోలు కూడా కారణమవుతున్నాయనే అభిప్రాయం ఉంది. ఈ కారణంతోనే.. ఆ మధ్య బ్యాన్ చేసే ప్రతిపాదన కూడా కేంద్రం చేసింది. అయితే.. అది మరోవిధమైన మానసిక ఇబ్బందికి కారణమవుతుందని, అంతేకాకుండా.. అది వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకోవడం కూడా అవుతుందన్న వాదనలతో బ్యాన్ ఎత్తేసింది. మరి, ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలన్నదే అసలు సమస్య.