Russia Population Distribution East Vs West: రష్యా.. ప్రంపచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తి. విస్తీర్ణం 17.1 మిలియన్ చ.కి.మీలు. ప్రపంచంలోనే అతిపెద్దది. 11 కాలమండలాలు, యూరప్–ఏషియా రెండు ఖండాల వరకు వ్యాపించి ఉంది. ఉత్తరాన ఆర్కిటిక్ మంచు నుంచి దక్షిణాన కజకిస్తాన్ ఎడారి వరకు, పశ్చిమాన బాల్టిక్ సముద్రం నుంచి తూర్పున పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించింది. కానీ విచిత్రం ఏమిటంటే, జనాభాలో 80 శాతం కేవలం 20 శాతం భూభాగంలో (పశ్చిమ యూరప్ రష్యా) నివసిస్తున్నారు. మిగిలిన 80 శాతం భూభాగం (సైబీరియా, ఫార్ ఈస్ట్)లో కేవలం 20 శాతం జనాభా మాత్రమే ఉంది. ఈ ఖాళీ భూమి ఎందుకు? ఎందుకు ప్రజలు తూర్పు వైపు నివసించడానికి ఇష్టపడరు?
రష్యాను రెండుగా విభజిస్తే..
రష్యాను రెండు భాగాలుగా చూడాలి. పశ్చిమాన మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్, నోవోసిబిర్కస్, వ్లాడివోస్టాక్ నగరాలు ఉన్నాయి. వాతావరణం నివాసానికి అనుకూఏలంగా ఉంటుంది. వ్యవసాయానికి అనుకూలం. ఆర్థిక కేంద్రాలు, పరిశ్రమలు, రైల్వే, వాణిజ్యం ఉన్నాయి. తూర్పున మంచుతో కప్పబడి ఉంటుంది. కానీ ఖనిజాలు, చమురు, గ్యాస్, బొగ్గు, బంగారం, యురేనియం నిల్వలు ఉన్నాయి. కానీ నివాస యోగ్యం కాదు. మాస్కో (రాజధాని), సెయింట్ పీటర్స్‌బర్గ్ (సాంస్కృతిక కేంద్రం) పశ్చిమంలోనే ఉన్నాయి.
చారిత్రక కారణాలు..
స్లావిక్ మూలాలు నుంచి సోవియట్ బలవంతం వరకు
రష్యా చరిత్ర వెనక్కి వెళ్తే, మొదట్లో చిన్న స్లావిక్ తెగలు వోల్గా నది, డ్నీపర్ నది తీరాలలో (నేటి పశ్చిమ రష్యా, ఉక్రెయిన్) నివసించేవి. ఇక్కడ భూమి సారవంతంగా ఉండి, వ్యవసాయానికి అనుకూల వాతావరణం ఉండేది. యూరల్ పర్వతాలకు అవతలి వైపు (సైబీరియా) పరిస్థితి భిన్నంగా ఉండేది తీవ్ర చలి, మంచు, నివాసానికి అనుచితం. సామ్రాజ్య విస్తరణ సమయంలో (16–19వ శతాబ్దాలు) జార్లు ప్రజలను తూర్పు వైపు తరలించడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ నివసించడం కష్టమైంది. జోసెఫ్ స్టాలిన్ పాలనలో (1930–50లు) లక్షల మందిని బలవంతంగా సైబీరియాకు తరలించారు. గులాగ్ శిబిరాల్లో బంధించి, కఠిన పనులు చేయించారు. తక్కువ ఆహారం, చిన్న నివాసాలు, తీవ్ర చలి వల్ల చాలా మంది మరణించారు. సోవియట్ యూనియన్ ట్రాన్స్–సైబీరియన్ రైల్వే (9,289 కి.మీ., 1916లో పూర్తి) నిర్మించి, తూర్పు–పశ్చిమ కనెక్టివిటీ కల్పించింది. కొత్త నగరాలు (నోరిల్స్క్ మాగదన్), పరిశ్రమలు నిర్మించి, సైబీరియా ఖనిజాలు, చమురు, గ్యాస్‌ను ఆర్థిక వ్యవస్థకు వినియోగించుకుంది. అయినా ప్రజలు స్వచ్ఛందంగా అక్కడ నివసించడానికి ఇష్టపడలేదు.
వాతావరణం, భౌగోళిక అడ్డంకులు..
సైబీరియాలో 60% భూమి పెర్మాఫ్రాస్ట్ (శాశ్వత మంచు)తో కప్పబడి ఉంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత –50 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. వ్యవసాయం సాధ్యం కాదు. కేవలం 3 నెలలు మాత్రమే పంట పండుతుంది. రోడ్లు, రైల్వేలు మంచులో చిక్కుకుపోతాయి. నిర్మాణాలు ఖరీదైనవి (మంచు కారణంగా ఫౌండేషన్లు బలపరచాలి). పశ్చిమ రష్యాలో వోల్గా నది వ్యవసాయం, రవాణాకు సహాయపడుతుంది. ఐరోపాకు దగ్గరగా ఉండటం వల్ల వాణిజ్యం, సంస్కృతి, సదుపాయాలు అభివృద్ధి చెందాయి.
ఆర్థిక కేంద్రీకరణ:..
సోవియట్ యూనియన్ నుంచి ఇప్పటి వరకు పెట్టుబడులు పశ్చిమ రష్యాకే ప్రాధాన్యం ఇచ్చాయి. మాస్కో చుట్టూ 30 శాతం జీడీపీ కేంద్రీకృతమై ఉంది. ఉద్యోగ అవకాశాలు, వ్యాపార కార్యాలయాలు, విద్య, వైద్యం ఇక్కడే ఉన్నాయి. తూర్పున ఖనిజాలు, చమురు ఉన్నా, ఎక్కువ మంది తాత్కాలిక కార్మికులు మాత్రమే పని చేస్తారు. శాశ్వత నివాసం కాదు.
రష్యా జనాభా 144 మిలియన్లు (2026), కానీ తగ్గుముఖం పడుతోంది. ప్రభుత్వం తూర్పు రష్యాకు ప్రజలను ఆకర్షించడానికి ఉచిత భూమి, పన్ను రాయితీలు, ఉద్యోగాలు అందిస్తోంది. కానీ వాతావరణం, సదుపాయాల లోపం వల్ల ఫలితం లేదు. చైనా సరిహద్దులో ఉన్న ఫార్ ఈస్ట్‌లో చైనీస్ వలసదారులు పెరుగుతున్నారు.ఇది రష్యాకు ఆందోళన కలిగిస్తోంది.