Thailand Visa Policy: భారతీయ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రదేశాలలో థాయిలాండ్ ఒకటి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) డేటా ప్రకారం.. ఏప్రిల్, జూన్ మధ్య 11.6 లక్షల మంది భారతీయులు నేరుగా థాయ్‌లాండ్‌కు ప్రయాణాలు సాగించారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్య 2019 రికార్డును అధిగమించవచ్చు. థాయిలాండ్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పర్యాటకంపై ఆధారపడి ఉంటుంది. 10 నవంబర్ 2023న భారతీయులకు ఉచిత వీసా సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. థాయ్‌లాండ్‌లో భారతీయులకు ఉచిత వీసా సౌకర్యం మొదట్లో మే 2024 వరకు ఉండగా, తర్వాత నవంబర్ 10 వరకు పొడిగించబడింది. అయితే ఇప్పుడు థాయ్‌లాండ్ ఈ సదుపాయంలో మార్పులు చేయనుంది. బుధవారం, న్యూఢిల్లీలోని థాయ్‌లాండ్ ఎంబసీ వీసా నిబంధనలకు సంబంధించి మరోసారి పెద్ద ప్రకటన చేసింది.
మారనున్న వీసా నిబంధనలు
జనవరి 1, 2025 నుండి భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌ల కోసం ఇ-వీసా సదుపాయాన్ని ప్రారంభిస్తున్నట్లు థాయ్‌లాండ్ రాయబార కార్యాలయం తెలిపింది. ఆఫ్‌లైన్ పేమెంట్ మోడ్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఎంబసీ ప్రకటించిందని ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది. అయితే, భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు పర్యాటకం, షార్ట్-బిజినెస్ ప్రయోజనాల కోసం 60 రోజుల వీసా మినహాయింపు సౌకర్యం తదుపరి ప్రకటన వరకు అమలులో ఉంటుందని కూడా ప్రకటన పేర్కొంది. థాయిలాండ్ భారతీయులు సందర్శించడానికి మరియు సెలవుదినానికి అత్యంత ఇష్టమైన విదేశీ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. బ్యాంకాక్, పట్టాయా, ఫుకెట్, చియాంగ్ మాయి, కో స్యామ్యూయ్ వంటి ప్రాంతాలు భారతీయులు ఎక్కువగా సందర్శించడానికి ఇష్టపడతారు. ఆగ్నేయాసియాలో ఉన్న ఈ దేశం భారతీయ వెడ్డింగ్ ప్లానర్లు, హనీమూన్ టూరిజం ఆపరేటర్లలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది.
థాయ్‌లాండ్‌లో అత్యధిక స్థాయిలో గృహ రుణ సంక్షోభం
మరోవైపు, థాయ్‌లాండ్ పెద్ద రుణ సంక్షోభంతో పోరాడుతోంది, గృహ రుణాన్ని ఎదుర్కోవటానికి దేశ యువ ప్రధాని పటోంగ్‌టర్న్ షినవత్రా ప్రభుత్వం బుధవారం కొత్త రుణ ఉపశమన చర్యలను ప్రకటించింది. థాయ్‌లాండ్ గృహ రుణం సుమారు 500 బిలియన్ డాలర్లు, ఆగ్నేయాసియాలో గృహ రుణాలలో అత్యధిక స్థాయి.
థాయ్‌లాండ్ ఆర్థిక వ్యవస్థకు భారతీయుల సహకారం
2019 సంవత్సరంలో సుమారు 20 లక్షల మంది భారతీయులు థాయ్‌లాండ్‌ను సందర్శించారు. ఇది మునుపటి సంవత్సరం కంటే చాలా ఎక్కువ. 2020 లో కరోనా మహమ్మారి తరువాత, థాయ్‌లాండ్‌లో భారతీయ పర్యాటకుల సంఖ్య మరోసారి పెరగడం ప్రారంభమైంది, దీని కారణంగా దేశ, విదేశీ మారక నిల్వలు పెరిగాయి. థాయ్‌లాండ్‌కు వచ్చే పర్యాటకుల విషయంలో భారత్ నాలుగో స్థానంలో ఉండగా, మలేషియా, చైనా, దక్షిణ కొరియా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. 2023 సంవత్సరంలో 16 లక్షలకు పైగా భారతీయులు థాయ్‌లాండ్‌ను సందర్శించారు, ఇది 2019 సంఖ్య కంటే తక్కువ, అయితే ఈ సంవత్సరం ఈ రికార్డును కూడా బద్దలు కొట్టవచ్చని భావిస్తున్నారు. ఇందులో థాయ్‌లాండ్ వీసా రహిత విధానం కీలక పాత్ర పోషించిందని, ఇప్పుడు కొత్త సంవత్సరంలో మార్పు రాబోతోందని భావిస్తున్నారు.