US elections 2025: అగ్రరాజ్యం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ 2.0 పాలనపై ఏడాది తిరగక ముందే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మామూలు వ్యతిరేకత కాదు.. అసలు వీడిని ఎందుకు ఎన్నుకున్నామా అన్నంతగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇటీవలే లక్షల మంది నో కింగ్ పేరుతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఇక ట్రంప్ విధానాలతో అమెరికాలో 30 రోజులుగా షట్‌డౌన్ కొనసాగుతోంది. ఉద్యోగులు, ప్రజలు, విదేశాలకు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. ముఖ్యంగా న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో పొలిటికల్ లెఫ్ట్ భావజాలానికి చెందిన జోహ్రాన్ మమ్ ఘనవిజయాన్ని సాధించడం అనూహ్య పరిణామంగా మారింది. ఇక వర్జీనియా, న్యూజెర్సీ వంటి కీలక గవర్నర్ ఎన్నికల్లోనూ పార్టీకి పరాజయం తప్పలేదు. ఇది ట్రంప్ లీడర్ షిప్‌ని కూడా ప్రశ్నించేలా చేసేసింది.
ప్రజాభిప్రాయంలో మార్పునకు సంకేతం..
ఈ పరాజయాలు అమెరికాలో సమకాలీన రాజకీయ ధోరణుల్లో గణనీయమైన మార్పునకు సంకేతం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రిపబ్లికన్ పార్టీలోని నిర్ణయాలు, ఎక్స్‌ట్రీమ్ రైట్ పాలసీలను ఓటర్లు తిరస్కరించారనేందుకు ఇది సంకేతమని భావిస్తున్నారు. ట్రంప్ పాలన శైలిపై ఉన్న విభేదాలు, సంప్రదాయ నియమనిర్ధారణాలకు వ్యతిరేకంగా జరిగిన ప్రసంగాలు, సామాజిక అంశాలపై పార్టీ వైఖరికి వ్యతిరేకంగా ఈ ఫలితాలు వచ్చాయని భావిస్తున్నారు. ట్రంప్ వ్యక్తిగత ఇమేజ్‌పైనా ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయనీ, ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.
రాబోయే ఎన్నికలపై ప్రభావం..
ఈ ఎన్నికల ఫలితాలు రిపబ్లికన్ పార్టీ పెద్దగా విశ్లేషించుకోవాల్సిన అంశంగా మారాయి. ట్రంప్ ఆధిపత్యం క్రమంగా ఆ పార్టీని ప్రజల వద్ద విపరీత మైనస్ పాలసీలతో ముడిపడేలా చేసింది. డెమోక్రాటిక్ భావజాలానికి ఉన్న పెరుగుతున్న ఆదరణను నిర్లక్ష్యం చేస్తే, రాబోయే మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లు తిరిగి నిలబడటం మరింత కష్టమవుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీ లీడర్‌షిప్, పాలసీ కారణంగా త్వరలోనే ‘ట్రంప్ శకం’ ముగిసిపోతుందనే సంకేతాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.