Bangladesh : బంగ్లాలో అల్లర్లు.. పారిపోయిన ప్రధాని హసీనా.. ఆశ్రయమించిన భారత్‌.! అసలేం జరిగిందంటే?

రిజర్వేషన్లలో మార్పు ఆదేశంలో చిచ్చు రేపింది. కొన్ని రోజులుగా అల్లర్లు జరుగుతున్నాయి. ఈ అల్లర్ల కారణంగా ఇప్పటి వరకు 300 మంది మరణించారు. ఆదివారం(ఆగస్టు 4న) ఒక్కరోజే 90 మంది మరణించారు. దీంతో సైన్యం రగంలోకి దిగింది. ప్రధానిని హెచ‍్చరించింది. దీంతో ఆమె దేశం విడిచి పారిపోయారు.

Written By: Raj Shekar, Updated On : August 5, 2024 6:21 pm

sheikh hasina resigns

Follow us on

Bangladesh : మన పొరుగు దేశం.. మన మిత్రదేశం బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అంశం కొన్ని రోజులుగా చిచ్చు రేపింది. స్వాంతంత్రోద్యమంలో భాగంగా పాకిస్తాన్‌లో జరిగిన యుద్ధంలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని షేక్‌ హసీలా నిర్ణయించారు. దీనికి ఆదేశ సుప్రీం కోర్టు బ్రేక్‌ వేసింది. అయితే అప్పటికే దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. నిత్యం ఏదో ఒకచోట రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అల్లుర్లు జరుగుతున్నాయి. ఆందోళనకారులు, ప్రభుత్వ అనుకూల వాదుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటీవలే ఆందోళనకారులు పోలీసు వాహనానికి కూడా నిప్పు పెట్టారు. దీంతో 10 మంది పోలీసులు చనిపోయారు. ఇక అల్లర్ల కారణంగా ఆదివారం(ఆగస్టు 5) వరకు బంగ్లాదేశ్‌లో 300 మంది మరణించారు. అల్లర్లను అదుపుచేయడంలో విఫలమైన ప్రధాని షేక్ హసీనాపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్‌ రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ ప్రధాని పదవి వీడాలని, దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది. దీంతో అప్రమత్తమైన షేక్‌ హసీనా వెంటనే సైనిక హెలిక్యాప్టర్‌లో ప్రాణాలు అరచేత పట్టుకుని మన ఈశాన్య రాష్ట్రం త్రిపుర రాజధాని అగర్తలకు వచ్చారు. దీంతో ఆర్మీ అధికారం చేపట్టే అవకాశం కనిపిస్తోంది.

సైనిక పాలన..
ఇక ప్రధాని పారిపోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో అధికారం హస్తగతం చేసుకునేందుకు సైన్యం పావులు కదుపుతోంది. పది మంది నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధానిగా ఒకరిని నియమించి పాలనను తమ చేతిలోకి తీసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ప్రధాని పారిపోయిన విషయం తెలుసుకున్న ఆందోళనకారులు ప్రధాని ఇంటిని ముట్టడించారు. గేట్లు తెరుచుకుని లోనికి చొచ్చుకెళ్లారు. ఇంట్లోని సామగ్రి ధ్వంసం చేశారు. హసీనా తండ్రి విగ్రహం ధ్వంసం చేశారు. అందిన కాడికి దోచుకుని వెళ్లిపోయారు. ఇదంతా ముందే పసిగట్టిన హసీనా తన అధికారిక నివాసాన్ని వీడి పరారయ్యారు. మరోవైపు దేశంలో ఆందోళనకారుల్ని అణచివేయాలన్న హసీనా కుమారుడి ఆదేశాలను ఆర్మీ లెక్కచేయట్లలేదు.

రాత్రి ఆర్మీ చీఫ్‌ ప్రసంగం..
ఇదిలా ఉంటే.. సోమవారం(ఆగస్టు 5న) రాత్రి 8 గంటలకు ఆర్మీ చీఫ్‌ వాకర్‌ ఉజ్‌ జమాన్‌ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఇందులో ఆయన దేశ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో పలుమార్లు పాకిస్తాన్‌లో జరిగిన తరహాలోనే ఆర్మీ దేశ పాలనను చేతుల్లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీలంకలో గతంలో జరిగిన విధంగానే ప్రధాని నివాసాన్ని ప్రజలు ముట్టడించడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి.

లండన్‌కు హసీనా?
ఇదిలా ఉంటే సైన్యం హసీనా దేశం విడిచి పోవడానికి కేవలం 15 నిమిషాల సమయమే ఇచ్చినట్లు తలిసింది. దీంతో ఆమె పొరుగున ఉన్న త్రిపుర రాజధాని అగర్తలకు సైనిక హెలిక్యాప్టర్‌లో చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్‌-బంగ్లా సరిహద్దుల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. రాత్రికి షేక్‌ హసీనా ఢిల్లీకి చేరుకుని, అక్కడి నుంచి లండన్‌ వెళ్తారని తెలుస్తోంది.