London: భారత్‌తోపాటు, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరలతోనే సామాన్యులు ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పేదలు పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్నారు. టమాటా, మిర్చితోపాటు చాలా కూరగాయలు కిలో వంద రూపాయలు పలుకుతున్నాయి. ఇక ఇంగ్లండ్‌లో ధరలను చూసి అక్కడి ప్రజలతోపాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్టు చూసి భారతీయులు కూడా షాక్ అవుతున్నారు. అక్కడ కిలో కాకరకాయలు రూ.1,000, బెండకాయలు రూ.650, ఆల్పోన్సో మామిడి కాయలు రూ.2,400 పలుకుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్..
ఢిల్లీకి చెందిన చావి అగర్వాల్ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. ఇండియా స్టోర్స్‌లో ఉన్న ధరలు చూసి ఆమె ఆశ్చర్యపోయారు. ఒక స్టోర్‌లో రేట్లను చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్టు చేశారు. లేస్ మ్యాజిక్ మసాలా ప్యాక్ భారత్‌లో రూ.20 ఉంటే.. లండన్‌లో రూ.95 ఉందని తెలిపారు. పన్నీర్ రూ.700 ఉందని తెలిపారు. కూరగాయల ధరలను వెల్లడించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ధరలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
మన రూపాయలతో పోలిస్తే ఎక్కువే..
ఇంగ్లండ్ కరెన్సీ పౌండ్ స్లెర్లింగ్ మన రూపాయలతో పోలిస్తే ఎక్కువే. ధరలు ఎక్కువగా ఉంటాయి. అయితే రేట్లు మాత్రం కాస్త పెరిగాయని అక్కడివారు అంటున్నారు. ద్రవ్యోల్బణం ప్రభావంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ వీడియో కాస్త అతిగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. అక్కడ వ్యాపారం ప్రారంభిస్తే బాగుంటుందని మరికొందరు పోస్టులు పెట్టారు. వచ్చే నెలలో బ్రిటన్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో జీవన వ్యయ సంక్షోభం అక్కడి ప్రజలను ఇబ్బంది పెడుతోంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని ప్రధాని బాధ్యతలు చేపట్టిన రిషి సునక్‌కు మాంద్యం పరిస్థితులు ఎన్నికల వేళ ఇబ్బందిగా మారాయి.