Homeఅంతర్జాతీయంPlane hijack : విమానం హైజాక్‌ యత్నం.. హీరోగా మారిన ప్రయాణికుడితో సురక్షితం

Plane hijack : విమానం హైజాక్‌ యత్నం.. హీరోగా మారిన ప్రయాణికుడితో సురక్షితం

Plane hijack : సెంట్రల్‌ అమెరికా(Central America)లోని బెలీజ్‌లో గురువారం (ఏప్రిల్‌ 17, 2025) ఒక చిన్న విమానంలో హైజాక్‌ యత్నం చోటుచేసుకుంది. అమెరికా పౌరుడైన అకిన్యేలా సావా టేలర్‌ కత్తితో బెదిరించి విమానాన్ని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించగా, ఒక ప్రయాణికుడు తన లైసెన్స్‌డ్‌ తుపాకీ(Lisenced gun)తో కాల్పులు జరిపి దుండగుడిని హతమార్చాడు. దాదాపు రెండు గంటల పాటుగాల్లో చక్కర్లు కొట్టిన విమానం చివరకు సురక్షితంగా ల్యాండ్‌ అయింది. ఈ ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read : డో‘నరుడు’.. జనాభా పెంపు ప్రయత్నాల్లో ప్రపంచ కుబేరుడు..!

హైజాక్‌ యత్నం..
ట్రాఫిక్‌ ఎయిర్‌కు(Trafic Air) చెందిన చిన్న విమానం, 14 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో కొరొజాల్‌ నుంచి శాన్‌పెడ్రోకు బయల్దేరింది. టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాల్లోనే అకిన్యేలా సావా టేలర్‌(49), కత్తితో బెదిరించి విమానాన్ని హైజాక్‌ చేయడానికి ప్రయత్నించాడు. అతడు పైలట్‌తో సహా ఇద్దరు ప్రయాణికులపై దాడి చేసి గాయపరిచాడు. విమానాన్ని మెక్సికో లేదా అమెరికాకు తీసుకెళ్లాలని, లేదా ఇంధనం నింపడానికి ల్యాండ్‌ చేయాలని డిమాండ్‌ చేశాడు. ఈ దాడితో విమానంలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ప్రయాణికుడి సాహసం..
హైజాకర్‌ దాడిలో గాయపడిన ఒక ప్రయాణికుడు, తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ, తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ తుపాకీతో టేలర్‌పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో టేలర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రయాణికుడు వెనుకవైపు గాయంతో ఊపిరితిత్తులకు గాయమై, క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడని బెలీజ్‌ పోలీస్‌ కమిషనర్‌ చెస్టర్‌ విలియమ్స్‌ తెలిపారు. ‘అతడు మా హీరో‘ అని విలియమ్స్‌(Williams) పేర్కొన్నారు. ఈ సాహసం వల్ల విమానంలోని మిగిలిన ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.

రెండు గంటలు గాల్లో చక్కర్లు
హైజాక్‌ యత్నం కారణంగా విమానం దాదాపు రెండు గంటల పాటు బెలీజ్‌ సిటీ(Beleeg City) సమీపంలోని గగనతలంలో అనియతంగా చక్కర్లు కొట్టింది. ఇంధనం తక్కువగా ఉన్నప్పటికీ, పైలట్‌ అసాధారణ ధైర్యంతో విమానాన్ని నియంత్రించి, లేడీవిల్లెలోని ఫిలిప్‌ ఎస్‌.డబ్ల్యూ. గోల్డ్‌సన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేశాడు. ట్రాపిక్‌ ఎయిర్‌ సీఈవో మాక్సిమిలియన్‌ గ్రీఫ్, పైలట్‌ చర్యలను ‘అసాధారణ ధైర్యం‘గా అభివర్ణించారు. ఈ ఘటన సమయంలో బెలీజ్‌ విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

హైజాకర్‌ గురించి ఆసక్తికర వివరాలు
హైజాక్‌ యత్నించిన అకిన్యేలా సావా టేలర్‌ అమెరికా సైనిక అనుభవజ్ఞుడని బెలీజ్‌ పోలీసులు తెలిపారు. అయితే అమెరికా అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. టేలర్‌ గత వారాంతంలో బెలీజ్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, అతడిని నిరాకరించారని పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ, అతడు ఎలా కొరొజాల్‌లోని చిన్న విమానాశ్రయంలో విమానంలోకి ప్రవేశించాడు, కత్తిని ఎలా తీసుకెళ్లాడన్న దానిపై స్పష్టత లేదు. చిన్న విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీలు సరిగా లేకపోవడమే ఇందుకు కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. బెలీజ్‌ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు కోసం అమెరికా రాయబార కార్యాలయంతో సహకరిస్తున్నారు.

గాయపడిన వారి పరిస్థితి
హైజాకర్‌ దాడిలో పైలట్‌తో సహా ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రాపిక్‌ ఎయిర్‌ గాయపడిన ప్రయాణికులకు అన్ని విధాల సహాయం అందిస్తామని ప్రకటించింది.

బెలీజ్‌లో భద్రతపై ప్రశ్నలు
ఈ ఘటన చిన్న విమానాశ్రయాల్లో భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలను లేవనెత్తింది. కత్తితో విమానంలోకి ప్రవేశించడం సాధ్యమవడం విమాన భద్రతా ప్రమాణాలలో లోపాలను సూచిస్తోంది. బెలీజ్‌ అధికారులు ఈ అంశంపై లోతైన దర్యాప్తు చేస్తామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular