Palestinians: పాపం పాలస్తీనీయులు.దిక్కూ..మొక్కూ లేని పక్షులయ్యారు. హమాస్ ఉగ్రవాదుల దుందుడుకు చర్యలతో స్వంత గడ్డపై వారికి నిలువ నీడ లేకుండా పోయింది. గతేడాది అక్టోబర్‌లో హమాస్-ఐడీఎఫ్ దళాల మధ్య మొదలైన యుద్ధం వల్ల పాలస్తీనీయుల బతుకులు పూర్తిగా చిధ్రమయ్యాయి. ప్రస్తుతం ఈ యుద్ధం రఫా వేదికగా తారాస్థాయికి చేరుకోవడంతో..బిక్కు బిక్కుమంటూ..బతుకు జీవుడా అంటూ పొరుగు దేశమైన ఈజిప్ట్ వైపు పాలస్తీనీయులు పరుగులు పెడుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా..ఇప్పటికీ హమాస్ యుద్ధ విరమణ చేస్తున్నట్లు ప్రకటించకపోవడమే పాలస్తీనీయులకు శాపంగా మారుతోంది. ఫలితంగా హమాస్ చేస్తున్న దుందుడుకు చర్యలు,పాపాలు పాలస్తీనీయులకు యమపాశాలుగా తయారయ్యాయి.
వాస్తవానికి హమాస్-ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న పంచాయితీ ఈనాటిది కాదు. సుదీర్ఘ కాలంగా ఇజ్రాయిల్-హమాస్ మధ్య వైరం ఉంది. ఇజ్రాయిల్ లోని జెరూసలేం, ఇతర కీలక ప్రాంతాలు పాలస్తీనీయులకు చెందినవే అంటూ.. అడపాదడపా అప్పుడప్పుడు ఇజ్రాయిల్ పైన అమాస్ మెరుపు దాడులు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ అనూహ్యంగా ఇజ్రాయిల్‌పై మెరుపు దాడి చేసింది. ఆ తదనంతరం గాజు స్ట్రిప్ పై ఐడిఎఫ్ దళాలు యుద్ధానికి సన్నధం కావడం చక చకా జరిగిపోయాయి. వెరసి అత్యంత బలమైన దేశమైన ఇజ్రాయిల్ విషయంలో హమాస్ చేసిన పిచ్చి చేష్టలతో ఇప్పుడు పాలస్తీనీయులు బలి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదట ఐడిఎఫ్ దళాలు కేవలం హమాస్ కమాండర్లను అంతం చేసేందుకు మాత్రమే యుద్ధం చేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఈ కారణాన్ని బూచిగా చూపించి.. గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ మిలటరీ వైమానిక దాడులు చేయడం, యుద్ధ ట్యాంకులతో విరుచుకుపడుతుండడంతో లక్షలాది మంది పాలస్తీనీయుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటివరకు సుమారు 40 నుంచి 50 వేల వరకు ఈ యుద్ధంలో పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.
నిజానికి ఐడిఎఫ్ దళాలను విజయవంతంగా నిలువరిస్తామని హమాస్ భావించింది. కానీ,ఎక్కడ కూడా ఇజ్రాయిల్ మిలిటరీని అడ్డుకోవడంలో హమాస్ సక్సెస్ కాలేకపోయింది. సకాలంలో హమాస్కు లేబనాన్,ఇరాన్, హిజుబుల్లా,హౌతి,అరబ్ దేశాల నుంచి సహకారం అందుతుందని అంచనా వేసుకుంది. కానీ,అలాంటి పరిస్థితులే లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్ రఫా వేదికగా హమాస్ ఖేల్ ఖతం చేసేందుకు యుద్ధానికి సిద్ధమైంది. ప్రస్తుతం రఫా సమీపంలో హమాస్,ఐడిఎఫ్ దళాలు భీకర పోరును ప్రారంభించాయి. దీంతో రఫాలో నివాసముంటున్న 15 లక్షల మంది పాలస్తీనీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. ఒక్క రఫా నుంచే ఇప్పటి వరకు లక్షా ఇరవై వేలమంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. సొంత గడ్డపై కనీసం నిలువ నీడ లేకుండా పక్కనున్న ఈజిప్ట్ కు పారిపోతున్నారు. అయితే ఇంత జరుగుతున్న ఇప్పటికీ హమాస్ టాప్ కమాండర్లు ఐడిఎఫ్ దళాలకు సరెండర్ కాకపోవడం పాలస్తీయునులకు శాపంగా మారుతోంది.