Errabelli Dayakar Rao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు మాజీ టీడీపీ నేత, ప్రస్తుత బీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తనను కాంగ్రెస్‌లోకి రావాలని నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ ఆహ్వానించారని చెప్పారు. పార్టీ మారితే రూ.100 కోట్లు ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారని తెలిపారు. మంత్రి పదవిని కూడా ఎరగా వేశారని వెల్లడించారు. అయినా తాను పార్టీ మారలేదని చెప్పుకొచ్చారు. పార్టీ మారలేదన్న కారణంగా వెఎస్సార్ తనపై పగబట్టారని పేర్కొన్నారు. అందుకే వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఎస్సీకి రిజర్వు చేశారని ఆరోపించారు.
మళ్లీ జనరల్‌గా వర్ధన్నపేట..
2026 నియోజకవర్గాల పునర్‌విభజన జరుగుతుందని ఎర్రబెల్లి తెలిపారు. ఈమేరకు వర్ధన్నపేట మళ్లీ జనరల్ నియోజకవర్గం అవుతుందని పేర్కొన్నారు. వర్ధన్నపేట దయాకర్‌రావు అడ్డాగా అభివర్ణిచారు. రిజర్వేషన్ మారగానే తాను వర్ధన్నపేట నుంచి పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పోటీ చేసిన మహిళ కన్నీళ్లు పెట్టుకుంటూ ఓట్లు అడిగిందని అందుకే ప్రజలు ఆమెకు ఓట్లు వేశారని విమర్శించారు.
రేవంత్ నా శిష్యుడే..
ఇక ప్రస్తుత తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని తన శిష్యుడిగా చెప్పుకున్నారు ఎర్రబెల్లి దయాక్‌రావు. తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, రేవంత్ మూడు సార్లే ఎమ్మెల్యే గెలిచాడని పేర్కొన్నారు. రేవంత్‌కు ఎప్పుడూ నిలకడ ఉండదని తెలిపారు. అందుకే టీడీపీలో ఉండగానే చంద్రబాబును తిట్టాడని గుర్తు చేశారు. తాను కూడా చంద్రబాబుతో పనిచేశానని, తాను ఎప్పుడు దూషించలేదని తెలిపారు.
పది నెలల్లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు..
వైఎస్సార్‌పై సంచలన ఆరోపణ చేసిన ఎర్రెబల్లి తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలో పడిపోతుందని పరోక్షంగా చెప్పారు. పది నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. చంద్రబాబును, కేసీఆర్‌ను అనేక మంది మోసం చేశారని పలువురి పేర్లు ప్రస్తావించారు.
చనిపోయిన వైఎస్సార్‌పై సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఆయన వచ్చి సమాధానం చెప్పలేడనే ఉద్దేశంతోనే ఎర్రబెల్లి ఈ ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. పదవి పోవడంతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.