Pakistan nuclear tests: ప్రపంచంలో అణు పరీక్షలపై ఆంక్షలు ఉన్నాయి. దేశ ప్రయోజనాల కోసం మినహా.. ఇతర దేశాలపై దాడులకు అణు పరీక్షలు చేయకూడదన్న ఒప్పందం ఉంది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. దానిని ఉల్లంఘించి అణు పరీక్షలు చేస్తామని ప్రకటించారు. 1992లో నిలిచిపోయిన ఈ ప్రక్రియను ఆయన మళ్లీ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ట్రంప్ తాత మరో బాబు పేల్చాడు. పాకిస్తాన్ అణు పరీక్షలు చేస్తోందని సంచనల ప్రకటన చేశారు. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యలు స్పష్టంగా దుష్పరిణామాలను సూచిస్తున్నాయి. ప్రపంచంలో చైనా, రష్యా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి దేశాలు గోప్యంగా అణు పరీక్షలు చేస్తున్నాయని, కానీ అమెరికా మాత్రం ఓపెన్‌గా చేయనుందని చెప్పారు.
మళ్లీ అణ్వాయుధ పోటీ
ట్రంప్ ప్రకారం, అమెరికా వద్ద ప్రపంచాన్ని ఒకసారి కాదు, 150 సార్లు పేల్చగల శక్తి ఉంది. కానీ, రష్యా, చైనా అణు విస్తరణను దృష్టిలో ఉంచుకుని కొత్త సామర్థ్యాలను పరిశీలించాల్సిన సమయం వచ్చిందని అన్నది ఆయన ప్రధాన వాదన. ఈ వ్యాఖ్యలు కేవలం ప్రతిస్పందన కాదని, వ్యూహాత్మక సమానత్వం సాధించాలనే స్పష్టమైన ప్రణాళిక సంకేతమని వ్యూహ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యల తరువాత ఉత్తర కొరియా ‘‘స్వీయ రక్షణ హక్కు’’ పేరుతో మరిన్ని పరీక్షలు జరపబోతున్నట్లు సూచించింది. పాకిస్తాన్ మౌనంగా ఉన్నప్పటికీ, రహస్య ప్రాజెక్ట్‌లతో ముందంజలో ఉందన్న అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్య ఇస్లామాబాద్‌పై ఒత్తిడిగా మారుతోంది.
‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ సంకేతాలు
బుసాన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశం ముందు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో ‘ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి’ అని రాసిన పోస్ట్ అన్ని విశ్లేషణలకు బాటలు వేసింది. తన గత పాలనలో అణు పరీక్షలకు ఆంక్షలు విధించినప్పటికీ, ‘‘రిస్క్ లెక్కలకన్నా రక్షణ ముఖ్యమని’’ కొత్త వ్యాఖ్యలతో ఆయన వైఖరి మారిందని స్పష్టమవుతోంది. యుద్ధశాఖకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశానని ఆయన వెల్లడించడం, కార్యాచరణ మొదలైందన్న సూచన ఇచ్చింది.
ట్రంప్ ప్రకటనతో ప్రపంచం మళ్లీ అణు సమరం గురించి చర్చిస్తోంది. అమెరికా అణు పరీక్షలు మళ్లీ మొదలైతే, రష్యా, చైనా, పాకిస్తాన్, ఉత్తర కొరియా తమ బలాన్ని పెంచే అవకాశం ఉంది. జపాన్, యూరప్ వంటి మిత్రదేశాలు కూడా కొత్త రక్షణ వ్యూహాలను రూపొందించుకోవాల్సి వస్తుంది. దీంతో ప్రపంచంలో మళ్లీ ఆయుధ పోటీ పెరుగుతుంది.