Asim Munir: పాకిస్తాన్-ఆఫ్గానిస్తాన్ మధ్య వారంపాటు కొనసాగిన పరస్పర దాడులు.. ఇటీవల సీజ్‌ఫైర్‌తో ఆగిపోయాయి. ఖతార్ మధ్యవర్తిత్వంతో యుద్ధం ఆగినా.. మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థగా పేర్కొంటున్న తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) సంస్థ కమాండర్ కాజిమ్ ఓ వీడియో విడుదల చేస్తూ, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌ను నేరుగా సవాలు చేశాడు. “దమ్ముంటే యుద్ధభూమిలో మమ్మల్ని ఎదుర్కోండి” అని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాక్ సైనిక ఉన్నతాధికారులకూ సవాల్ విసిరిన ఈ వీడియోలు షాక్‌కు గురిచేసింది.
పాక్ ప్రభుత్వానికి షాక్
టీటీపీ కమాండర్ కాజిమ్ సవాల్ పాకిస్తాన్ భద్రతా వ్యవస్థను కుదిపివేసింది. ప్రభుత్వం అతని సమాచారాన్ని వెల్లడించే వారికి 10 కోట్ల పాకిస్తానీ రూపాయల బహుమతి ప్రకటించింది. అక్టోబర్ 8న ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కుర్రం ప్రాంతంలో టీటీపీ భారీ దాడి జరిపి 22 మంది పాక్ సైనికులను చంపినట్లు టీటీపీ ప్రకటించింది. పాక్ సైన్యం మాత్రం 11 మంది సైనికులు మరణించినట్లు ధ్రువీకరించింది. దాడిలో స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఆయుధాలను వీడియోలో చూపించడం పాక్ సైనికాధికారి, సైన్యం పరువును బజారున పడేలా చేసింది.
కాల్పుల విరమణ కొనసాగేనా?
పాకిస్తాన్-ఆఫ్గానిస్తాన్ మధ్య ఇటీవలే ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆఫ్గాన్ భూభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీటీపీ వంటి గ్రూపులపై ఆఫ్గానిస్తాన్ చర్యలు తీసుకుంటేనే ఒప్పందం నిలుస్తుందని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ, టీటీపీ దూకుడు తగ్గించలేదు. దీంతో ఇరుదేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఎన్నాళ్లు కొనసాగుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పాక్ పెంచిన ఉగ్ర శక్తులే..
2007లో బజావుర్, స్వాట్, ఖైబర్ ప్రాంతాల్లోని తాలిబాన్వర్గాల కలయికతో ఏర్పడిన టీటీపీ, పాక్ సైన్యం తన భూభాగంలో పెంచింది. ఇది అల్ ఖైదా మద్దతుతో ప్రారంభమై, జిహాద్ భావజాలం ఆధారంగా పాక్ ప్రభుత్వ, సైనిక వ్యవస్థలపై దాడులు చేపట్టింది. ఆఫ్గాన్ తాలిబాన్, తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాక్ మధ్య మతపరమైన సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, రాజకీయ లక్ష్యాలు వేరు. ఆఫ్గాన్ తాలిబాన్ ప్రధానంగా తమ దేశంలో ఇస్లామిక్ పాలన స్థాపనకు ప్రయత్నిస్తే, టీటీపీ పాక్ సైనిక వ్యవస్థను కూలదోసి శరియా ఆధారిత పాలన అమలు చేయాలని కోరుకుంటోంది. ఈ భావజాల వ్యత్యాసం ఇరుదేశాల సంబంధాలను మరింత ఉద్రిక్తం చేస్తోంది.
టీటీపీ తిరుగుబాట్లను అదుపు చేయలేకపోవడం పాక్ సైన్యానికి మిలిటరీ, మానసిక పరమైన ఓ పెద్ద లోటు. దేశం లోపల పెరిగిన మత ఉగ్రవాదం ఇప్పుడు సైనిక వ్యవస్థను సవాల్‌గా మారింది. ఈ పరిస్థితి పాక్–ఆఫ్గాన్ సంబంధాలకే కాదు, మొత్తం ప్రాంతీయ భద్రతకు పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉంది.