Pakistan Vs India: భారత్–పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత పాకిస్థాన్ తన తప్పులును వరుసగా ఒప్పుకుంటోంది. కాల్పుల సమయంలోనే ఆ దేశ రక్షణ మంత్రి తాము ఉగ్రవాదులను పెంచి పోషించామని చెప్పారు. తర్వాత పుల్వామా దాడి తమ పనే అని వైమానిక అధికారి తెలిపారు. తాజాగా ఆపరేషన్ సిందూర్‌లో 11 మంది సైనికులు మృతిచెందినట్లు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో తమ సైనికులు ఎవరూ మరణించలేదని ప్రకటించిన పాక్.. ఎట్టకేలకు నిజం ఒప్పుకుంది. మృతుల్లో ఆరుగురు ఆర్మీ సిబ్బంది, ఐదుగురు వాయుసేన సిబ్బంది ఉన్నారని వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో మరో 78 మంది సైనికులు తీవ్రంగా గాయపడినట్లు కూడా పాక్ సైనిక వర్గాలు తెలిపాయి.
Also Read: ప్రధాని మోదీ IAF సందర్శన.. ఆపరేషన్ సిందూర్ వీరులకు అభినందన
భారత్ ఉగ్రవాద వ్యతిరేక దాడి…
’ఆపరేషన్ సిందూర్’ అనేది ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన ఒక కచ్చితమైన సైనిక చర్య. ఈ ఉగ్రదాడిలో 26 మంది, ప్రధానంగా పర్యాటకులు, మరణించారు. భారత్ ఈ దాడి వెనుక పాకిస్థాన్ మద్దతు ఉందని ఆరోపించగా, పాకిస్థాన్ ఈ ఆరోపణలను ఖండించింది. ఈ నేపథ్యంలో, భారత సైన్యం పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ఖచ్చితమైన క్షిపణి దాడులు చేసింది. ఈ శిబిరాలు జైష్–ఎ–మహమ్మద్, లష్కర్–ఎ–తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించినవని భారత్ పేర్కొంది.
పాకిస్థాన్ ప్రతిదాడులు..
ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా, పాకిస్థాన్ మే 8 నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC),, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ షెల్లింగ్, డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 15 మంది భారతీయులు మరణించగా, 43 మంది గాయపడ్డారని భారత సైన్యం తెలిపింది. అయితే, భారత్ యొక్క S–400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడం జరిగింది. భారత సైన్యం కూడా పాక్ సైనిక స్థావరాలపై ప్రతిదాడులు చేసింది, దీనిలో 35–40 మంది పాకిస్థాన్ సైనికులు మరణించినట్లు భారత వర్గాలు పేర్కొన్నాయి.
సమస్య ఉపశమనం కోసం..
ఈ దాడులు, ప్రతిదాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా, సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్, ఖతార్ వంటి దేశాలు ఉద్రిక్తతలను తగ్గించాలని కోరాయి. మే 10, 2025న అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు ఆయుధ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి, అయితే పాకిస్థాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు భారత్ ఆరోపించింది. మే 12న ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO) మధ్య చర్చలు జరిగాయి, దీనిలో సరిహద్దు వెంబడి దాడులను నిలిపివేయాలని నిర్ణయించారు.
భారత్ గట్టి సందేశం
ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ తన ఉగ్రవాద వ్యతిరేక ధోరణిని స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ‘ఉగ్రవాదం, సంప్రదింపులు ఒకే సమయంలో సాగవు. పాకిస్థాన్ తన ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించకపోతే, దాని స్వయం వినాశనానికి దారితీస్తుంది‘ అని హెచ్చరించారు. భారత సైన్యం ఈ ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులను నిర్మూలించినట్లు పేర్కొంది, అయితే ఈ ఆపరేషన్‌లో ఐదుగురు భారత సైనికులు కూడా మరణించారు.