Pakistan Election Results 2024: పాక్ ఎన్నికల్లో ఉత్కంఠ.. గెలిచానంటున్న ఇమ్రాన్ ఖాన్ .. ట్విస్ట్ ఇదే

మరోవైపు పిటిఐ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు. అక్కడి నుంచే తన పార్టీ విజయం సాధించినట్లు చెప్పుకొచ్చారు. వివిధ కేసుల్లో ఇరుక్కున్న ఇమ్రాన్ ఖాన్ ను పాక్ ప్రభుత్వం జైల్లో పెట్టిన విషయం తెలిసిందే.

Written By: Dharma, Updated On : February 9, 2024 12:59 pm

Pakistan Election Results 2024

Follow us on

Pakistan Election Results 2024: దాయాది దేశం పాకిస్థాన్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠను రేపుతోంది. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు ముందంజలో ఉండడం విశేషం. పాక్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. వాటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్ చేశారు. ఎన్నికలు జరగాల్సిన ఓ స్థానంలో అభ్యర్థి చనిపోయారు. దీంతో అక్కడ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం 265 సీట్లకు పోలింగ్ జరగగా.. వాటికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతోందని తెలుస్తోంది.

ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ గురువారం జరిగింది. ఈరోజు కౌంటింగ్ జరుగుతోంది. ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పరిస్థితిని కాపాడడానికి పాకిస్తాన్ అంతటా మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సేవలను అక్కడ ప్రభుత్వం నిలిపివేసింది. దీనిపై పెద్ద దుమారమే రేగుతోంది. ప్రభుత్వ చర్యలను అన్ని రాజకీయ పక్షాలు తప్పుపడుతున్నాయి. మొబైల్, ఇంటర్నెట్ సేవలను తక్షణం పునరుద్ధరించాలని కోరుతున్నాయి. అయితే ఎక్కడికక్కడే ఆలస్యంగా ఓటింగ్ జరిగినట్లు అక్కడ మీడియా చెబుతోంది. అధికారులు కావాలనే ఓటింగ్ ను అడ్డుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓటింగ్ సమయాన్ని పొడిగించాలన్న డిమాండ్ ను పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. మరోవైపు ఎన్నికల ముందు రోజు రాజకీయ హింస పెరిగింది. రెండు ప్రదేశాల్లో పేలుళ్లు సంభవించాయి. 30 మంది వరకు మృత్యువాత పడ్డారు.

మరోవైపు పిటిఐ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు. అక్కడి నుంచే తన పార్టీ విజయం సాధించినట్లు చెప్పుకొచ్చారు. వివిధ కేసుల్లో ఇరుక్కున్న ఇమ్రాన్ ఖాన్ ను పాక్ ప్రభుత్వం జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పిటిఐ గుర్తు క్రికెట్ బ్యాట్ ను ఎన్నికల్లో వాడేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడికక్కడే ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కౌంటింగ్ కొనసాగుతున్న చిత్రాన్ని సోషల్ మీడియాతో పంచుకున్నారు. పిటిఐ మద్దతుతో స్వతంత్రులుగా పోటీ చేసిన 125 మంది లీడ్ లో ఉన్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాస్ పార్టీ 44 స్థానాల్లో, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 28 స్థానాల్లో, ఎంక్యూఎం 9 స్థానాల్లో, జేయూఐ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. అయితే పాకిస్తాన్ ఎలక్షన్ కమిషన్ దీనిని ధ్రువీకరించకపోవడం విశేషం. అయితే ఇప్పటికే జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మాత్రం తన పార్టీ లీడ్ లో ఉన్నట్లు చెబుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.