Jagan And YS Sharmila: రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. వాటి పరిణామాలు కూడా ఒకేలా ఉండవు. శత్రువులు మిత్రులవుతారు. మిత్రులు రాజకీయంగా శత్రువులుగా మారుతారు. ఈ విషయంలో హేమహేమీలే బాధితులు. అయితే తాజాగా వైయస్ షర్మిల తో ఆయన సోదరుడు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) రాజీ చేసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. త్వరలో వారిద్దరూ రాజకీయంగా ఒకటి కానున్నట్లు టాక్ నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల షర్మిల సోదరుడు జగన్ పై విమర్శలు తగ్గించారు. కూటమిపై విమర్శలు పెంచుతున్నారు. అంతకుమించి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ తగ్గించారు. దీంతో సోదరుడితో ఆమె చేయి కలుపుతారన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. అయితే ఈ విషయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒకప్పటి సన్నిహితులు చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది.
* అడ్డగోలుగా చీలిన కుటుంబం..
రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. తండ్రి అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచింది ఆ కుటుంబం. అయితే కుటుంబ, ఆర్థికపరమైన, ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివాదంలో సోదరుడిని తీవ్రంగా విభేదించారు షర్మిల. అందుకే తెలంగాణలో తండ్రి పేరుతో రాజకీయాలు చేయాలని చూశారు. అక్కడ వర్క్ అవుట్ కాకపోయేసరికి ఏపీకి వచ్చారు. రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కూడా చూశారు సోదరుడ్ని. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకొని 2024 ఎన్నికల్లో ఎంతలా డ్యామేజ్ చేయాలో అంతలా చేశారు. చివరకు సొంత జిల్లా కడపలో సైతం రాజశేఖర్ రెడ్డి చరిత్ర మసకబారింది. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్న చాలామంది రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు ఆ కుటుంబ పరిస్థితిని చూసి ముందుకు వచ్చారు. వారి మధ్య ఉన్న గ్యాప్ ను సరి చేసే పనిలో పడ్డారు. వారి మధ్య జరిగిన చర్చలు విజయవంతం అయినట్లు కూడా తెలుస్తోంది. అందుకే వారు రాజకీయంగా కలిసిపోయేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం.
* దాదాపు అన్ని సమస్యలు పరిష్కారం..
ఏపీ విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచన చేయడానికి జగన్ కారణమని తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉందట. అయితే షర్మిల ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేస్తారని కూడా ప్రచారం జరిగింది. రాయలసీమ పేరుతో రాజకీయాలు మొదలు పెడతారని కూడా టాక్ నడిచింది. అయితే ఇప్పటికే పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు. మరోసారి ఆ పరిస్థితి తెచ్చుకోకూడదని భావిస్తున్నారు. ఇటువంటి సమయంలోనే రాజకీయాలకు దూరంగా ఉన్న కొంతమంది రాజశేఖరరెడ్డి సన్నిహితులు రంగంలోకి దిగారు. అటు బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డితో.. ఇటు హైదరాబాదులో ఉన్న షర్మిల తో చర్చలు జరిపారట. చాలావరకు సమస్యలకు పరిష్కార మార్గం చూపించారట. అందుకే వారిద్దరూ కలిసిపోయేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. చూడాలి ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో?