Homeఅంతర్జాతీయంSushila Karki takes oath as PM: సుశీలా కార్కీ ఎంట్రీ.. నేపాల్‌ రాజకీయ సంక్షోభం...

Sushila Karki takes oath as PM: సుశీలా కార్కీ ఎంట్రీ.. నేపాల్‌ రాజకీయ సంక్షోభం కొత్త మలుపు..

Sushila Karki takes oath as PM: నేపాల్‌లో ఇటీవల జరిగిన తీవ్రమైన ఆందోళనలు దేశ రాజకీయాలను తలకిందులు పెట్టాయి. అవినీతి ఆరోపణలు, సోషల్‌ మీడియా నిషేధం వంటి సమస్యలపై యువత (జెన్‌జె) నేతృత్వంలో జరిగిన విరోధ ప్రదర్శనలు ప్రధాన మంత్రి కేపీ.శర్మ ఓలితో రాజీనామా చేయించాయి. ఈ నేపథ్యంలో మాజీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీని తాత్కాలిక ప్రధాన మంత్రిగా నియమించారు. ఆమె నేపాల్‌ చరిత్రలో మొదటి మహిళా ప్రధాని కావడం ప్రత్యేకం. ఆందోళనకారులు, సైన్యం, అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్‌ కలిసి ఆమెను ఎంపిక చేశారు. ఇది దేశంలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు కీలకమైన అడుగు.

సుశీలా కార్కీ ముందు ముఖ్య బాధ్యతలు..
సుశీలా కార్కీ తన పదవికి తక్షణం మూడు ప్రధాన లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. మొదటిది దేశవ్యాప్తంగా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం, ఎందుకంటే ఆందోళనలు దేశాన్ని అస్థిరపరిచాయి. రెండోది ధ్వంసమైన పార్లమెంటు, సుప్రీం కోర్టు వంటి కీలక భవనాలను పునర్నిర్మాణం చేయడం, ఇది దేశ పాలిటికల్, జ్యుడిషియల్‌ వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. మూడవది ముఖ్యమైనది వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించడం. తద్వారా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా పునరుద్ధరించడం. ఆమె తాత్కాలిక ప్రధాని మాత్రమే కావడం వల్ల, ఈ మూడు బాధ్యతలను పూర్తి చేసిన తర్వాత తప్పుకోవాలని ఆమె భావిస్తున్నారు. ఆమె అవినీతి వ్యతిరేకి, నిష్పక్షపాత వ్యక్తిగా పేరుగాంచినందున, ఈ బాధ్యతలను నిష్పాక్షికంగా నిర్వహించగలరని అంచనా.

బంగ్లాదేశ్‌తో పోలిస్తే భిన్న పరిస్థితులు..
బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా పారిపోయిన తర్వాత అధ్యక్షుడు కొంతకాలం ఉండి తర్వాత దేశం వదిలి వెళ్లాడు. వివిధ రాజకీయ పక్షాలు, సంఘాలు కలిసి ముహమ్మద్‌ యూనుస్‌ను తాత్కాలిక ప్రధానిగా నియమించాయి. అయితే, అక్కడ పరిస్థితులు స్థిరపడినా ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగలేదు, ఎన్నికలు నిర్వహించబడలేదు. నేపాల్‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సుశీలా కార్కీకి రాజకీయ పదవులపై ఆశలు లేకపోవడం, ఆమె బాధ్యతాయుతంగా వ్యవహరించగలననే నమ్మకం ఉండటం ప్రధాన కారణాలు. ఆందోళనకారులు ముందుగా బాలేంద్ర షా (కఠ్మంండు మేయర్‌)ను కోరుకున్నారు, కానీ ఆయన తాత్కాలిక ప్రధాని పదవి తీసుకుంటే తన రాజకీయ జీవితానికి దెబ్బ తగులుతుందని తిరస్కరించారు. అలాగే, ఆయన భారత వ్యతిరేకి కావడం, గుల్‌కేసింగ్‌ వంటి ఆరోపణలు ఉండటం వల్ల సుశీలాను ఎంపిక చేశారు. ఆందోళనకారులు ఈ నిర్ణయంలో పాల్గొనలేదు, సైన్యం మరియు అధ్యక్షుడు ద్వారానే జరిగింది.

భారత వ్యతిరేకత..
ప్రజల చేతుల్లో దెబ్బలు తిన్న కమ్యూనిస్టు నేతలు దేశంలోనే ఉన్నారు. ప్రజల ఆగ్రహం తగ్గిన తర్వాత కొత్త నినాదాలతో ఎన్నికల్లో పాల్గొని తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. కేపీశర్మ ఓలి ఒక ప్రకటనలో ’రాముడు అయోధ్యలోనే పుట్టాడు’ అని చెప్పినందుకు భారత్‌ తనను గద్దె దించిందని ఆరోపించారు. ఇది భారత వ్యతిరేకతను పెంచే ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నప్పటికీ, ప్రకటనలు చేస్తున్నారు. బహిష్కృత నేతలను సైన్యం రక్షిస్తోంది. అయితే, నేపాల్‌లో ధరలు స్థిరంగా ఉండాలంటే, ఆహార సరుకులు అందాలంటే భారత్‌ నుంచే వచ్చే అవసరం. ఈ దశలో భారత వ్యతిరేకత చూపితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. అందుకే సుశీలా కార్కీని ఎంపిక చేశారు, ఆమె భారత అనుకూల వైఖరి కలిగినవారిగా పరిగణించబడుతున్నారు.

సైన్యం లక్ష్యాలు..
నేపాల్‌ సైన్యం ప్రధాన లక్ష్యాలు భారత్, చైనాను సమతుల్యం చేయడం, అమెరికా ఆదేశాలు పాటించడం. సరుకుల రవాణా, ఆర్థిక సహాయం వంటి విషయాల్లో భారత్‌ అనుకూలంగా ఉండటం వల్ల భారత్‌తో వైరం కోరుకోవటం లేదు. అమెరికా ఆదేశాల మేరకు భారత అనుకూల వైఖరి అవలంబిస్తున్నారు, చైనాను దూరం పెట్టడానికి భారత్‌ను మద్దతు ఇస్తున్నారు. ఇది నేపాల్‌ యొక్క భౌగోళిక, ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకున్న వ్యూహాత్మక నిర్ణయం.

నేపాల్‌ రాజకీయ విభజన..
నేపాల్‌ రాజకీయ వ్యవస్థ నాలుగు భాగాలుగా చీలిపోయింది. మొదటి వర్గం రాజు తిరిగి రావాలని, హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని కోరుకుంటోంది. ఇది బలమైన సమూహం. రెండో వర్గం ప్రజాస్వామ్యం, రాజరికం కొనసాగాలని కోరుకుంటుంది. మూడో వర్గం కమ్యూనిస్టు పార్టీ, నాలోగవ వర్గం మదేశీలు (భారత సరిహద్దు ప్రాంత ప్రజలు). సుశీలా కార్కీ మదేశీ వర్గానికి చెందినవారు కావడం ఆసక్తికరం. ఎన్నికలు జరిగితే ఓటర్లు ఈ నాలుగు వర్గాలుగా విడిపోవచ్చు, ఎవరికీ మెజారిటీ రాకపోవచ్చు. దీంతో రాజకీయ సంక్షోభాలు మరింత తీవ్రమవుతాయి. సుశీలా కార్కీ ఈ విభజనలను సమతుల్యం చేసి, ఎన్నికలు సజాగ్రత్తగా నిర్వహించాలి.

సుశీలా కార్కీ ఎంపిక నేపాల్‌లో స్థిరత్వానికి కొత్త అవకాశాన్ని అందిస్తోంది. ఆమె మూడు ముఖ్య బాధ్యతలను నిష్పాక్షికంగా నిర్వహిస్తే, ప్రజాస్వామ్య పునరుద్ధరణ సాధ్యమవుతుంది. భారత్‌తో మంచి సంబంధాలు, అంతర్జాతీయ ఒత్తిడుల మధ్య సమతుల్య వైఖరి అవలంబించడం ద్వారా దేశం ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు సాగవచ్చు. అయితే, రాజకీయ విభజనలు, కమ్యూనిస్టు పార్టీల ప్రయత్నాలు సవాళ్లుగా మారతాయి. ఈ తాత్కాలిక పాలన విజయవంతమైతే, నేపాల్‌ భవిష్యత్‌కు ఆశాకిరణంగా మారుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular