Lok Sabha Elections Results 2024: మోడీ 3.0.. మాల్దీవుల ప్రధాని ఏమన్నారంటే..

సార్వత్రిక ఎన్నికల్లో మోడీ విజయ సాధించడం అభినందనీయం. మోడీకి మా శుభాకాంక్షలు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు పాటుపడుతున్నారు. అది ఈ ఎన్నికలలో మరింతగా ప్రతిబింబించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 5, 2024 6:40 pm

Lok Sabha Elections Results 2024

Follow us on

Lok Sabha Elections Results 2024: సార్వత్రిక ఎన్నికల్లో టార్గెట్ పెట్టుకున్నట్టుగా 400 స్థానాలు సాధించకపోయినప్పటికీ.. మిత్రపక్షాల సహాయంతో ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారాన్ని అధిష్టించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నరేంద్ర మోడీ సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అధినేతలు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి 240 స్థానాలలో గెలిచింది. దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది.. కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో గెలుపును అందుకుంది.. బిజెపికి ప్రభుత్వానికి ఏర్పాటు చేసే బలం లభించకపోవడంతో.. ఎన్డీఏ ద్వారా ఇతర మిత్ర పక్షాల ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కావలసిన 272 సీట్లకు మించి దక్కించుకుంది. ఈ క్రమంలో టిడిపి, జేడీయూ వంటి పార్టీలతో మిత్ర బంధం ఏర్పరచుకొని మళ్లీ అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది.

“మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో వారికి నా అభినందనలు. భారత్, మాల్దీవుల పరస్పర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలు, శ్రేయస్సు దృష్ట్యా మేము కలిసి పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని” మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా పీఠాన్ని అధిష్టించబోతున్న నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

“సార్వత్రిక ఎన్నికల్లో మోడీ విజయ సాధించడం అభినందనీయం. మోడీకి మా శుభాకాంక్షలు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు పాటుపడుతున్నారు. అది ఈ ఎన్నికలలో మరింతగా ప్రతిబింబించింది. మీ ఆధ్వర్యంలో భారత్ ఇటలీ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నాం. ప్రజల ఆకాంక్షల కోసం ఈ దేశాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్తాయని” ఇటలీ అధ్యక్షురాలు జార్జియా మెలోనీ పేర్కొన్నారు.

” నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారత్ దేశం అనితర సాధ్యమైన పురోగతి సాధించింది. ఆయన నాయకత్వంపై ప్రజలు సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచారు. సరిహద్దు దేశంగా భారత్ తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు మేము ఎదురు చూస్తున్నామని” శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ట్విట్టర్ లో పేర్కొన్నారు.

“నరేంద్ర మోడీ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ఇందుకు గానూ ఆయనకు నా అభినందనలు. ఆయన ఆధ్వర్యంలో భారతదేశం మరింత పురోగతి సాధిస్తుందని నమ్ముతున్నాను. భారత్ తో మారిష స్ మరింత ప్రత్యేక సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని భావిస్తున్నానని” మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ పేర్కొన్నారు.

“అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్ర మోడీ మరింతగా ప్రజా శ్రేయస్సుకు కృషి చేస్తారని నమ్ముతున్నాను. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారత్ – నేపాల్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నానని” నేపాల్ ప్రధాని ప్రచండ పేర్కొన్నారు.

” నా మిత్రుడు నరేంద్ర మోడీకి నా శుభాకాంక్షలు. చారిత్రాత్మకమైన ఎన్నికల్లో అనూహ్య స్థాయిలో విజయం సాధించడం గొప్ప విషయం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ తో మేము పనిచేసేందుకు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని” భూటాన్ ప్రధానమంత్రి షేరింగ్ తోబ్గే ట్విట్టర్లో ట్వీట్ చేశారు.