Lok Sabha Elections Results 2024: సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో ఓటర్లు అత్యంత తెలివిగా తమ తీర్పును వెల్లడించడంతో.. ప్రధాన రాజకీయ పార్టీలకు పూర్తిస్థాయిలో బలం దక్కలేదు. కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయాలంటే 272 సీట్ల మెజారిటీ అవసరం. అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ సొంతంగా ఆ స్థాయిలో బలాన్ని సంపాదించుకోలేకపోయాయి . 400 సీట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన బిజెపి 240 స్థానాల వద్దే ఆగిపోయింది. దీంతో ఆ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేయాలంటే టిడిపి, జెడియు మద్దతు అనివార్యమైంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన మంగళవారం సాయంత్రమే నరేంద్ర మోడీ మీడియా ఎదుటకు వచ్చారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. ఈసారి కూడా బలమైన నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. బుధవారం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఢిల్లీలో ఆయన భేటీ నిర్వహించనున్నారు. మరోవైపు ఇండియా కూటమి కూడా ఆశ్చర్యకరమైన రీతిలో పుంజుకుంది. ఈ ఎన్నికల్లో భాగస్వామ్య పార్టీలతో కలిసి మెజారిటీ స్థానాలు సాధించింది.. దీంతో ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో కీలక భేటీ నిర్వహిస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణ పై చర్చిస్తున్నారు.
అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి భేటీల నేపథ్యంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్ జె డి నాయకుడు తేజస్వి యాదవ్ ఒకే విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. వాస్తవానికి కొన్ని నెలల క్రితం వరకు తేజస్వి, నితీష్ బీహార్లో ప్రభుత్వాన్ని నడిపించారు. అయితే నితీష్ కు బిజెపి సపోర్ట్ ఇవ్వడంతో ఆయన ఎన్డీఏ కూటమిలో చేరారు. ఇండియా కూటమి నుంచి బయటికి వచ్చేసారు. ఇటీవల ఎన్నికల్లో వీరిద్దరూ పరస్పరంగా విమర్శలు చేసుకున్నప్పటికీ.. వేర్వేరు కూటములకు చెందిన నాయకులైనప్పటికీ ఒకే విమానంలో ప్రయాణించడం చర్చకు దారి తీస్తోంది. అయితే మంగళవారం ఫలితాలు విడుదలైన తర్వాత జేడీయూ నేత కేసి త్యాగి విలేకరులతో మాట్లాడాడు. తన పార్టీ ఎన్డీఏ కూటమిలోనే ఉంటుందని స్పష్టం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమిలో చేరే అవకాశం లేదని కొట్టి పారేశాడు. ఇక ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో టిడిపి, జెడియు కీలక పాత్ర పోషించనున్నాయి.
ఇక నితీష్ కుమార్ గతంలో ఇండియా కూటమి ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించారు. బీహార్ లో తరచూ మిత్రపక్షాలను మార్చి సుదీర్ఘకాలంగా అధికారంలో కొనసాగుతున్నారు. వాస్తవానికి ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో నితీష్ కుమార్ విశేష కృషి చేశారు. కానీ ఎప్పుడైతే ఇండియా కూటమికి కన్వీనర్ గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నియమితులయ్యారో.. అప్పటినుంచి నితీష్ నారాజ్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇండియా కూటమి నుంచి బయటికి వచ్చి, ఎన్డీఏలో చేరారు. బీహార్ రాష్ట్రానికి తొమ్మిదో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం వెలువడిన ఫలితాలలో.. బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి 30 స్థానాలు రాగా.. అందులో 12 మంది జెడియు అభ్యర్థులు ఎంపీలుగా గెలవడం విశేషం. నితీష్ కుమార్, తేజశ్రీ మాత్రమే కాకుండా.. భాగస్వామ్య పార్టీలతో నిర్వహించే భేటీలో పాల్గొనేందుకు ఎన్సిపి (ఎస్పీ) అధినేత శరద్ పవార్, కుమారస్వామి, లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ ఢిల్లీకి వెళ్లారు. రెండు బలమైన కూటములు వేరువేరుగా సమావేశాలు నిర్వహిస్తుండడం.. దేశ రాజకీయాలలో చర్చకు దారి తీస్తోంది.