Giorgia Meloni Comments NATO Chief: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఇటీవల అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మాటకు మాట సమాధానం ఇచ్చారు. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సుకు ఇద్దరు దేశాధినేతలు హాజరయ్యారు. సదస్సు అనంతరం అమెరికా వెళ్లిన ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో సమావేశం సందర్భంగా మెలోనీ తనతో ఫొటో దిగాలని ప్రాధేయపడిందని పేర్కొన్నారు. తర్వాత ఓ మీడియా సమావేశంలోనూ ఇదే వ్యాఖ్యలు చేశారు. దీంతో మెలోనీ దీటుగా సమాధానం ఇచ్చారు. ఇటలీ ఎవరినీ ప్రాధేయపడదని స్పష్టం చేశారు. ఎవరికోసం పాకులాడదని వెల్లడించారు. చీప్ మెంటాలిటీ తనది కాదని స్పష్టం చేశారు. దీంతో ట్రంప్ నోరు మూసుకున్నారు.
తాజాగా నాటో చీఫ్ వ్యాఖ్యలు..
తాజాగా నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యల సందర్భంగా యూరప్‌లోని అమెరికా స్థావరాల నుంచి వేలాది విమానాలు ఎగిరాయని, వాటిలో ఇటలీలోని స్థావరాల నుంచి వందల సంఖ్యలో విమానాలు బయలుదేరాయని పేర్కొన్నారు. ఈ మాటలు ఇటలీ నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లు అభిప్రాయం కలిగించాయి.
ఖండించిన మోలోనీ..
ఫ్రాన్స్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశం ముగింపులో మీడియాతో మాట్లాడిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ రుట్టే వ్యాఖ్యలను తీవ్రంగా తిరస్కరించారు. ఆయన ఉత్సాహంగా మాట్లాడుతూ వేర్వేరు విషయాలను ఒకటిగా కలిపేశారని, ఇటలీ అనుమతించిన విమానాల స్వభావాన్ని తప్పుగా గ్రహించారని స్పష్టం చేశారు. ఇరాన్‌పై జరిగిన సైనిక దాడుల్లో ఇటలీ ఎలాంటి నేరుగా పాల్గొనలేదని ఆమె గట్టిగా చెప్పారు.
ఇటలీ ఇచ్చిన అనుమతులు ఏమిటి?
ఇటలీ రక్షణ శాఖ వెంటనే స్పందిస్తూ, అమెరికా స్థావరాల నుంచి కేవలం సాంకేతిక, లాజిస్టిక్, నిర్వహణ సంబంధిత విమానాలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. యుద్ధ కార్యకలాపాలు, దాడులు లేదా ఆయుధ మద్దతుకు సంబంధించిన ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇదంతా దేశ రాజ్యాంగం, అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలోనే జరిగిందని ప్రభుత్వం నొక్కి చెప్పింది.
విదేశాంగ మంత్రి కూడా..
ఇటలీ విదేశాంగ మంత్రి అంటోనియో తజానీ రుట్టే వ్యాఖ్యలను అతిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన ఉద్దేశం లాజిస్టిక్ సహకారం గురించి మాత్రమేనని, ఇటలీ యుద్ధంలో పాల్గొన్నట్లు చెప్పడం సరైనది కాదని వివరించారు. ఈ వివాదం ఇటలీలోని ప్రతిపక్షాలు ప్రభుత్వం నిజాలు చెప్పిందా అనే సందేహాలు లేవనెత్తడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే మెలోనీ నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ ఇరాన్ సంఘర్షణలో దేశానికి నేరుగా పాత్ర లేదని స్పష్టం చేస్తోంది.
మెలోనీ తన స్థిరమైన ధోరణితో శక్తివంతుల ముందు కూడా నిజాలను బయటపెట్టడంలో వెనకాడట్లేదు. మొన్నటి ట్రంప్ సంభాషణల్లో చూపించిన ధైర్యం ఇప్పుడు నాటో చీఫ్ విషయంలో కూడా కనిపిస్తోంది.
