Long Drive Travel Tips: కుటుంబంతో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లడం ఒక మధురమైన అనుభవం. వీకెండ్ ట్రిప్స్, హిల్ స్టేషన్లు, పర్యాటక ప్రాంతాలకు ప్రయాణించే వారు ఎక్కువగా హైవేలపైనే ప్రయాణిస్తుంటారు. అయితే వాహనం సరిగా లేకపోతే ఆనందకరమైన ప్రయాణం మధ్యలోనే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా హైవేలపై అధిక వేగంతో ప్రయాణించే సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. అందుకే లాంగ్ ట్రిప్‌కు బయల్దేరే ముందు కొన్ని కీలక అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆటోమొబైల్ నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో ఈ 4 ముఖ్యమైనవి.
టైర్లు సరిగ్గా ఉన్నాయా..?
వాహన భద్రతలో టైర్ల పాత్ర అత్యంత కీలకం. టైర్లు ఎక్కువగా అరిగిపోయి ఉండటం, కట్‌లు లేదా పగుళ్లు ఉండటం ప్రమాదకరం. అలాగే టైర్లలో సరైన గాలి పీడనం లేకపోతే మైలేజ్ తగ్గడమే కాకుండా, హైవేపై టైర్ పేలిపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది. ట్రిప్‌కు వెళ్లే ముందు అన్ని టైర్లతో పాటు స్పేర్ టైర్ కూడా మంచి స్థితిలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
ఇంజిన్ ఆయిల్, కూలెంట్ స్థాయి:
లాంగ్ డ్రైవ్‌లో ఇంజిన్ నిరంతరం ఎక్కువసేపు పనిచేస్తుంది. అందువల్ల ఇంజిన్ ఆయిల్ సరిపడా ఉండటం చాలా ముఖ్యం. ఆయిల్ తక్కువగా ఉంటే ఇంజిన్‌పై ఒత్తిడి పెరిగి పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే రేడియేటర్‌లో కూలెంట్ సరైన స్థాయిలో ఉండాలి. కూలెంట్ తక్కువగా ఉంటే ఇంజిన్ వేడెక్కి ప్రయాణం మధ్యలోనే వాహనం ఆగిపోయే పరిస్థితి రావచ్చు.
బ్రేకులు, బ్యాటరీ కండిషన్:
హైవేలపై వేగంగా వెళ్తున్నప్పుడు బ్రేకులు సరిగా పనిచేయడం అత్యంత అవసరం. బ్రేక్ పెడల్ సాఫీగా ఉందా? బ్రేక్ ఆయిల్ సరిపడా ఉందా? అనే విషయాలను ముందుగానే పరిశీలించాలి. అలాగే బ్యాటరీ పాతదిగా ఉంటే లేదా చార్జింగ్ సమస్య ఉంటే వాహనం స్టార్ట్ కాకపోవచ్చు. బ్యాటరీ టెర్మినల్స్ శుభ్రంగా ఉన్నాయా, ఛార్జ్ సరిగా ఉందా అని కూడా చెక్ చేయించుకోవడం మంచిది.
డాక్యుమెంట్లు, ఎమర్జెన్సీ కిట్:
వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ (PUC) వంటి పత్రాలు తప్పనిసరిగా వెంట ఉండాలి. వీటితో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్స్, టార్చ్, జంప్ స్టార్టర్ కేబుల్స్, టైర్ ఇన్‌ఫ్లేటర్, పంక్చర్ రిపేర్ కిట్, తాగునీరు వంటి అత్యవసర వస్తువులను కూడా కారులో ఉంచుకోవాలి. ఇవి అనుకోని పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడతాయి.
సురక్షిత ప్రయాణానికి ముందస్తు జాగ్రత్తలే రక్షణ లాంగ్ డ్రైవ్‌కు వెళ్లే ముందు వాహనాన్ని పూర్తిగా పరిశీలించడం వల్ల అనేక సమస్యలను ముందుగానే నివారించవచ్చు. అవసరమైతే సమీప సర్వీస్ సెంటర్‌లో ఒకసారి వాహనాన్ని తనిఖీ చేయించుకోవడం మంచిది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రయాణం మరింత సురక్షితంగా, ప్రశాంతంగా, ఆనందంగా సాగుతుంది.
