Manmohan Singh’s Death : భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్య కారణాలతో మరణించడంతో దేశం దిగ్భ్రాంతి లోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఏడు రోజుల సంతాప దినాలుగా కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 27న ఆయా రాష్ట్రాల్లో పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. అయితే బ్యాంకులకు సెలవుల విషయం మాత్రం ఎటువంటి ప్రకటన వెలువడలేదు. నాగాలాండ్ రాష్ట్రంలో క్రిస్మస్ సందర్భంగా మూడో రోజు కూడా సెలవులు ప్రకటించారు. దీంతో అక్కడ బ్యాంకుల కు కూడా సెలవులు ప్రకటించారు. అయితే మిగతా రాష్ట్రాల్లో కూడా బ్యాంకులకు సెలవు ఉంటుందా? అనే సందేహం నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆర్థికవేత్తగా, ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందించిన మన్మోహన్ సింగ్ గురువారం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ భారత్ ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో తన సంస్కరణలతో అభివృద్ధికి బాటలు వేశారు. ఆ తర్వాత ఆయన ప్రతిభ ఆధారంగా భారతదేశానికి ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చింది. పదేళ్లపాటు ఈ హోదాలో ఉన్న ఆయన ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ కీలకపాత్ర వహించారు. దీంతో మన్మోహన్ మరణంపై సంతాపం ప్రకటిస్తూ తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ప్రభుత్వ కార్యాలయాలకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అయితే బ్యాంకులకు సెలవు ఉంటుందా లేదా అనేది నిర్ధారణ కాలేదు. సాధారణంగా బ్యాంకులకు సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటిస్తుంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం అయినందువల్ల బ్యాంకుల విషయంలో క్లారిటీ లేదు. అయితే క్రిస్మస్ సందర్భంగా రెండు రోజులుగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. డిసెంబర్ 27న కూడా సెలవు ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
నాగాలాండ్ రాష్ట్రంలో క్రిస్మస్ సందర్భంగా మూడో రోజు కూడా సెలవులు ప్రకటించారు. ఇక్కడ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బ్యాంకులకు కూడా ఆర్బిఐ సెలవు ప్రకటించింది. అయితే ఇదే రోజు మన్మోహన్ సంతాప దినంగా ఆయా రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయి. కానీ ఆర్బిఐ మాత్రం బ్యాంకు సెలవుల విషయంలో ఏ విధంగా స్పందించలేదు.
ఇదిలా ఉండగా మన్మోహన్ సింగ్ కు వివాలను అర్పించేందుకు కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ఆ తర్వాత జరిగే కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. భారత ప్రధానిగా మాత్రమే కాకుండా ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మన్మోహన్ సింగ్ కు ఘనంగా నివాళులు అర్పించాలని అన్ని వర్గాల రాజకీయ పార్టీలు ప్రజలు ఇందులో భాగస్వాములు కావాలని కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మన్మోహన్ పార్థవదేహాన్ని దర్శించేందుకు ఇప్పటికే చాలామంది ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఆయన అంత్యక్రియల్లో రాజకీయ ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్కు చెందిన ముఖ్య నాయకులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది.