Make in India : ప్రపంచాన్ని కుదిపేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’.. 3 నెలల్లోనే 200 బిలియన్ డాలర్లు దాటిన ఎగుమతులు.. భారతీయ వస్తువులకు భారీ డిమాండ్..

ప్రధాని మోడీ మొదటి దఫాలో వచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ కాన్సెప్ట్ చాలా తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను సాధించింది. చైనా ప్రొడక్ట్ లను ద్వేషించే ప్రపంచం భారత్ ప్రొడక్ట్స్ వైపు మొగ్గు చూపుతోంది. భారత్ కూడా ప్రపంచ మన్ననలను అందుకునేందుకు నాణ్యమైన వస్తువులను తయారు చేసి ఎగుమతి చేస్తుంది

Written By: NARESH, Updated On : July 16, 2024 4:56 pm
Follow us on

Make in India’ : విదేశాల్లో భారతీయ వస్తువు (మేడ్ ఇన్ ఇండియా)లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ విషయాన్ని ఎగుమతి లెక్కలు ధ్రువీకరిస్తున్నాయి. సోమవారం (జూలై 15) రోజున వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాత్కాలిక వాణిజ్య డేటా ప్రకారం.. భారతదేశం మొత్తం ఎగుమతులు (వస్తువులు, సేవలతో సహా) ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల కాలంలో $200.3 బిలియన్లుగా ఉన్నాయి. గతేడాది (2023) ఏప్రిల్ నుంచి జూన్ మూడు నెలల కాలంలో $184.5 బిలియన్లుగా ఉన్నాయి. విశేషం ఏంటంటే.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశం చేసిన అత్యధిక ఎగుమతి ఇదే.

జూన్‌లో భారీగా పెరిగిన ఎగుమతులు
ఏ దేశం ఎగుమతి డేటా ఎలా పెరిగిందో ఎలా లెక్కిస్తారంటే.. ఆ దేశంలో తయారైన వస్తువులకు ఇతర దేశాల్లో మార్కెట్ లో డిమాండ్ ఎంత పెరిగిందన్న దాన్ని బట్టి లెక్కిస్తారు. భారతదేశం ఎగుమతులకు కూడా విదేశాలలో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే భారత ఎగుమతుల్లో బలమైన పెరుగుదల కనిపిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన డేటాను పరిశీలిస్తే, జూన్ 2024లో వస్తువుల ఎగుమతి 2.55 శాతం పెరిగి 35.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ఏడాది క్రితం జూన్‌లో 34.32 బిలియన్ డాలర్లుగా ఉంది. గత నెల, మే, 2024లో, భారతదేశ వస్తువుల ఎగుమతి 9.1 శాతం పెరిగి $38.13 బిలియన్లకు చేరుకుంది.

దిగుమతులను కూడా పెంచుకున్న భారత్..
ఎగుమతులే కాదు.. దిగుమతులను కూడా దేశం పెంచుకుంది. జూన్ లో దేశ దిగుమతి 5 శాతం పెరిగింది. జూన్, 2024లో వస్తువుల దిగుమతి 5 శాతం పెరిగి 56.18 బిలియన్ డాలర్లకు చేరుకోగా, జూన్, 2023లో అది 53.51 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. జూన్‌లో భారత వాణిజ్య లోటు 20.98 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

ఒకవైపు దేశంలో ద్రవ్యోల్బణం గణాంకాలు పెరిగాయి. మొదటిది, రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతానికి పైగా ఉంది. సోమవారం (జూలై 15) విడుదల చేసిన టోకు ద్రవ్యోల్బణం డేటాలో, డబ్ల్యూపీఐ (WPI) కూడా 3.36 శాతానికి చేరుకుంది. అయితే, ఎగుమతి డేటా శుభవార్తను మోసుకచ్చింది.

ఎగుమతులు 800 బిలియన్ డాలర్లు దాటుతాయి!
దేశ ఎగుమతుల డేటాను పరిశీలిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశం ఎగుమతుల్లో 800 బిలియన్ డాలర్లకు పైగా వృద్ధిని సాధించిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఎగుమతి డేటాను విడుదల చేస్తూ, త్రైమాసిక గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయని.. మొత్తం ఎగుమతులు 200 బిలియన్ డాలర్లు దాటిందని, ఇదే వేగం కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 800 బిలియన్ డాలర్లు దాటుతాయని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలిపారు.

ప్రధాని మోడీ మొదటి దఫాలో వచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ కాన్సెప్ట్ చాలా తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను సాధించింది. చైనా ప్రొడక్ట్ లను ద్వేషించే ప్రపంచం భారత్ ప్రొడక్ట్స్ వైపు మొగ్గు చూపుతోంది. భారత్ కూడా ప్రపంచ మన్ననలను అందుకునేందుకు నాణ్యమైన వస్తువులను తయారు చేసి ఎగుమతి చేస్తుంది. భారత్ ప్రాచీణమైన సంప్రదాయంలో భాగంగా ఇక్కడి వస్తువులకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. కాబట్టి ప్రపంచం వీటిని ఎక్కువగా ఆదరిస్తుంది.

ఈ ఎగుమతులు ఇలానే పెరుగుకుంటూ వెళ్తే.. దేశం మరింత ఆర్థికంగా బలపడుతుందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. మోడీ చెప్పిన విధంగా తక్కువ సమయంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్తున్నారు.