Sachin Tendulkar : ఆట తీరుతో కాదు..టీమిండియా కు ధోని కెప్టెన్ అలా అయ్యాడు.. చాలా ఏళ్ల తర్వాత సంచలన విషయం వెల్లడించిన సచిన్: వీడియో వైరల్

సచిన్ అన్న మాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. అయితే కొంతమంది అభిమానులు మాత్రం సచిన్ మాటలను కొట్టి పారేస్తున్నారు. "మహేంద్ర సింగ్ ధోని తన ఆట తీరుతో నాయకుడిగా ఎదిగాడు. టీమిండియా కు టి20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు

Written By: Bhaskar, Updated On : July 16, 2024 7:31 pm
Follow us on

Sachin Tendulkar : అప్పుడెప్పుడో కపిల్ దేవ్ నాయకత్వంలో టీమిండియా వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. 2003లో ఫైనల్ వెళ్లినప్పటికీ.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత 2011లో స్వదేశంలో ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి.. రెండోసారి వరల్డ్ కప్ దక్కించుకుంది. ఆ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా స్టార్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తన కెరీర్ కు ముగింపు పలికాడు. అంతకుముందు 2007లో టీమిండియా దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టును ఓడించి కప్ దక్కించుకుంది. టి20 వరల్డ్ కప్ ఆరంగేట్ర సీజన్ లో విజేతగా ఆవిర్భవించింది.

రెండుసార్లు ధోని ఆధ్వర్యంలో

టీమిండియా 2007 t20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ సాధించినప్పుడు కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. రెండు వరల్డ్ కప్ లలోనూ తనదైన నాయకత్వ పటిమతో జట్టును ముందుండి నడిపించాడు. ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ లో విన్నింగ్ షాట్ కొట్టి భారత జట్టుకు సరికొత్త విజయాన్ని అందించాడు. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీని కూడా అందించి సరికొత్త చరిత్రను లిఖించుకున్నాడు. టీమిండియా చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని పేరుపొందాడు

అదే కారణమా..

ధోని టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి నాళ్లల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జులపాల జుట్టుతో తనదైన హెలికాప్టర్ షాట్లు కొట్టాడు. క్రికెట్ చరిత్రలో అవి ప్రత్యేకంగా నిలిచిపోయాయి. నిజానికి ధోని టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి, అతనికంటే సీనియర్లు చాలామంది ఉన్నారు. కానీ బీసీసీఐ ధోని వైపు మొగ్గింది. దీనికి కారణం ఏంటి? దీని వెనుక ఎవరున్నారు.. ఈ ప్రశ్నలకు సరిగ్గా ఇన్నాళ్లకు సమాధానం చెప్పాడు టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.

ఓ ప్రైవేట్ పార్టీలో..

2007 సమయంలో టీమిండియా కెప్టెన్ గా సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. అయితే అప్పటికి అతడికి అనారోగ్య సమస్యల వల్ల ఇండియా కెప్టెన్సీని వదులుకునేందుకు సిద్ధమయ్యాడు. తన స్థానంలో మహేంద్రసింగ్ ధోనీ పేరును సిఫారసు చేశాడు. ఇదే విషయాన్ని సచిన్ టెండూల్కర్ స్వయంగా ప్రకటించాడు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. సచిన్ టెండుల్కర్ ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తాను కెప్టెన్సీ ని వదులుకోవడానికి గల అసలు కారణాన్ని, మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ అయ్యేందుకు దోహదం చేసిన పరిస్థితులను వివరించాడు. “నేను కెప్టెన్సీ వదులుకోవడానికి అసలు కారణం ఏంటంటే.. ఆ సమయంలో నా శరీరం నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది. అదే సమయంలో ఇంగ్లాండ్ లో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ నాతో భేటీ అయ్యారు. నన్ను కెప్టెన్ గా ఉండాలని కోరారు. ఆయన అభ్యర్థనను నేను సున్నితంగా తిరస్కరించాను. నా అనారోగ్య పరిస్థితులను వివరించాను. నాయకుడిగా నన్ను జట్టు నుంచి వైదొలగించండి. ఆటగాడిగా మాత్రం నా పాత్ర జట్టులో నూటికి నూరు శాతం ఉంటుంది. దేశం కోసం 100% నా వంతు ప్రయత్నాన్ని చేస్తానని చెప్పాను. ఆ తర్వాత నా స్థానంలో మహేంద్రసింగ్ ధోని పేరుని సిఫారసు చేశాను. దానికి ఆయన కూడా ఓకే అన్నారు. అలా మహేంద్ర సింగ్ ధోని టీమిండియా కెప్టెన్ అయ్యారు. టీమిండియా కెప్టెన్ అయిన తర్వాత ధోనితో నేను చాలాసార్లు మాట్లాడాను. జట్టు గురించి చెప్పాను. ఆ తర్వాత స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తానని చెప్పడంతో దానికి ధోని కూడా ఓకే అన్నాడని” సచిన్ చెప్పుకొచ్చాడు..

సోషల్ మీడియాలో..

సచిన్ అన్న మాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. అయితే కొంతమంది అభిమానులు మాత్రం సచిన్ మాటలను కొట్టి పారేస్తున్నారు. “మహేంద్ర సింగ్ ధోని తన ఆట తీరుతో నాయకుడిగా ఎదిగాడు. టీమిండియా కు టి20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇన్నాళ్లకు సచిన్ నా దయ వల్లే ధోని కెప్టెన్ అయ్యాడని చెప్పడం విడ్డూరమని” మహి అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.