టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రపంచంలోనే అత్యు్తమ ఫినీషర్ అనే విషయం అందరికి తెలిసిందే. తాజాగా తనలో అసలైన ఫినిషర్ ఇంకా మిగిలే ఉన్నాడంటూ ధోని నిరూపించుకున్నాడు. ఐపీఎల్ లో గురువారం చెన్నై సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ధోని తనదైన శైలిలో సిక్సర్ తో ఇన్నింగ్స్ ముగించడమే ఇందుకు కారణం. నిన్నటి మ్యాచ్ లో ధోని 11 బంతుల్లో ఒక ఫోర్, సిక్సర్ సాయంతో 14 పరుగులు చేశాడు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్ లో సిక్సర్ బాది చెన్నై విజయాన్ని ఖరారు చేశాడు.
అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ధోనీ అరుదైన రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో చెన్నై వికెట్ కీపర్ గా 100 క్యాచ్ లు అందుకున్న ఘనత సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా క్యాచ్ అందుకోవడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. అయితే గతేడాది పేలవ ఆటతీరుతో ప్లేఆఫ్స్ చేకుండా ఇంటిముఖం పట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి అందరికన్నా ముందు ఆ బెర్తును ఖరారు చేసుకుంది. గురువారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
దీంతో చెన్నై ఈ సీజన్ లో తొమ్మిదో విజయం సాధించి 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ తమ జట్టు అందరికన్నా ముందు ప్లేఆఫ్స్ కు చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. తాము తిరిగి బలంగా పుంజుకొని వస్తామని అప్పడే చెప్పినట్లు గుర్తు చేశాడు. ఈ సీజన్ లో చెన్నై ముందుకు వెళ్లడానికి ఆటగాళ్లు బాగా ఆడారు. ప్రతి ఒక్కరూ రాణించారు అని తెలిపారు. ఇక పిచ్ పై కాస్త ఎక్కువ బౌన్స్ ఉంది. పిచ్ పై బ్యాట్స్ మెన్ కు అవగాహన కలిగాక విజయవంతమయ్యారు అని తెలిపాడు ధోనీ.