Living in fear of Lakurawa: చైనా మీద గుడ్లు ఉరుముతున్నాడు. భారత్ మీద కన్నెర్ర చేస్తున్నాడు. అంతేకాదు ఆంక్షలు.. బలవంతంగా అమెరికా నుంచి బయటికి పంపించడాలు వంటివి చేస్తున్నాడు. అందువల్లే ట్రంప్ ను చైనా ప్రజలు, భారత దేశస్తులు ఈసడించుకుంటున్నారు. ఇటువంటి అధ్యక్షుడు అమెరికాకు ఎందుకు వచ్చాడంటూ మండిపడుతున్నారు. ట్రంప్ కూడా ఈ తరహా విమర్శలను లెక్కచేయడం లేదు. అయితే ఇప్పుడు ట్రంప్ కాస్త గ్యాప్ ఇచ్చాడు.. చైనా జోలికి రావడం లేదు. భారతదేశాన్ని గెలకడం లేదు. సరిగ్గా క్రిస్మస్ రోజున ఒక బుల్లి ముఠా మీద పడ్డాడు. హ్యాపీ క్రిస్మస్ అంటూ అక్కడ తన “రక్త చరిత్ర” ను మొదలుపెట్టాడు.
అమెరికా బలగాలు మొదలుపెట్టాయి
ట్రంప్ హ్యాపీ క్రిస్మస్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడో లేదో.. నైజీరియా వాయవ్య సరిహద్దుల్లోని సోకోటాయ్ రాష్ట్రంలో అమెరికా బలగాలు ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఊచ కోత కోయడం ప్రారంభించాయి. ఒకప్పుడు నైజీరియాలో “లకురావా” అనే ముఠా ఉండేది. వీరంతా కూడా దోపిడీ దొంగల నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలను కాపాడతారని నమ్మకం ఉండేది. వీరు కాల క్రమంలో కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ తో దోస్తీ కట్టారు. ఆ తర్వాత నైజీరియాలోని వాయవ్య ప్రాంతంలో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ట్రంప్ దృష్టికి ఆగడాలు
“లకురావా” వ్యవహారాలు అమెరికా అధ్యక్షుడి దృష్టికి వెళ్లడంతో.. అది కూడా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో జతకట్టడంతో.. ట్రంప్ ఏమాత్రం ఉపేక్షించలేదు. క్రిస్మస్ రోజున టార్గెట్ మొదలుపెట్టాడు.. అమెరికా సైన్యం రంగంలోకి దిగడంతో ఇక అక్కడ ప్రతిరోజు యుద్దకాండ సాగుతోంది.
దోపిడీ దొంగల నుంచి రక్షణ
“లకురావా” అనే పదానికి “భర్తీ” అని అర్థం. 2016 నుంచి 2017 మధ్యకాలంలో “లకురావా” ముఠా తంకాస ప్రాంతంలోని బొంగానో అటవీ ప్రాంతంలోని సమీప గ్రామాలపై దాడులు జరిపింది. సమీప ప్రాంతాల ప్రజలకు దోపిడీ దొంగల నుంచి రక్షణ కల్పించింది. తీవ్ర పేదరికంతో ఈ ప్రాంతాలు కొట్టుమిట్టాడుతుంటాయి. అటువంటివారిని దోచుకునే వ్యక్తుల భరతాన్ని “లకురావా” ముఠా పట్టేది. ఈ గ్రామాలలో పూర్తిగా వ్యవసాయమే జీవనాధారం. ఇక్కడ రాజకీయ అస్థిరత విపరీతంగా ఉంది. నైజీరియా సైనికులు రక్షణ కల్పించకపోవడంతో దోపిడీ దొంగలు పెరిగిపోయారు. ఆ దోపిడీ దొంగలను నైజర్, మాలి అనే ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది యువకులు ఎదిరించారు. సమీప గ్రామాల ప్రజల తోడ్పాటు కూడా లభించడంతో “లకురావా” అనే సంస్థ ఏర్పడింది. బలమైన ముఠాగా ఎదిగింది. “లకురావా” ముఠా లోని సభ్యులు స్థానిక యువతులను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారిలో కలిసి పోయారు. అనంతరం తమ కుట్రను అమలు చేయడం మొదలుపెట్టారు. ఆ గ్రామాలలో ఇస్లామిక్ నిబంధనలను అమలులోకి తీసుకొచ్చారు.
అనతి కాలంలోనే..
“లకురావా” ముఠా అనతి కాలంలోనే అనేక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. అంతేకాదు, ప్రజలను దారుణంగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. గ్రామాలపై అత్యంత హింసాత్మకంగా వ్యవహరించడం ప్రారంభించింది. ఇప్పుడు “లకురావా” ముఠా 500 గ్రామాలపై పెత్తనం సాగిస్తోంది. నైజీరియా సైన్యంపై కూడా అత్యంత ఘోరమైన దాడులను చేస్తోంది. 2024 లో కెబ్బి మేర అనే గ్రామం పై “లకురావా” ముఠా దాడి చేసింది. ఏకంగా 25 మంది గ్రామస్తులను చంపేసింది. క్రైస్తవులు అధికంగా ఉండే గ్రామాలపై దాడులు మొదలుపెట్టింది.
ఐక్యరాజ్యసమితి ఆందోళన
లకు రావా ముఠా ఆగడాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, “లకురావా” ముఠా క్రిస్మస్ రోజు అనేక చర్చలను లక్ష్యంగా చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అమెరికా రంగంలోకి దిగింది. అమెరికా గూడచారి సంస్థలు వాయవ్య నైజీరియాలో నిఘాను పెంచాయి. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో నైజీరియాను అసహన దేశంగా ట్రంప్ చేర్చారు. క్రిస్మస్ సందర్భంగా నైజీరియా వాయవ్య ప్రాంతంలోని బోకో హరాం, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకొని.. సైన్యం ద్వారా దాడులు జరిపినట్టు వెల్లడించారు. వచ్చే రోజుల్లో దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు..