Princess Of Wales: నిజం గడప దాటేలోపు.. అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంది. ఈ సోషల్ మీడియా కాలంలో అది ప్రతి సందర్భంలో నిరూపితమవుతూనే ఉంది. ఇలాంటి ఇబ్బంది సామాన్యులకు, సెలబ్రిటీలకు షరా మామూలే అయినప్పటికీ.. ఈ బాధిత జాబితాలో ఇంగ్లాండ్ రాజ కుటుంబం కూడా చేరింది. సోషల్ మీడియా వల్ల పుట్టిస్తున్న పుకార్లు ఎంత ఇబ్బందిగా ఉంటాయో ఆ కుటుంబం ప్రస్తుతం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నది. దానికి వివరణ ఇవ్వలేక కిందా మీదా పడుతోంది. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్టుగా.. రకరకాల పుకార్లు షికార్లు చేస్తుండడంతో అసలు ఏది నిజమో? ఏది అబద్దమో? తెలుసుకోలేక ఇంగ్లాండ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
కేట్ మిడిల్ టన్.. (ఇంగ్లాండ్ రాజు చార్లెస్-3 పెద్దకొడుకు) ప్రిన్స్ విలియం భార్య.. వేల్స్ మహారాణిగా ఆమె కొనసాగుతోంది. అయితే ఇటీవల ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో రాజకుటుంబంలో జరిగే వేడుకలకు ఆమె హాజరు కాలేదు. అసలే రాణి పైగా ఇటీవల చార్లెస్-3 అనారోగ్యానికి గురి కావడంతో ఈ విషయాన్ని రాజు కుటుంబం అత్యంత గోప్యంగా ఉంచింది. గత ఏడాది జరిగిన క్రిస్మస్ వేడుకల సమయంలో భర్త విలియం, కుటుంబ సభ్యులతో కేట్ మిడిల్ టన్ కనిపించింది. అక్కడ తన పిల్లలతో కలిసి సరదాగా వాకింగ్ చేసింది.. అనంతరం ప్రార్థనల్లో పాల్గొంది. ప్యాలెస్ లో రాజు కుటుంబానికి ఇచ్చిన విందును ఆరగించింది. ఆ తర్వాత ఆమె కనిపించడం మానేసింది. వాస్తవానికి ఆమె అనారోగ్యానికి గురి కావడంతో ఆ విషయాన్ని రాజు కుటుంబం బయటకు పొక్కకుండా చూసింది. రాజకుటుంబంలో జరిగే వేడుకల్లో కేట్ మిడిల్ టన్ కనిపించకపోవడంతో పుకార్లు షికార్లు చేయడం మొదలుపెట్టాయి.. దీనికి సోషల్ మీడియా కూడా తోడు కావడంతో పుకార్లు దావనంలా వ్యాపించడం మొదలుపెట్టాయి. వీటిని కట్టడి చేయడం రాజ కుటుంబం వల్ల కాలేదు. పైగా యువరాణి కేట్ మిడిల్ టన్ ఉదర సంబంధమైన వ్యాధితో బాధపడుతూ శస్త్ర చికిత్స చేయించుకుంటే.. ఆమె కోమాలో ఉందని, రాజ కుటుంబంలో ఏదో జరుగుతోందని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఈ విషయం చార్లెస్-3 దృష్టికి వచ్చింది. అతడు ఈ విషయంపై ప్రిన్స్ విలియంతో చర్చించాడు. దీంతో విలియం రంగంలోకి దిగక తప్పలేదు.
తన భార్యకు శస్త్ర చికిత్స జరిగిన విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా “ది ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్” పేరుతో కేట్ మిడిల్ టన్ ఎలాంటి శస్త్ర చికిత్స జరిగిందో వివరించాడు. “గత క్రిస్మస్ లో ఆమె మా కుటుంబంతో కలిసి వేడుకల్లో పాల్గొంది. ప్రస్తుతం ఆమె అనారోగ్యానికి గురైంది. ఉదర సంబంధమైన శాస్త్ర చికిత్స చేయించుకుంది. వచ్చే ఈస్టర్ పండుగ నాటికి ఆమె అందరితో కలిసి ఉంటుంది. ఇలాంటి సమయంలో మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం భావ్యం కాదు. పైగా ఆమెపై రకరకాల పుకార్లు చేస్తున్నవారు వాటికి స్వస్తి పలకాలి” అని విలియం ఆ పోస్టులో కోరాడు. మరోవైపు సోషల్ మీడియాలో కేట్ మిడిల్ టన్ ఆరోగ్యంపై పుకార్లు వస్తున్న నేపథ్యంలో కొంతమంది జర్నలిస్టులు రంగంలోకి దిగారు.. అగ్నికి ఆజ్యం తోడైనట్టు వారు మరింత మసాలా దట్టించి వార్తలు రాశారు. దీంతో ఈ విషయం ఎక్కడెక్కడికో వెళ్లింది. చివరికి కేట్ మిడిల్ టన్ బయటికి వచ్చి నేను బాగానే ఉన్నానని చెప్పిన కూడా వారు నమ్మే పరిస్థితి లేదు. మరి ఈ పుకార్లకు ఎప్పుడు అడ్డుకట్టపడుతుంది. హే ప్రభూ.. హే హరినాథ్.. ప్రిన్స్ విలియానికి ఏమిటి ఈ కష్టాలు?!
View this post on Instagram