2023 Nobel Prize: కొవిడ్ కష్టకాలంలో విశేష సేవలు అందించిన వైద్య నిపుణులకు అరుదైన గౌరవం దక్కింది. నోబెల్ పురస్కారం లభించింది. 2023 నోబెల్ బహుమతుల ప్రకటనలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో ఉన్న కరోలిన్ స్కా ఇనిస్టిట్యూట్లోని నోబెల్ జ్యూరీ ప్రకటన చేసింది. ముందుగా వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన వారి పేర్లను ప్రకటించారు. ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎం ఆర్ ఎన్ ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక పరిశోధనలు చేసిన ఇద్దరు వైద్య శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారాలు లభించాయి.
వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన కాటలిన్ కరికో, డ్రు వైస్మన్ కు అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం 2023 వరించింది. కొవిడ్ ను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియో సైడ్ బేస్ మాడిఫికేషన్లకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను వీరిద్దరికీ ఈ అవార్డు ప్రకటించినట్లు జ్యూరీ మెంబర్లు వెల్లడించారు.
నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను వారం రోజులు పాటు ప్రకటించనున్నారు. రోజుకో రంగంలో అవార్డు దక్కించుకున్న వారి పేర్లను వెల్లడించనున్నారు. తొలుత వైద్య విభాగంతో పేర్ల ప్రకటన ప్రారంభమైంది. మంగళవారం ఫిజిక్స్, బుధవారం కెమిస్ట్రీ, గురువారం సాహిత్య విభాగాల్లో ఎంపికైన వారి పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం 2023 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 9న ఎకనామిక్స్ లో ఈ నోబెల్ పురస్కారాన్ని దక్కించుకున్న వారి పేర్లను విడుదల చేయనున్నారు. ఈసారి నోబెల్ బహుమతి గ్రహీతలకు ఇచ్చే నగదు పారితోషికాన్ని పెంచారు. గతంలో భారత కరెన్సీ ప్రకారం రూ.7.58 కోట్లు చెల్లించగా.. ఈసారి మాత్రం దానిని రూ.8.35 కోట్లు అందించనున్నారు.