Kamala Harris: అతను అధ్యక్షుడైతే అరాచకమే.. వలస విధానంపై సంచలన ప్రకటన చేసిన కమలా హ్యారిస్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ప్రచారం జోరు పెరుగుతోంది. అధికార డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Written By: Raj Shekar, Updated On : August 23, 2024 5:02 pm

Kamala Harris

Follow us on

Kamala Harris: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటరు నమోదు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇక ఎన్నికలకు ఇంకా మూడు నెలలే గడువు ఉండడంతో అభ్యర్థులు కూడా ప్రచారం జోరు పెంచారు. అధికా డెమోక్రటిక్‌ పార్ట మరోమారు అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మొదట అధ్యక్షుడు బైడెన్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే అనూహ్యంగా బైడెన్‌ తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ రేసులోకి వచ్చారు. బైడెన్‌ అభ్యర్థిగా ఉన్నప్పుడు డెమోక్రటిక్‌ పార్టీ గెలుపు అవకాశాలు బాగా తగ్గాయి. మెజారిటీ అమెరికన్లు ట్రంప్‌వైపు చూశారు. ఇదే క్రమంలో ట్రంప్‌పై కాల్పులు జరపడం కూడా ఆయనకు కలిసి వచ్చింది. కానీ, కమలా రేసులోకి వచ్చాక ట్రంప్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. పైకి కమలాపై గెలుపు చాలా ఈజీ అని ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. కానీ, ఆయన ప్రచారంతో కమలాను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నారు. మరోవైపు ప్రీపోల్‌ సర్వేలు కమలా హారిస్‌ గెలుపు అవకాశాలు పెరుగుతున్నట్లు పేర్కొంటున్నాయి.

ఆయన వస్తే అరాచకమే..
కమలా హారిస్‌ అమెరికా అధ్యక్షురాలు అయితే.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. ఆమె నిర్ణయాలు యుద్ధాన్ని ప్రేరేపించేలా ఉంటాయని విమర్శించారు. అంతకుముందు కమలా నవ్వు చండాలంగా ఉంటుందని, కమలాకన్నా తానే అందంగా ఉంటానని విమర్శించారు. తాజాగా కమల కూడా ట్రంప్‌కు అంతే దీటుగా సమాధానం ఇస్తున్నారు. తాజాగా తాను అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికా వలస విధానాన్ని సంస్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌ సహా నాటో కూటమి దేశాలకు అండగా ఉంటామని వెల్లడించారు. ఈసందర్భంగా ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. ఆయన నిబద్ధత ఉన్న నాయకుడు కాదని విమర్శించారు. ఆయన ఎన్నికై తిరిగి శ్వేతసౌధంలోకి అడుగు పెట్టే అవకాశం వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తూ డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ సమావేశంలో గురువారం ఆమె ప్రసంగించారు.

దేశ భవిష్యత్తుకు కొత్త బాటలు వేద్దాం..
‘పార్టీ, జాతి, లింగం లేదా మీ బామ్మ మాట్లాడే భాషతో సంబంధం లేకుండా ప్రతి అమెరికన్‌ తరపున యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా అధ్యక్ష పదవికి మీ నామినేషన్‌ను అంగీకరిస్తున్నాను‘ అని కమలా హారిస్‌ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. డీఎన్సీ చివరి రోజు సమావేశానికి ఆమె మద్దతుదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చప్పట్లు, స్టాండింగ్‌ ఒవేషన్లు, నినాదాలు, ప్లకార్డులతో తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అమెరికాను ఐక్యం చేస్తూ దేశ భవిష్యత్తు కోసం పనిచేసే అధ్యక్షురాలిగా నిలుస్తానని ఆమె ఇచ్చిన హామీని కార్యకర్తలు తమ కరతాళధ్వనులతో స్వాగతించారు. గతంలో ఎదుర్కొన్న విభజన, విద్వేషం వంటి సమస్యలను అధిగమించడానికి ఈ ఎన్నికలు గొప్ప అవకాశమని కమలా హారిస్‌ తెలిపారు. పార్టీ, వర్గాలుగా చీలిపోకుండా అమెరికన్లుగా కొత్త మార్గాన్ని సృష్టించుకుందామని పిలుపునిచ్చారు. తాను అధికారంలోకి వస్తే 21 శతాబ్ది విజేతగా అమెరికాను నిలుపుతానని హామీ ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో చైనాకు ఆ అవకాశం ఇవ్వబోనని ధీమా వ్యక్తం చేశారు.

ట్రంప్‌కు పట్టపగ్గాలుండవు..
ఈ సందర్భంగా ప్రత్యర్థి రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై కమలా మండిపడ్డారు. ఆయన విధానాలన్నీ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తాయని విమర్శించారు. ఈ ఎన్నికలు దేశచరిత్రలో చాలా కీలకంగా నిలవనున్నాయన్నారు. ట్రంప్‌ అధికారంలోకి వస్తే పట్టపగ్గాల్లేకుండా వ్యవహరిస్తారని దుయ్యబట్టారు. ఆయన నిబద్ధతలేని వ్యక్తి అని.. ఆయన్ని శ్వేతసౌధంలోకి మళ్లీ పంపితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వ్యాఖ్యానించారు.