US Presidential Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. మరో నెల రోజులే సమయం ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎలాగైనా గెలవాలని హామీలు కురిపిస్తున్నారు. అన్నివర్గాలను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో అధ్యక్ష రేసులో ఎవరు ముందు ఉన్నారో తెలుసుకునేందుకు పలు సంస్థలు సర్వే చేస్తున్నాయి. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్ పోటీలో ఉన్నప్పుడు. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కాస్త దూకుడు ప్రదర్శించారు. బైడెన్‌కన్నా ముందంజలో ఉన్నారు. అయితే ట్రంప్‌పై పెన్సిల్వేనియాలో కాల్పుల తర్వాత ట్రంప్ ఇమేజ్ మరింత పెరిగింది. సానుభూతి ఓటర్లు ఆయనవైపు మొగ్గు చూపారు. దీంతో బైడెన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రేసులోకి వచ్చారు. కమలా వచ్చాక పరిణామాలు వేగంగా మారిపోయాయి. కమలాపై గెలుపు నల్లేరుపై నడకే అని ట్రంప్ ప్రకటించారు. కానీ ఐదేళ్లు ట్రంప్ నియంతృత్వ పాలనను చూసిన అమెరికన్లు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, మెటా సీఈవో జూకర్‌బర్గ్ కూడా ట్రంప్‌కే మద్దతు తెలిపారు. కానీ, ప్రజలు ట్రంప్‌కు ఓటు వేయడానికి నిరాకరిస్తున్నారు. పలు సర్వేల్లో కమలా ముందు ఉంటున్నారు.
తాజాగా మరో సర్వేలోనూ..
అమెరికా కొత్త అధ్యక్షుడు ఎవరు అన్నదానిపై ప్రఖ్యాత యూమాస్ లోవెల్స్ సెంర్ ఫర్ పబ్లిక్ ఓపీనియన్ అండ్ యుగవ్ సంస్థ తాజాగా సర్వే ఫలితాలు విడుదల చేసింది. ఇందులో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్.. మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కన్నా ముందంజలో ఉన్నారు. అరిజోనా, మిచిగాన్, పెన్సిల్వేనియా వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో హారిస్ ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడించింది. మిచిగాన్‌లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు 43 శాతం డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హారిస్‌కు 48 శాతం మంది మద్దతు ఇచ్చారు. ఇక జార్జియాలో ఏకంగా 51 శాతం మంది కమలాకే మొగ్గు చూపారు.
ట్రంప్‌పై వ్యతిరేకతతోనే..
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగానే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు కలిసి వస్తుందని యుమాస్ లోవెల్ పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ అసోసియేట్ డైరెక్టర్ రోడ్రిగో కాస్ట్రో కార్నెజో తెలిపారు. మిచిగాన్‌లో ట్రంప్‌పై భారీ వ్యతిరేకత ఉందని తెలిపారు. అరిజోనాలో హారిస్‌కు 48 శాతం, ట్రంప్‌నకు 51 శాతం మంది మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. ఇక జాతీయ స్థాయిలో ట్రంప్ హారిస్‌కన్నా 2 శాతం ఓట్లతో వెనుకబడినట్లు తెలిపారు.
పలు సర్వేల్లోనూ హారిస్‌కే ఎడ్జ్..
ఇక ఇటీవల ప్రముఖ వార్తా సంస్థలు నిర్వహించిన పోల్స్‌లోనూ ట్రంప్ కన్నా.. కమలా హారిస్ ఆధిక్యంలో ఉన్నారు. సెప్టెంబర్ 10న నిర్వహించిన టీవీ డిబేట్‌లోనూ కమలా పైచేయి సాధించారు. దీంతో విరాళాలు భారీగా వచ్చాయి. నవంబర్ 5న ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల రోజు ఎక్కువ మంది తమ మద్దతు దారులు పోలింగ్‌లో పాల్గొనేలా చేయడం ద్వారా గెలుపు అవకాశాలు మెరుగు పర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య స్వల్పో తేడా నేపథ్యంలో పోలింగ్ రోజు వరకూ గెలుపు ఎవరిదో చెప్పలేమన్న అభిప్రాయాన్ని సర్వే సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి.
అక్టోబర్ 1న ఉపాధ్యక్ష అభ్యర్థుల డిబేట్..
సెప్టెంబర్ 10న అధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య డిబేట్ జరిగింది. మరో డిబేట్‌కు ట్రంప్ విముఖ వ్యక్తం చేశారు. తొలి డిబేట్‌లో కమలా పైచేయి సాధించడంతో 24 గంటల్లో హారిస్‌కు 47 మిలియన్ల(రూ.394 కోట్లు) విరాళంగా వచ్చాయి. ఇక అక్టోబర్ 1న డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థులు టిమ్, జేడీ వాన్స్ మధ్య డిబేట్ జరుగనుంది. ఈ డిబేట్ కూడా ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.