Venkat Reddy : జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకట్ రెడ్డి అనే వ్యక్తి గనుల శాఖలో కీలక పదవి నిర్వహించాడు.. ఇసుక నుంచి మొదలుపెడితే ఇతర ఖనిజాల వరకు అడ్డగోలుగా నాటి ప్రభుత్వ పెద్దలు దోచుకున్నారని ప్రస్తుత టిడిపి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా కీలకమైన ఆధారాలను బయటపెట్టింది. ఇక అప్పటినుంచి గనుల శాఖను పర్యవేక్షించిన వెంకటరెడ్డిని అరెస్టు చేయాలని భావిస్తోంది. అయితే గత మూడు నెలల నుంచి ఆయన పరారీలో ఉన్నారు. నాటి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినవారు ఇసుక, ఇతర ఖనిజాలను అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. వారంతా భారీగానే సంపాదించారని.. ఇసుకను, ఖనిజాలను ఇతర ప్రాంతాలకు తరలించారని.. కానీ గనుల శాఖను పర్యవేక్షించిన వెంకటరెడ్డి ఇప్పుడు అభియోగాలు ఎదుర్కొంటున్నారని ప్రచారం జరుగుతోంది. హాయిగా వెంకటరెడ్డి కోస్ట్ గార్డ్ లో దర్జాగా ఉద్యోగం చేసుకోకుండా.. మన ప్రభుత్వం అంటూ వచ్చి.. ఇప్పుడు పర్యవసనాలను అనుభవిస్తున్నారని.. రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వెంకటరెడ్డిని గత ప్రభుత్వం ముద్దు పెట్టిందని.. ఇసుక, ఇతర ఖనిజాలను నాటి ప్రభుత్వ పెద్దలు దర్జాగా దోచుకున్నారని.. ఇప్పుడు నిందలు మాత్రం వెంకటరెడ్డి పై వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నాటి ప్రభుత్వ పెద్దలు వెంకటరెడ్డిని రకరకాలుగా ప్రలోభాలకు గురి చేశారని.. అందువల్లే ఆయన మన ప్రభుత్వం అంటూ గనుల శాఖలోకి వచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. ” నాడు మైనింగ్ డిపార్ట్మెంట్ లో ముఖ్య అధికారిగా వెంకటరెడ్డి కొనసాగాడు. ఆ విభాగంలో జరుగుతున్న అవకతవకలపై.. కొన్ని పత్రికలు రాసేవి. వాటికి ఖండన ఇవ్వాల్సిన సమయంలో వెంకటరెడ్డి.. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే పదాన్ని పదే పదే వాడారు. వాస్తవానికి అలాంటి పదాన్ని మంత్రులు లేదా ఎమ్మెల్యేలు వాడితే పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు. గనుల శాఖలో కీలక అధికారిగా ఉన్న అతను మన ప్రభుత్వం అని వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగించిందని” రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అసలు విషయాలు వెలుగులోకి వస్తాయా?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గనుల శాఖను ప్రక్షాళన చేయడం మొదలుపెట్టింది. ఇప్పటికే ఉచిత ఇసుకను రవాణా చేస్తోంది. ఈ క్రమంలో నాడు గనుల శాఖలో చోటు చేసుకున్న అక్రమాలపై కొరడా ఝుళిపించడం ప్రారంభించింది. నాడు గనుల శాఖ కీలక అధికారిగా ఉన్న వెంకటరెడ్డిని ఎట్టకేలకు అరెస్టు చేసింది. గత మూడు నెలలుగా ఆయన పరారీలో ఉన్నారు. చివరికి హైదరాబాదులో ఏపీ పోలీసులకు చిక్కారు.. ఇప్పుడు వెంకట్ రెడ్డి ద్వారా కూటమి ప్రభుత్వం జగన్ పై ఒత్తిడి తీసుకొస్తుందా?.. నాడు కోట్లకు కోట్లు దోచుకున్న వారిని అరెస్టు చేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది. ఒకవేళ వెంకటరెడ్డి నాటి విషయాలు మొత్తం చెబుతారా? లేకుంటే నేరాలు మొత్తం తనమీద వేసుకుంటారా? ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు లభిస్తాయో తెలియదు కాని.. కోస్ట్ గార్డ్ లో పనిచేయాల్సిన ఓ వ్యక్తి జైలుకు వెళ్లడం.. నిజంగా బాధాకరమే.