Kamala Harris: భారతీయులను ఆకట్టుకునేందుకు కమలాహారిస్ ‘నాటు నాటు’

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రచారంలో స్పీడు పెంచారు నేతలు. ఓటర్లును ఆకట్టుకునేందకు వివిధ మార్గాలు అనుసరిస్తున్నారు. హామీలు ఇస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : September 9, 2024 1:22 pm

Kamala Harris(1)

Follow us on

Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. దీంతో ప్రచారం మరింత వేడెక్కింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌.. డెమొక్రాటిక్‌ పార్టీ నామినీ కమలా హారిస్‌ దూసుకుపోతున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. అన్నివర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రీపోల్‌ సర్వే ఫలితాలు కూడా పోటాపోటీగా వెల్లడవుతున్నాయి. కొన్నింటిలో కమలా.. కొన్నింటిలో ట్రంప్‌ ముందంజలో ఉంటున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో దక్షిణాసియా దేశాలకు చెందిన జనాల ఓట్లను ఆకర్షించడమే లక్ష్యంగా కమలా హ్యారీస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ సంతతి వ్యక్తులు, అక్కడ స్థిరపడిన భారతీయ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కమలా హ్యారీస్‌ ప్రచారం బృందం విడుదల చేసిన ఒక వీడియోను తెలుగుపాటతో రూపొందించారు. సూపర్‌ డూపర్‌ విజయం సాధించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీలోని ‘నాటు నాటు’ పాట హిందీ వెర్షన్‌ మ్యూజిక్‌ ట్రాక్‌ ఆధారంగా కమలా హ్యారీస్‌ ప్రచార గీతాన్ని రూపొందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్‌-అమెరికన్‌ వ్యవస్థాపకుడు అజయ్‌ భూటోరియా సోషల్‌ మీడియాలో విడుదల చేశారు.

భారతీయ నాయకులు కనిపించేలా…
ఈ వీడియోలో భారతీయ కమ్యూనిటీకి చెందిన పలువురు నాయకులు కూడా కనిపించారు. కమలా హారిస్‌కు ఓటు వేయాలని వారు కోరారు. వేర్వేరు భారత ప్రాంతీయ భాషలలో కమలా హ్యారీస్‌కు ఓటు వేయాలని కోరారు. కమలకు ఓటు వేయాలని తెలుగు భాషలో కూడా డెమొక్రాటిక్‌ పార్టీ నేతలు కోరారు. కాగా దక్షిణాసియాకు చెందినవారు అమెరికాలో పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, జార్జియా, నెవాడా, అరిజోనా వంటి కీలక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. దాదాపు ఐదు మిలియన్ల దక్షిణాసియా ఓటర్లు ఉంటారని అంచనాగా ఉంది. వీరిని స్వింగ్‌ ఓటర్లుగా అమెరికా నేతలు భావిస్తున్నారు. అందుకే వారిని ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

నాచో నాచో..
అధ్యక్ష ఎన్నికల్లో వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హ్యారిస్‌కు మద్దతుగా కొత్త మ్యూజిక్‌ వీడియో ‘నాచో నాచో’ను విడుదల చేస్తున్నందుకు సంతోషిస్తున్నామని అజయ్‌ జైన్‌ భుటోరియా పేర్కొన్నారు. కీలకమైన రాష్ట్రాలలో దక్షణాసియాలోని ఓటర్లను కమలా హ్యారీస్‌కు అనుకూలంగా మార్చుదాం అంటూ ప్రకటించారు. విభజన రాజకీయాలు చేస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌ చరిత్రను తిరగరాయడానికి అవకాశం వచ్చిందని వ్యాఖ్యానించారు.