Masood Azhar: అమెరికా నుంచి భారత్ వరకు ఉగ్రవాదం వల్ల ఇబ్బంది పడిన దేశాలే.. ఇప్పటికి ఇబ్బంది పడుతున్న దేశాలే.. కేవలం ఉగ్రవాదం నుంచి దేశాలను కాపాడుకునేందుకు వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. కాశ్మీర్ సరిహద్దుల్లో భద్రత కోసం మన దేశం ఇప్పటివరకు వెచ్చించిన సొమ్మును గనుక అభివృద్ధికి కేటాయిస్తే మనదేశం ఎప్పుడో అమెరికాను దాటిపోయేది. కాశ్మీర్ మాత్రమే కాదు, విమానాల హైజాక్, బాంబు పేలుళ్లు, రైలు పేలుళ్లు, పార్లమెంట్ భవనం మీద దాడి, మత కల్లోలాలు.. ఉగ్రవాదం వల్ల ఇలా చాలా వాటిని మన దేశం చవిచూసింది.. ఆర్థికంగా చాలా నష్టపోయింది. చాలామంది ఈ దేశ ప్రజలను కోల్పోయింది.. అయితే కొంతకాలంగా ఈ పరిస్థితిలో మార్పు వస్తున్నది. భారత్ పై దాడి చేసి, నిత్యం విషం చిమ్మే వారంతా ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. అది కూడా ఉగ్ర వాదులకు స్వర్గ ధామం లాంటి పాక్ లో..
ఇటీవల వరుసగా ఉగ్రవాదుల హత్యలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉగ్రవాదులు అందరూ చూస్తుండగానే హత్యకు గురవుతున్నారు. ఎవరో రావటం, అందరూ చూస్తుండగానే కాల్పులు జరపటం, టార్గెట్ వ్యక్తి అక్కడే చనిపోవడం చోటుచేసుకుంటున్నాయి. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి ఉగ్రవాది అని, భారత వ్యతిరేకి అని, గతంలో దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడ్డాని తర్వాత తెలుస్తోంది. ఇలా ఇటీవల కేవలం పాకిస్తాన్లోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు దాదాపు 8 మంది దాకా హతమయ్యారు. ఇక వేర్పాటు ఉద్యమానికి, ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని, దేశంలో అంతర్గత కలహాలు సృష్టించాలని పన్నాగాలు పన్నుతున్న వారు కూడా హతమవుతున్నారు. అయితే వీరి హత్య వెనక గూడచారి సంస్థలు ఉన్నాయా, లేక మరెవరైనా ఉన్నారా అనే విషయాలు పక్కన పెడితే వీరు హతమవడం పట్ల దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా నిన్నటి నుంచి జాతీయ మీడియా నుంచి స్థానిక మీడియా వరకు ఒక వార్త చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్లో కొనసాగుతోంది. ఇంతకీ అదేంటయ్యా అంటే.. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మహమ్మద్ మసూద్ అజర్ హతమయ్యాడని.. ఇతడు భారత్ కు వ్యతిరేకంగా చాలా పనులు చేశాడు. మన దేశమంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది కాబట్టి పాకిస్తాన్ ఇతడికి షెల్టర్ ఇచ్చింది. 1999లో కాందహార్ విమానం దారి మళ్లింపు, తర్వాత హైజాక్ చేయడంతో.. అప్పట్లో విడుదలకు డిమాండ్ చేసిన వాళ్లలో ఇతడు కూడా ఉన్నాడు. బయటికి వచ్చిన తర్వాత 2001లో పార్లమెంట్ మీద దాడి చేశాడు. 2008 ముంబైలో దాడుల వెనుక కీలకపాత్ర పోషించాడు. 2016లో పటాన్ కోట్ లో దాడి వెనుక సూత్రధారిగా ఉన్నాడు. 2019 పుల్వామా దాడి లోనూ కీలక పాత్రధారిగా ఉన్నాడు. కేవలం మన దేశానికి మాత్రమే కాదు ప్రపంచానికే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఇతడు. 2019లో ఐక్యరాజ్యసమితి ఇతడిని వరల్డ్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇతడిని పాకిస్తాన్లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారని.. ప్రపంచంలోనే అత్యంత మోస్ట్ టెర్రరిస్ట్ గా పేరుపొందిన ఇతడు పాకిస్తాన్ దేశంలో అంత స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నాడు? తమ దేశంలో ఉగ్రవాదులు లేరని చెబుతున్న పాకిస్తాన్ దేశంలో ఇతడు ఎలా ఉంటున్నాడు? పైగా సోమవారం పాకిస్తాన్లోని భావల్ పూర్ మసీదు నుంచి ఉదయం 5 గంటలకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పేల్చడం.. ఆ ఘటనలో మసూద్ అజహర్ చనిపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. మరి దీనిని పాకిస్తాన్ ఎందుకు ఖండించడం లేదు? ఆ చనిపోయింది అజహర్ కాదు అని ఎందుకు చెప్పడం లేదు? మరోవైపు ఇటీవల తమ దేశంలో వరుసగా ఉగ్రవాదులు హత్యలు జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్ నోరు మెదపడం లేదు. కానీ ఇక్కడ స్థూలంగా చెప్పుకోవాల్సింది ఒకటుంది.. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్ దేశాన్ని ఒత్తుతున్నది నిజం. ప్రపంచ వేదికల ముందు పాకిస్తాన్ దేశాన్ని పలుచన చేస్తున్నది నిజం. ఉగ్రవాదాన్ని అణిచి వేస్తున్నది నిజం. అందుకే పాకిస్తాన్ సైలెంట్ అయిపోతోంది. అదే సమయంలో భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసిన వారు సైలెంట్ గానే హతమవుతున్నారు.. దీని వెనుక ఎవరున్నారు అనేది బహిరంగ రహస్యం. కానీ భారత్ చెప్పదు.. పాకిస్తాన్ చెప్పు కోలేదు. అయితే మసూద్ అజహర్ చనిపోలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. అయితే గతంలో లాడెన్ ను అంతమొందించిన తర్వాత కూడా పాకిస్తాన్ ఇలాగే మాట్లాడింది. తర్వాత ప్రపంచ దేశాల ముందు తలవంచింది. ఇప్పుడు మసూద్ విషయంలో కూడా ఇలానే జరుగుతుందేమో?!