Jack Sullivan: త్వరలో భారత్‌కు అమెరికా ప్రతినిధి.. కొత్త ప్రభుత్వంతో చర్చలు..

మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇప్పటికే ఫోన్‌ చేశారు. శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తమ ప్రతినిధిని భారత్‌కు పంపుతున్న విషయం చర్చకు వచ్చింది.

Written By: Raj Shekar, Updated On : June 6, 2024 12:39 pm

Jack Sullivan

Follow us on

Jack Sullivan: దేశంలో మరో రెండు మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలకు అమెరికా ప్రయత్నాలు మొదలు పెట్టింది. తమ దేశ జాతీయ భద్రతాసలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) జాక్‌ సలీవాన్‌ను భారత్‌కు పంపాలని నిర్ణయించింది. ఈమేరకు వైట్‌హౌస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

మోదీకి బైడెన్‌ ఫోన్‌..
మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇప్పటికే ఫోన్‌ చేశారు. శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తమ ప్రతినిధిని భారత్‌కు పంపుతున్న విషయం చర్చకు వచ్చింది. ఈమేరకు వైట్‌హౌస్‌ చేసిన ప్రకటనలో తెలిపింది.‘బైడెన్‌ నేడు ప్రధాని మోదీకి ఫోన్‌చేశారు. ఈ సందర్భంగా త్వరలో జాతీయ భద్రతా సలహాదారు న్యూఢిల్లీ పర్యటనకు ప్రస్తావనకు వచ్చింది. కొత్త ప్రభుత్వంలో భారత్‌–అమెరికా ప్రధాన్యాలపై చర్చించనున్నారు. వీటిల్లో సాంకేతిక భాగస్వామ్యం, వ్యూహాత్మక బంధం పరస్పర విశ్వాసం వంటి అంశాలు ఉండనున్నాయి’ అని ఆ ప్రకటనలో తెలిపింది.

త్వరలో తేదీ ప్రకటన..
ఇదిలా ఉండగా అమెరికా భద్రతా సలహాదారు పర్యటన తేదీలను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం జరిగిన కొన్ని రోజుల్లోనే ఈ పర్యటన ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక అమెరికాలో కీలక నాయకులు కూడా ప్రధానికి అభినందనలు తెలిపారు. సెనెట్‌ ఫారెస్‌ రిలేషన్స్‌ కమిటీ చైర్మన్‌ బేస్‌ కార్డిన్‌ భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎండలను లెక్కచేయకుండా భారత ప్రజలు ఓట్లు వేసి ప్రజాస్వామ్య విధానాలపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. రానున్న సంవత్సరాల్లో ప్రపంచాన్ని సుసపన్నం చేసేందుకు భారత్‌–అమెరికా భాగస్వామ్యం మరింత బలపడుతుందని అని తెలిపారు.

దేశాధినేతల శుభాకాంక్షలు..
ఇదిలా ఉండగా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని మోదీకి అమెరికాతోపాటు, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా సహా పలు దేశాల అధినేతలు అభినందనలు తెలిపారు. ఆయా దేశాలు భారత్‌తో సంబంధాలు బలోపేతం చేసుకోవాలన్న ఆకాంక్షను వెల్లడించారు. విజయం సాధించిన మోదీకి ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు ఈ చరిత్రాత్మక ఎన్నికల్లో 65 కోట్ల మంది పాల్గొన్నారు అని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తెలిపారు. దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని ఎక్స్‌లో పోస్టు చేశారు. మోదీని అభినందించిన వారిలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ్‌ సింఘే, నేపాల్‌ ప్రధాని పుష్స కమాల్‌ దహల్, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు, భూటాన్, మారిషస్, జమైకా ప్రధానులు ఉన్నారు.