Keir Starmer: బ్రిటన్‌ కొత్త ప్రధానిగా కైర్‌ స్టార్మర్‌.. ఆయన నేపథ్యం ఇదీ..

బ్రిటన్‌ పార్లమెంటు ఎన్నికల్లో వామపక్ష లేబర్‌ పార్టీ ఘన విజంయ సాధించింది. ఈ విజయం వెనుక కైర్‌ స్టార్మర్‌ ఉన్నారు. 14 ఏళ్ల కన్జర్వేటివ్‌ పార్టీ పాలనకు తెరదించి యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నది ఇతనే.

Written By: Raj Shekar, Updated On : July 5, 2024 2:58 pm

Keir Starmer

Follow us on

Keir Starmer: బ్రిటన్‌ ప్లామెంటు ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘన విజయంవైపు దూసుకుపోతోంది. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఘోర పరాభవం మూటగట్టుకుంది. దీంతో ఆ పార్టీ నేత భారత సంతతికి చెందిన రిషి సునక్‌ ఓటమిని అంగీకరించారు. ఈ పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. ఘన విజయం సాధించిన లేబర్‌ పార్టీ నేత కైర్‌ స్టార్మర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఎవరీ కైర్‌ స్టార్మర్‌
బ్రిటన్‌ పార్లమెంటు ఎన్నికల్లో వామపక్ష లేబర్‌ పార్టీ ఘన విజంయ సాధించింది. ఈ విజయం వెనుక కైర్‌ స్టార్మర్‌ ఉన్నారు. 14 ఏళ్ల కన్జర్వేటివ్‌ పార్టీ పాలనకు తెరదించి యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నది ఇతనే. బ్రిటన్‌ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ 326ను దాటేసింది. 400 సీట్ల మైలురాయిని అధిగమించే దిశగా దూసుకుపోతోంది. పార్టీ గెలుపులో స్టార్మర్‌ కీలకపాత్ర పోషించారు. 61 ఏళ్ల స్టార్మర్‌ ఉత్తర లండన్‌ నుంచి ఘన విజయం సాధించారు. ఈయన వృత్తి రిత్యా లాయర్‌. న్యాయశాస్త్రంలో చేసిన సేవలకు బ్రిటన్‌ రాణి ఎలిజిబెత్‌ 2 నుంచి నైట్‌ పురస్కారం అందుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన 2015 ఎన్నికల్లో నార్త్‌ లండన్‌ నుంచి తొలిసారి విజయం సాధించారు. కైర్‌ భార్య విక్టోరియా నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ విభాగంలో ఉద్యోగి. వీరికి ఇద్దరు సంతానం. సర్రేలోని ఆక్సె్టడ్‌లో జన్మించిన స్టార్మర్‌.. తండ్రి టూల్‌ మేకర్‌.. తల్లి జోసెఫైన్‌ సాధారణ నర్సు. లేబర్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కైర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. ఆయన ఫుట్‌బాల్‌ అంటే ఇష్టం. లేబర్‌ పార్టీ తొలి నేత కైర్‌ హర్డై పేరునే ఆయనకు తల్లిదండ్రులు పెట్టడం విశేషం.

లేబర్‌పార్టీ బలోపేతంలో కీలకపాత్ర..
2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ లేబర్‌పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన కైర్‌ స్టార్మర్‌ లేబర్‌ పార్టీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. కశ్మీర్‌ అంశంపై లేబర్‌ పార్టీ మాజీ నాయకుడు జెరెమీ కార్బిన్‌ భారత వ్యతిరేక వైఖరిని అవలంబించడంతో దూరమైన ప్రవాస భారతీయులను తిరిగి తమవైపు తిప్పుకోవడంలో కైర్‌ సఫలమయ్యారు. విజయం అనంతరం మాట్లాడుతూ ‘మార్పు ఇక్కడే ప్రారంభమవుతుంది ఎందుకంటే ఇది మీ ప్రజాస్వామ్యం, మీ సంఘం.. మీ భవిష్యత్తు అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. మీరు ఓటు వేశారు. మీకే సువకులుగా పనిచేస్తాం అని ప్రకటించారు.

భారత్‌ పట్ల స్టార్‌మర్‌ వైఖరి..
స్టార్మర్‌ భారత్‌ అనుకూల వైఖరి అవలంబిస్తున్నారు. గతేడాది జరిగిన ఓ కార్యక్రమంలో స్టార్మర్‌ మాట్లాడుతూ ప్రపంచ భద్రత, వాతావరణ పరిరక్షణ, ఆర్థిక స్థిరత్వం కోసం భారత్‌తో బలమైన సంబంధాలను కోరుకుంటున్నట్టు వెల్లడించారు. భారత్‌తో ప్రజాస్వామ్య, ఆకాంక్షల విలువలపై ఆధారపడిన సంబంధాలను లేబర్‌ పార్టీ ప్రభుత్వం కోరుకుంటుంది.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై పరస్పరం అభిప్రాయాలను పంచుకుంటామని వివరించారు. ఇదే సమయంలో ప్రపంచ భద్రత, వాతావరణ భద్రత, ఆర్థిక భద్రతకు కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా అవసరమని వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సహా భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కోరుకుంటున్నట్టు పొందుపరిచారు. అలాగే, భద్రత, విద్య, సాంకేతికత, వాతావరణ మార్పులపై సహకారం ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తర లండన్ లోని కింగ్స్‌బరీలో ఉన్న స్వామి నారాయణ్‌ ఆలయాన్ని దర్శించిన కైర్‌.. హిందూ సమాజానికి ఎటువంటి భయాందోళనలు వద్దని భరోసా ఇచ్చారు.

స్టార్మర్‌ ముందు సవాళ్లు..
స్టార్మర్‌ సారథ్యంలో వామపక్ష లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ ప్రధాని పదవి చేపట్టబోయే కైర్‌ స్టార్మర్‌ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఆర్థిక సంక్షోభం బ్రిటన్‌కు ఇబ్బందిగా మారింది. స్టార్మర్‌ మాత్రం దేశ పునరుద్ధరణ దిశగా పని మొదలు పెడదాం అని పిలుపునిచ్చారు.

క్షమాపణలు కోరిన రిషి..
ఇదిలా ఉంటే.. ఫలితాల అనంతరం రిషి సునక్‌ తన సొంత నియోజకవర్గం రిచ్‌మండ్‌ అండ్‌ నార్తర్న్‌ అలర్టన్‌లోని పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ అధికారం శాంతియుతంగా చేతులు మారుతుందని తెలిపారు. అది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుందని పేర్కొన్నారు. పార్టీ ఓటమికి బాధ్యుడిని అయిన తనను క్షమించాలని కోరారు.