India vs Maldives : పాకిస్తాన్ దేశాన్ని గుప్పిట పట్టింది. శ్రీలంకను సర్వనాశనం చేసింది. నేపాల్ ను తొక్కి పట్టింది. తైవాన్ తో కయ్యానికి కాలు దిగుతోంది. టిబెట్ ను ఎప్పుడో తనలో కలిపేసుకుంది.. ఇలా చెప్పుకుంటూ పోతే చైనా దురాఘతాలు ఒక్కరోజులో ఒడిసిపోవు. దానిది ధృతరాష్ట్ర కౌగిలి.. పాపం పిచ్చి మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు భారత్ మీద ఉన్న కోపంతో చైనాకు దగ్గరయ్యాడు. ఏవేవో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. చైనా నుంచి కబురు పంపగానే రెక్కలు కట్టుకొని వాలుతున్నాడు. ఇప్పటికైతే బాగానే ఉంటుంది కానీ.. మునుముందు రోజుల్లో అసలు సినిమా కళ్ళ ముందు కనిపిస్తుంది.
ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ ప్రాంతానికి వెళ్లి.. ట్విట్టర్లో ఫోటోలు పోస్ట్ చేసి.. మీ తదుపరి సాహస ప్రయాణం లక్షద్వీప్ కావాలని భారతీయులను కోరాడు. మోడీ పెట్టిన ఆ పోస్ట్ మాల్దీవుల ప్రభుత్వానికి ఎక్కడో కాలేలా చేసింది. ఆ దేశానికి చెందిన మంత్రులు పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేయడం.. దానిని మన దేశం సీరియస్ గా తీసుకోవడం.. భారతీయులు బైకాట్ మాల్దీవులని నిర్ణయించుకోవడం.. చక చకా జరిగిపోయాయి. ఫలితంగా మన దేశం నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకులు పూర్తిగా తగ్గిపోయారు. ఇదే సమయంలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు చైనాకు దగ్గరయ్యాడు. రకరకాల రకరకాల ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. అంతేకాదు తన దేశం నుంచి భారత సైనికులను వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఈ పరిణామం అక్కడి ప్రతిపక్ష పార్టీని కలవర పెట్టింది. పార్లమెంట్లో రచ్చ రచ్చ అయిపోయింది. అయినప్పటికీ ముయిజ్జు వెనక్కి తగ్గలేదు. భారతీయులు సందర్శించడం తగ్గిపోవడంతో మాల్దీవుల ఆదాయం పడిపోయింది. ఆమధ్య బెయిల్ ఔట్(ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు దేశాలు చేసుకునే విన్నపం) కు ఐఎంఎఫ్ కు మాల్దీవులు విన్నవించింది. అక్కడ ప్రతిపక్ష నాయకులు సహాయం చేయాలని భారతీయులను సోషల్ మీడియా వేదికగా కోరారు. ఇవన్నీ జరుగుతుండగానే మాల్దీవుల ప్రభుత్వం తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది.
గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మాల్దీవుల ప్రాంతాన్ని 56, 208 మంది భారతీయ పర్యాటకులు సందర్శించారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు పర్యాటకుల సంఖ్య 34,847 కు పడిపోయింది. స్థూలంగా చెప్పాలంటే భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య 40 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో చైనా నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య 200 శాతానికి పెరిగింది. గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు చైనా నుంచి 17,691 మంది పర్యాటకులు మాల్దీవుల ప్రాంతాన్ని సందర్శించారు. ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఆసంఖ్య 67,399కి పెరిగింది. అంటే దాదాపు 281 శాతం వృద్ధి నమోదయింది. తాజా గణాంకాల ప్రకారం మాల్దీవుల పర్యాటకానికి సంబంధించి టాప్ టెన్ మార్కెట్లలో భారత్ ఆరవ స్థానంలో ఉండగా.. చైనా 11% వాటాతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. గత ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు మాల్దీవులను సందర్శించే వారిలో భారతీయులు రెండవ స్థానంలో ఉండేవారు. రష్యన్లు మొదటి స్థానంలో ఉండేవారు. 2020 కి ముందు మాల్దీవుల ప్రాంతాన్ని సందర్శించే వారిలో చైనా దేశస్తులు మొదటి స్థానంలో ఉండేవారు. అప్పట్లో చైనా 18.31 శాతం వాటాను కలిగి ఉండేది. ఆ సంవత్సరంలో అదే అత్యధికమని అప్పట్లో మాల్దీవుల పర్యాటక శాఖ ప్రకటించింది. గత ఏడాది నవంబర్ వరకు మాల్దీవుల పర్యాటకంలో భారతదేశానిదే ఆధిపత్యం కొనసాగేది. ఆ తర్వాత అది క్షీణించడం మొదలైంది. ఏడాది జనవరిలో 3, ఆ నెల తర్వాత ఐదవ స్థానానికి, మార్చిలో ఆరవ స్థానానికి పడిపోయింది. అంతకుముందు చైనా పదోవ స్థానంలో ఉండగా, ఇప్పుడు ఏకంగా మొదటి స్థానానికి ఎగబాకింది.
చైనాతో చెలిమి తర్వాత.. మాల్దీవుల పర్యాటకశాఖ వెలువరించిన గణాంకాలు ఆ దేశానికి అనుకూలంగా ఉండడం చర్చకు దారితీస్తోంది. పర్యాటకశాఖ చెప్పిన లెక్కలను మాల్దీవుల ప్రతిపక్ష నాయకులు తప్పుపడుతున్నారు. ఇది చైనాకు వంత పాడే విధానంలాగా ఉందని దెప్పిపొడుస్తున్నారు. మరోవైపు ముయిజ్జు చైనాకు మరింత దగ్గరవుతున్నారు. ఆ దేశానికి చెందిన సైనిక వాహనాలను, ఇతర జలాంతర్గాములను మాల్దీవులకు ఆహ్వానిస్తున్నారు. కానీ, ఇక్కడే అతడు పెద్ద పొరపాటు చేస్తున్నాడు. ఎందుకంటే చైనా తన అవసరాలకు అనుగుణంగానే ఇతర దేశాలతో స్నేహం కొనసాగిస్తుంది. ఆ తర్వాత తన అసలు రంగు బయట పెడుతుంది. ఇది అర్థం అవ్వడానికి ముయిజ్జు కు ఎంతో కాలం పట్టకపోవచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Indian tourists going to maldives have decreased by 40 percent
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com