America : అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్.. అత్యంత భద్రత ఉన్న భవనం ఇంది. దీనిలోకి వెళ్లడం కూడా అంత ఈజీ కాదు. కానీ అలాంటి భవనపై దాడి జరిగింది. ఈ దాడిలో భారతీయుడు ఉన్నాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతడికి 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈమేరకు డిస్ట్రిక్ కోర్టు(District Court) జడ్జి దాబ్నీ ఫ్రెడ్రిచ్ శిక్ష ఖరారు చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక మూడేళ్లు నిఘా ఉంచాలని కూడా ఆదేశించారు. గ్రీన్‌కార్డు హోల్డర్ కావడంతో శిక్షలు ఖరారు చేస్తున్నట్లు తెలిపారు.
ఎవరీ సాయి వర్షిత్?
మిస్సోరిలోని చెస్ట్ ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్ అమెరికాలో శాశ్వత నివాసం పొందిన భారత సంతతి వ్యక్తి. అతనిది తెలుగు నేపథ్యంగా తెలుస్తున్నా.. ప్రాంత వివరాలపై స్పష్టత లేదు. 2022లో మార్క్వెట్ సీనియర్ స్కూల్ నుంచి గ్రాడ్యుçయేషన్ పూర్తి చేశాడు. ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంగ్వేజీలపై పట్టు సాదించాడు. డేటా అనలిస్టు(Data analist)గా కెరీర్‌ను ఎంచుకోవాలని చూస్తున్నట్లు అతడి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ద్వారా తెలిసింది. కాగా, ఆయనపై 2023 మే 22 వరకు ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా లేవు.
అద్దె ట్రక్కుతో…
ఇండియాకు చెందిన సాయి వర్షిత్ అమెరికాలో స్థిర పడ్డాడు. గ్రీన్‌కార్డు కూడా పొందాడు. అయితే బైడెన్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో 2023 మే 22న అద్దె ట్రక్కు తీసుకుని వైట్‌హౌస్‌పై దాడికి యత్నించాడు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. నాజీ భావజాలంతో వెళ్లి డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అతను యత్నించినట్లు తేలింది. అవసరమైతే అమెరికా అధ్యక్షుడు బైడెన్(Biden)ను చంపడానికి తాను వెనుకాడనని విచారణలో సాయి వర్షిత్ ఒప్పుకున్నాడు. బైడెన్ ప్రభుత్వాన్ని దించి నాజీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకే తాను దాడి చేసినట్లు అంగీకరించాడని యూఎస్ అటార్నీ ఇదివరకే ప్రకటించింది. ఈ కేసులో 2024, ఆగస్టు 23న శిక్ష ఖరారుకావాల్సి ఉండగా ఆలస్యమైంది.
కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం..
– 2023 మే 22న సాయి వర్షిత్ మిస్సోరిలోని సెఇంట్ లూయిస్ నుంచి వాషింగ్‌టన్ డీసీకి చేరుకున్నాడు. అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. రాత్రి 9:35 గంటల ప్రాంతంలో వైట్‌హౌస్ వద్దకు వెళ్లి సైడ్‌వాక్స్ వాహనాన్ని నడిపాడు. దీంతో పాదచారులు ఆందోళనకు గురై పరుగులు పెట్టారు. అనంతరం వైట్‌హౌస్ ఉత్తరభాగం వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్‌ను ఢీకొట్టాడు. తర్వాత ట్రక్కును రివర్స్ చేసి మరోసారి ఢీకొట్టాడు. వాహనం నుంచి కిందకు దిగి నాజీ జెండా పట్టుకుని నినాదాలు చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సాయి వర్షిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ప్లాన్ ప్రకారమే..
సాయి వర్షిత్ పక్కా ప్లాన్ ప్రకారమే వైట్‌హౌస్‌పై దాడికి యత్నించినట్లు విచారణలో తెలిపాడు. 2022 ఏప్రిల్‌లో వర్జీనియాలోని ఓ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థను సంప్రదించి 25 మంది సాయుధ సిబ్బంది, సాయుధ కాన్వాయ్ కావాలని కోరాడు. అది సాధ్యం కాకపోవడంతో ఇతర కంపెనీలను సంప్రదించాడు. ఓ పెద్ద కమర్షియల్ ట్రక్కును అద్దెకు తీసుకుని దాడియి యత్నించాలనుకున్నాడు. చివరకు ఓ చిన్నపాటి ట్రక్కుతో దాడికి యత్నించాడు.