US Presidential Election : అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే అధ్యక్షులు ఎవరో తేల్చేందుకు ప్రముఖ సర్వే సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు అధికార డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, మరోవైపు ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అన్నివర్గాలను ఆకట్టుకునేందుకు హామీలు గుప్పిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకుంటున్నారు. ట్రంప్ ప్రమాదం నుంచి అమెరికాను రక్షించాలని కమలా కోరుతున్నారు. వలసల నుంచి అమెరికాను కాపాడాలంటే కమలా ఓడిపోవాలని ట్రంప్ సూచిస్తున్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో కమలా, ట్రంప్ మధ్య హోరాహోరీగా పోరు ఉంటుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. అనేక సంస్థలు చేసిన సర్వేలలో ఇద్దరి మధ్య ఓట్ల శాతంలో స్వల్ప తేడా మాత్రమే కనిపిస్తోంది. సెప్టెంబర్ వరకు కమలా హారిస్ 2 శాతం ఓట్ల అధిక్యం కనబర్చగా, అక్టోబర్‌లో అదే 2 శాతం ఓట్లతో ట్రంప్ లీడ్‌లోకి వచ్చారు. సర్వే సంస్థలు ఓట్ల తేడాను ప్లస్ లేదా మైనస్‌గా 2 శాతంగా పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపు ఎవరిదో స్పష్టంగా చెప్పలేకపోతున్నాయి.
భారతీయుల మద్దతు ఆమెకే..
ఇక అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు కమలా హారిస్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. తాజాగా నిర్వహించిన సర్వేలో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు 61 శాతం మంది భారతీయులు మద్దతు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్‌కు కేవలం 31 శాతం మాత్రమే మద్దతు లభించింది. ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. యూగన్, కార్నేగి ఎండౌమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సంయుక్తంగా ఈ సర్వే చేశాయి. భారతీయుల మద్దతు హారిస్‌కే ఎక్కువగా ఉన్నా.. ఇది డెమొక్రటిక్ పార్టీకి ప్రతికూల అంశమే. 2020లో నాటి ఎన్నికలతో పోల్చుకుంటే.. డెమొక్రటిక్ అభ్యర్థికి వారి మద్దతు తగ్గింది. నాడు 68 శాతం మంది భారతీయులు బైడెన్‌కు మద్దతు తెలిపారు. ట్రంప్‌కు 22 శాతమే మద్దతు లభించింది. తాజాగా ట్రంఫ్కు మద్దతు 31 శాతానికి పెరిగింది. అంటే 9 శాతం ఎక్కువ. డెమొక్రాట్లుగా గుర్తింపు పొందిన భారతీయ అమెరికన్ల సంఖ్య 56 శాతం నుంచి 47 శాతానిక తగ్గింది. అలాగే పార్టీవైపు మొగ్గు చూపేవారి సంఖ్య 66 శాతం నుంచి 47 శాతానికి పడిపోయింది. ఇది భారతీయ అమెరికన్ అయిన కమలాకు ప్రతికూల అంశమే.
నిర్ణేతలు భారతీయులే..
ఇదిలా ఉంటే.. ఈఎన్నికల్లో భారతీయ అమెరికన్లే అధ్యక్షుడిని నిర్ణయించనున్నారు. అమెరికాకు వలస వచ్చినవారిలో మెక్సికన్ల తర్వాత భారతీయులే ఎక్కువ. ఈసారి ఏడాది ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓట్లు చాలా కీలకంగా మారాయి. సంఖ్యాపరంగా చూస్తే ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నా.. నానాటికీ భారతీయ అమెరికన్ల ప్రభావం పెరుగుతోంది. దీంతో వారిని విస్మరించే పరిస్థితి లేదు. అందుకే రెండు ప్రధాన పార్టీలు భారతీయ అమెరికన్ల ఓట్ల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయి.