Deputy CM Pawan Kaylan : ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో ఒక సినీ హీరో రాజకీయ పార్టీ ని స్థాపించి సఫలం అవ్వడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఒక్క ఎన్నికలలో పోటీ చెయ్యడానికి కనీసం 2 వేల కోట్ల రూపాయిలు ఖర్చు అవుతుంది. అంటే సినీ పరిశ్రమ ద్వారా కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తం రాజకీయాల్లో ఖర్చు చేయాలి. అలా చేసినప్పటికీ కూడా విజయం వరిస్తుందా అంటే అనుమానమే. ఎంతోమంది సినీ ప్రముఖులు ఇలా రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి ఒక్క ఓటమి ఎదురు అవ్వగానే మూసేసిన సందర్భాలు ఉన్నాయి. నేటి తరం సూపర్ స్టార్స్ లో ఒకరైన పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ ని స్థాపించి 2019 ఎన్నికలలో ఘోరమైన పరాజయం పొందిన సంగతి తెలిసిందే.
ఆ పరాజయం తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల నుండి తప్పుకుంటాడు, సినిమాల మీదనే ఎక్కువ ద్రుష్టి పెడతాడని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా, అంత ఓటమి తర్వాత కూడా ఆయన బలంగా నిలబడ్డాడు. 2024 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. స్వర్గీయ నందమూరి తారకరామారావు తర్వాత, సినీ పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ సాధించిన రెండవ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించాడు. అయితే ఇప్పుడు తమిళ హీరో విజయ్ కూడా రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ‘తమిళగ వెట్రి కళగం’ అనే పార్టీ ని స్థాపించిన ఆయన, నిన్న తమిళనాడు లో ‘మానాడు’ మహా సభని ఏర్పాటు చేసి, తన మొట్టమొదటి ప్రసంగాన్ని అందించాడు. తన పార్టీ సిద్ధాంతాలను ప్రకటించి, రాబోయే 2026 సార్వత్రిక ఎన్నికలలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు తెలిపాడు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు శుభాకాంక్షలు తెలియచేసాడు. కాసేపటి క్రితమే హీరో విజయ్ ని ట్యాగ్ చేసి పవన్ కళ్యాణ్ వేసిన ట్వీట్ సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘శ్రీ విజయ్ గారు తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చినందుకు శుభాకాంక్షలు’ అంటూ తెలియచేసాడు.
దీనికి విజయ్ రిప్లై ఇస్తాడో లేదో చూడాలి. 2024 ఎన్నికలలో సంచలన విజయం సాధించినందుకు పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా విజయ్ శుభాకాంక్షలు తెలియచేసాడు. వీళ్లిద్దరు ఇరు రాష్ట్రాలకు చెందిన వారైనప్పటికీ ఒకరిని ఒకరు చాలా గౌరవించుకుంటారు. ముఖ్యంగా విజయ్ పవన్ కళ్యాణ్ కి పెద్ద వీరాభిమాని. తమ్ముడు సినిమాకి దర్శకత్వం వహించిన అరుణ్ కుమార్ ఈ విషయాన్ని అనేక సందర్భాలలో తెలిపాడు. అలాగే పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బంగారం’ మూవీ ఓపెనింగ్ కి అప్పట్లో హీరో విజయ్ విచ్చేసి తన శుభాకాంక్షలు తెలియచేసాడు. అప్పట్లో ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి.
My Heartfelt Congratulations!! to Thiru @actorvijay avl, for embarking on a political journey in Tamilnadu, the land of Saints & Siddhars.
— Pawan Kalyan (@PawanKalyan) October 28, 2024