Jagan-Sharmila : వైఎస్ కుటుంబంలో ఆస్తి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.మాజీ సీఎం జగన్, పిసిసి చీఫ్ షర్మిల మధ్య సాగుతున్న ఈ పోరులో రోజుకో ట్విస్ట్ తప్పడం లేదు. తల్లి విజయమ్మతో పాటు చెల్లెలు షర్మిలపై జగన్ కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ప్రత్యర్థులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.మరోవైపు కుటుంబ సన్నిహితులు మాత్రం రాజీ జరగాలని కోరుకుంటున్నారు. తన తల్లి, చెల్లిని అడ్డం పెట్టుకుని తనను ప్రత్యర్ధులు టార్గెట్ చేస్తున్నారని జగన్ చెబుతున్నారు. అయితే షర్మిల మాత్రం ఇది కేవలం కుటుంబ ఆస్తి వివాదం అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కు సమీప బంధువైన మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఈ వివాదం పై కీలక ప్రతిపాదన చేశారు.పిల్లలిద్దరి మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు తల్లి విజయమ్మ ముందుకు రావాలని సూచించారు. అదే సమయంలో జగన్ వైఖరిని సైతం బాలినేని తప్పు పట్టారు. ఆడపడుచు కన్నీళ్లు ఆ ఇంటికి అరిష్టమని.. దానిని జగన్ గుర్తించుకోవాలని బాలినేని కోరారు. వైసీపీలో ఉండి తాను ఎంతో కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏమీ సంపాదించుకోలేకపోయానని.. ఉన్న ఆస్తులను సైతం పోగొట్టుకున్నానని శ్రీనివాసులరెడ్డి తెలిపారు.తన బిడ్డ సాక్షిగా చెబుతున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు. తనకు సంస్కారం ఉండడం వల్లే పార్టీ మారక దీనిపై ఏమీ మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.
* రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో
బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక వెలుగు వెలిగారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. వై వి సుబ్బారెడ్డి కి ఈయన స్వయానా బావ.వై విసుబ్బారెడ్డి జగన్ బాబాయ్. ఈ విధంగా వారితో బాలినేనికి బంధుత్వం ఉంది. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేశారు బాలినేని. జగన్ సైతం బాలినేని కి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. గెలిచిన వెంటనే క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో భాగంగా పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి రచ్చ జరుగుతూనే ఉంది.చివరకు ఇటీవల బాలినేని వైసీపీని వీడారు. జనసేనలో చేరారు. అయితే ఇలా కార్యక్రమంలో వైసీపీపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ కుటుంబ వివాదం బయటకు వచ్చేసరికి స్పందించారు. జగన్ పై ఆరోపణలు చేస్తూనే విజయమ్మకు కీలక సూచనలు చేశారు బాలినేని.
* వైసీపీలో ఇబ్బందులు
వైసీపీలో చాలా రోజులు ఇబ్బంది పడుతూ వచ్చారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.ఒకానొక దశలో ఆయన షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం సాగింది. ఒకటి రెండుసార్లు విజయమ్మను సైతం కలిశారు.అయితే దగ్గర బంధువులు కావడంతోనే అప్పట్లో కలిశారని టాక్ నడిచింది. అయితే బాలినేని అనూహ్యంగా జనసేనలోకి రావడంతో కాంగ్రెస్ లోకి వెళ్లరని తేలిపోయింది.ఇప్పుడు తనకు ఆదరించిన కుటుంబంలో వివాదం రావడంతో బాలినేని స్పందించాల్సి వచ్చింది.