India US corn trade deal: భారతదేశంలో మొక్కజొన్న ఉత్పత్తి గత సంవత్సరాల్లో గణనీయంగా పెరిగినా, అంతర్జాతీయ వాణిజ్య ఒత్తిడులు, అమెరికా సబ్సిడీల కారణంగా చౌకగా లభిస్తున్న జీఎం మొక్కజొన్న భారత రైతులకు కొత్త సవాళ్లను తెస్తున్నాయి. దిగుమతి విధానం, రాజకీయ ప్రభావాలు, రైతుల ప్రయోజనాలు, ప్రజారోగ్యం వంటి అనేక అంశాలు సమగ్ర పరిశీలనకు వస్తున్నాయి. 2024–25 వ్యవసాయ సంవత్సరంలో భారత్ సుమారు 3.7 కోట్ల టన్నుల మొక్కజొన్న పండించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ప్రధాన ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయి. ప్రభుత్వం 2025–26 సీజన్‌కు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కిలోకు రూ.24గా ప్రకటించింది.
అమెరికన్ మొక్కజొన్న చీప్..
అమెరికాలో 25.4 కిలోల బషెల్ ధర జూలైలో 4.29 డాలర్లు మాత్రమే. అంటే కిలోకు సుమారు రూ.15 మాత్రమే. తక్కువ ధరకు కారణం అక్కడి ప్రభుత్వ భారీ సబ్సిడీలు. ఈ ధర తేడా వల్ల అమెరికన్ మొక్కజొన్న భారత్‌కు దిగుమతి అయితే స్వదేశీ రైతుల ఉత్పత్తి నేరుగా నష్టపోతుంది.
డబ్ల్యూటీవో నిబంధనలు..
వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్ ప్రతి సంవత్సరం 15% సుంకంతో 5 లక్షల టన్నుల మొక్కజొన్న దిగుమతి చేయాలి. దీని కంటే ఎక్కువ దిగుమతులపై 50% సుంకం వర్తిస్తోంది. ఇది పూర్తిగా దేశీయ రైతుల ప్రయోజనాలను కాపాడటానికే రూపొందించిన విధానం.
జీఎం మొక్కజొన్నతో ప్రమాదాలు
– జీవ వైవిధ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం.
– పశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం.
– ఆహార భద్రత, ప్రజల ఆరోగ్యం వంటి అంశాలపైనా ఆందోళనలు ఉన్నాయి.
– అమెరికన్ రైతులకు మొక్కజొన్న కీలక ఆదాయం కావడంతో, అక్కడి నాయకత్వం దీనిపై మేజర్ ఒత్తిడి తెస్తోంది.
– ట్రంప్ శాసన, రాజకీయ మద్దతు పొందడానికి భారత్‌పై ఒత్తిడిని పెంచుతాడనే అంచనాలు ఉన్నాయి.
– భారతీయ రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుంటే కేంద్ర ప్రభుత్వం దిగుమతులపై ఒప్పుకోవడం రాజకీయపరంగా సవాలే.
భారత్ వ్యూహం ఏంటి?
జీఎం కాని సేంద్రియ మొక్కజొన్న దిగుమతినే ఆమోదించాలి. సమయ పరిమితులు విధించడం అవసరం: కోతలకు 2 నెలల ముందు నుండి, కోతల తర్వాత 3 నెలల వరకూ దిగుమతులు నిషేధించాలి. పరిమిత పరిమాణాలు మాత్రమే అనుమతించాలి, తద్వారా మార్కెట్‌పై ప్రభావం తక్కువగా ఉంటుంది. రైతులకు రక్షణ ఇవ్వడానికి ఎంఎస్‌పీ కొనుగోళ్లను పెంచి, నిల్వ సౌకర్యాలను బలోపేతం చేయాలి.
అమెరికన్ జీఎం మొక్కజొన్న దిగుమతులు కేవలం ఆర్థిక సమస్య కాదు, ప్రజారోగ్యం, దేశీయ వ్యవసాయం, రాజకీయ ప్రాధాన్యం అన్నింటికీ సంబంధం ఉంది. మనపై అనవసర టారిఫ్‌లు వేసి ఇబ్బంది పడెతున్న ట్రంప్‌కు మనం ఎందుకు మేలు చేయాలి. డబ్ల్యూటీవో ఒత్తిడులకన్నా మన రైతుల ఆసక్తులను ముందుంచే విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి.