India-EU Deal: 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భారత్, యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎన్‌డీఏ) ఎట్టకేలకు కుదిరింది. ఈ ఒప్పందం భారత్, ఈయూ వ్యాపారంలో గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ, ఈయూ నేతలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, ఆంటోనియో కోస్టా సంయుక్త ప్రకటనలో 13 ఒప్పందాలు ధ్రువీకరించారు. భారత్ నుంచి 99% ఎగుమతులు, ఈయూ నుంచి 97%పై సుంకాలు తగ్గుతాయి. టెక్స్‌టైల్స్, లెదర్ వస్తువులు, హస్తకళలు, సముద్ర ఉత్పత్తులకు ఐరోపా మార్కెట్లు తెరుచుకుంటాయి. ఐరోపా మద్యం, వాహనాలు, ఔషధాలు భారత్‌లో చౌకగా అందుబాటులోకి వస్తాయి. భద్రతా సహకారం, నిపుణుల వలసలు కూడా బలపడతాయి.
పాకిస్తాన్ ఆందోళన..
భారత్–ఈయు ఒప్పందం పాకిస్తాన్‌ను కలవరపెడుతోంది. పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ మాట్లాడుతూ ఈ డీల్‌ను గమనిస్తున్నామని చెప్పారు. 2014లో లభించిన జీఎస్‌పీ+ స్థితి ద్వారా రాయితీ సుంకాలతో టెక్స్‌టైల్స్ ఎగుమతులు 108% పెరిగి, వాణిజ్యం 12 బిలియన్ యూరోలకు చేరింది. ఈ ఒప్పందం 2025 డిసెంబర్‌తో ముగిసింది. ఇప్పుడు భారత్ డీల్ భారీ పోటీ తీసుకొస్తుందని పాక్ ఆందోళన చెందుతోంది. ఈయూ చర్చల్లో దీర్ఘకాల సంబంధాలు కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
పాక్ ఎగుమతులకు ప్రభావం?
భారత్ చౌక సుంకాలతో ఐరోపా మార్కెట్‌లో టెక్స్‌టైల్స్, దుస్తుల్లో పాక్ ఆధిపత్యాన్ని తగ్గిస్తుంది. జీఎస్‌పీ+ పొడిగించుకోవడానికి ఈయూ అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయి, కానీ భారత్ ఒప్పందంతో పొడిగించే అవకాశాలను బలహీనపరుస్తోంది. దీంతో పాక్ ఎగుమతులు 20–30% పడిపోవచ్చు, టెక్స్‌టైల్ ఎగుమతులు గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. ఈ మార్పు పాక్ ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ తీస్తుంది.
ఈ ఒప్పందం ప్రపంచ జీడీపీలో 25%, వాణిజ్యంలో 3వ స్థానాన్ని భారత్–ఈయూ సాధిస్తుంది. చిన్న పరిశ్రమలు, రైతులకు ఐరోపా మార్కెట్లు తెరుచుకుంటాయి. పాక్‌కు ఇది హెచ్చరిక, భారత్‌కు అవకాశాల వర్షం.