Houthis: అమెరికా అంటే రక్షణ పరంగా దుర్భేద్యమైన దేశం. దేశానికి ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వారి సొంత ప్రాంతానికి వెళ్లి మట్టు పెట్టగల నేర్పరితనం దాని సొంతం. భూతలం, గగనతలం, జలమార్గం.. ఇలా అన్ని రంగాలలో అమెరికా శక్తివంతమైన దేశం. అలాంటి దేశాన్ని హౌతీలు ఒక ఆట ఆడుకుంటున్నారు. ఎర్ర సముద్రంలో ఏడిపిస్తున్నారు. అమెరికాకు చెందిన, అమెరికా వెళ్తున్న వాణిజ్య నౌకలను హైజాక్ చేస్తున్నారు. దారి మళ్ళిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో తోపులాంటి అమెరికాకు చిక్కకుండ దాస్తున్నారు.
పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడిని నిరసిస్తూ హౌతీలు కొంతకాలంగా దాడులకు పాల్పడుతున్నారు. ఇజ్రాయిల్ దేశానికి అనుకూలంగా ఉన్న అమెరికాపై నిప్పులు కక్కుతున్నారు. ఇజ్రాయిల్ వెంటనే దాడులు మానుకోవాలని ఎర్ర సముద్రంలో పాగా వేశారు. ముఖ్యంగా యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇంగ్లాండ్ లోని కొన్ని ప్రాంతాలకు సరుకులు రవాణా చేస్తున్న నౌకలను అడ్డుకుంటున్నారు. హైజాక్ చేసి సోమాలియా కి తరలిస్తున్నారు. అంతేకాదు తాము హైజాక్ చేసిన నౌకల్లో డాన్సులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అయితే గతంలో హౌతీలు అమెరికాకు చెందిన ఒక నౌకను ఎర్ర సముద్రంలో హైజాక్ చేయగా.. ఆ సమాచారం భారత నావికా దళానికి రావడంతో.. ఆ కుట్రను చేదించింది. హౌతీల నుంచి ఆ నౌకను కాపాడి అమెరికాకు అప్పగించింది. ఎప్పుడైతే భారత్ ఈ పని చేసిందో.. వెంటనే అమెరికా మేల్కొంది.
బ్రిటన్ సహాయంతో హౌతీల స్థావరాలపై ఆరుసార్లు దాడులు చేసింది. బ్రిటన్ కూడా ఒకసారి దాడి చేసింది. అయినప్పటికీ హౌతీలు తాము హైజాక్ చేసిన నౌకల సమాచారం అమెరికాకు చెప్పలేదు. అంతేకాదు ఎర్ర సముద్రంలో హౌతీలు తమ పట్టు పెంచుకుంటున్నారు. ఒకవైపు తమ స్థావరాలపై అమెరికా దాడులు చేస్తున్నప్పటికీ ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అత్యంత శక్తివంతమైన అమెరికా కూడా వారిని ఏం చేయలేకపోతోంది. మరి భారత్ వల్ల అయింది.. అమెరికా వల్ల ఎందుకు కాలేకపోతోంది? హౌతీలను ఎందుకు నిలువరించలేకపోతోంది? మీసం తన నౌకల జాడను ఎందుకు పసిగట్టలేకపోతోంది?
హౌతీల ధాటికి అగ్రరాజ్యం నిలబడలేకపోతోందా? లేకుంటే వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోందా? హౌతీలను మొత్తం లేకుండా చేసే ప్రణాళిక ఏమైనా రచిస్తోందా? ఈ ప్రశ్నలకు కాలం గడిస్తే కానీ సమాధానం లభించేలా లేదు.