London Balaji Temple: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశశ్వరస్వామి. తిరుమలలో కొలువైన ఆ కోనేటి రాయుడి దర్శనం కోసం నిత్యం వేలాది మంది వస్తుంటారు. గంటల తరబడి క్యూలైన్లలో బారులు తీరి దర్శించుకుంటారు. ఇక తిరుమల రాలేని భక్తుల కోసం టీటీడీ అనేక ప్రాంతాల్లో వేకంటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తోంది. తాజాగా లండన్‌లోనూ ఆ ఏడుకొండలవాడి ఆలయం ఇటీవల నిర్మించారు. ఆలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు.
స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో..
లండన్‌లో శ్రీవేకంటేశ్వర(బాలాజీ) టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(ఎస్‌వీబీటీసీసీ) 2019లో ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే లండన్‌లోని బ్రాక్నెల్‌లో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో పురాతన హిందూ గ్రంథాలు, శిల్ప స్థాపత్య శాస్త్రాలను అనుసరించి శుభకార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ, ఇతర అర్చకుల సారథ్యంలో శ్రీవేకంటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారి ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు.
అతిపెద్ద ఆలయం ఇదే..
ఇక లండన్‌లో నిర్మించిన అతిపెద్ద వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలన్న విస్తృత ఆశయానికి ఇది మైలురాయిగా నిలిచిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వేడుకల్లో ఎస్‌వీబీటీసీసీ ట్రస్టీలు డాక్టర్ రాములు దాసోజు, కృష్ణకిశోర్, సురేశ్‌రెడ్డి, కమలా కోటచర్ల, ప్రవీణ్ మస్తీ, సురేశ్ గోపతి, భాస్కర్ నీల, పావనిరెడ్డి, సహా ఎగ్జిక్యూటివ్ టీమ్ సభ్యులు తుకారాంరెడ్డి, రవి వాసా, రవి శ్రీరంగం, వంశీ.వి, వంశీ.బి, విశ్వేశ్వర్ గోవర్ధన్, రాఘవేంద్ర, గౌతంశాస్త్రి, గోపి కొల్లూరు, వాలంటీర్లు హాజరయ్యారు. ఈ ఆలయం వారంలో అన్ని రోజులు ఉదయం, సాయంత్రం తెరిచి ఉంటుందని తెలిపారు.