Trump:ఎన్నికల్లో ట్రంప్ విజయ సాధిస్తే భారత్ కు పెద్ద దెబ్బ.. ఏ ఏ రంగాలకు నష్టమంటే

నవంబర్ 5న ఎన్నికలు జరుగుతుండడం.. కేవలం మరో పది రోజులే సమయం ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు రానున్న ఫలితాలపై అంచనాలతో అప్రమత్తం అవుతున్నాయి.

Written By: Rocky, Updated On : October 25, 2024 9:52 pm

Trump

Follow us on

Trump:అమెరికాలో అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాల దృష్టి ఉంది. డొనాల్డ్ ట్రంప్ తిరిగి వైట్‌హౌస్‌కు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ అవకాశాల వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ట్రంప్‌పై జరిగిన ఘోరమైన దాడి ఆయనకు అనుకూలంగా మారిందని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సిలికాన్ వ్యాలీ నుంచి వస్తున్న మద్దతు కూడా ట్రంప్ గెలిచే ఆశలను పెంచుతోంది. ఎలాన్ మస్క్, ఆండ్రీసెన్ హోరోవిట్జ్ ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. సిలికాన్ వ్యాలీ విధానంలో ఈ మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. ఈ విషయాలను భారత్ నుంచి కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. నవంబర్ 5న ఎన్నికలు జరుగుతుండడం.. కేవలం మరో పది రోజులే సమయం ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు రానున్న ఫలితాలపై అంచనాలతో అప్రమత్తం అవుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ విజయం భారత్‌పై ఎటువంటి ప్రభావం చూపిస్తుందనే అంశంపై ఫిలిప్‌ క్యాపిటల్‌ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది.

అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ విజయం సాధిస్తే వీసా విధానాలు మరింత కఠినతరంగా మారతాయని నిపుణులు అంటున్నారు. ఇవి ఐటీ కంపెనీలకు సవాళ్లను విసురుతాయని నివేదిక పేర్కొంది. దీంతో కంపెనీలు ఇబ్బందులు తగ్గించుకోవడానికి అత్యధికంగా ఆన్‌సైట్‌ మార్కెట్లలో తమ దేశానికి చెందిన వారినే నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నివేదిక తెలిపింది. దీంతోపాటు నియర్‌ షోర్‌ డెలివరీ సెంటర్ల సంఖ్యను పెంచాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఆటోమొబైల్‌ రంగం విషయానికి వస్తే భారత్‌ నుంచి విడిభాగాల ఎగుమతులు తగ్గుముఖం పట్టవచ్చని పేర్కొంది. ట్రంప్‌ ఎలక్ట్రిక్ వాహనాలకు ఇన్సెంటివ్‌లను తగ్గించే అవకాశాలుండడంతో భారత్‌ నుంచి ఎగుమతి అయ్యే వాటి స్పేర్‌పార్టులపై స్వల్పకాలం పాటు ప్రతికూల ప్రభావం ఉంటుందని నివేదిక అంచనా వేసింది. అదే సమయంలో హైబ్రీడ్‌ వాహనాల మార్కెట్‌ వృద్ధి చెందడంతో కాస్త కుదురుకుంటుందని ఫిలిప్‌ క్యాపిటల్‌ సంస్థ తెలిపింది. దీంతోపాటు ట్రంప్‌ భారీ ఇన్ఫ్రాప్లాన్లతో క్లాస్‌-8 శ్రేణి ట్రక్కులకు డిమాండ్‌ పెరగడం భారత ఆటోమొబైల్‌ స్పేర్‌ పార్టుల రంగానికి కలిసొస్తుందని పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్‌ అధ్యక్షుడు అయితే అత్యధికంగా శిలాజ ఇంధనానికే ప్రాధాన్యం ఇస్తారని ఫిలిప్‌ క్యాపిటల్‌ సంస్థ నివేదిక పేర్కొంది. ఫలితంగా అమెరికాలో ముడిచమురు, గ్యాస్‌ ఉత్పత్తి గణనీయంగా పెరిగి.. వరల్డ్ వైడ్ గా వాటి ధరలు పడిపోవచ్చని విశ్లేషించింది. ఇది రిఫైనరీ రంగానికి, కస్టమర్లకు ప్రయోజనకరంగా ఉంటుందని ఫిలిప్‌ క్యాపిటల్‌ వెల్లడించింది.

ఇక కమల హారిస్, డొనాల్డ్ ట్రంప్‌ ఇద్దరూ ఇండో-పసిఫిక్‌ వ్యూహానికి మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో కమలా హారిస్‌ గెలిస్తే.. రక్షణపరమైన సమన్వయం పెంచడంపై దృష్టిపెడతారని.. అదే ట్రంప్‌ ఆయుధ విక్రయాల వంటి లావాదేవీలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తారని ఫిలిప్ క్యాపిటల్ సంస్థ పేర్కొంది. ఇక చైనాపై ట్రంప్‌ టారీఫ్‌ యుద్ధం మళ్లీ మొదలుపెడితే మాత్రం భారత సంస్థలకు కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా టెక్స్‌టైల్స్‌, ఆటోమొబైల్‌ విడిభాగాలు, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థలు అమెరికా మార్కెట్లోకి బలంగా వెళ్లేందుకు మార్గం లభిస్తుందని సదరు నివేదిక చెప్పింది. అదే సమయంలో ప్రత్యక్ష పెట్టుబడులు భారత్‌ దేశం వైపు మళ్లుతాయని నివేదిక అభిప్రాయపడింది.